IMAX in Hyderabad Returns: మహేష్ బాబు 'ఏఎంబీ'తో హైదరాబాద్‌కు ఐమాక్స్ గ్రాండ్ రీఎంట్రీ.. ఎప్పటినుంచంటే?

IMAX in Hyderabad Returns: భాగ్యనగర సినీ ప్రియులకు అదిరిపోయే అప్‌డేట్. సూపర్ స్టార్ మహేష్ బాబు భాగస్వామ్యంలో ఉన్న 'ఏఎంబీ క్లాసిక్ సుదర్శన్' థియేటర్‌లోకి సరికొత్త లేజర్ సాంకేతికతతో కూడిన ఐమాక్స్ స్క్రీన్ రాబోతోంది. ఈ ఏడాది (2026) చివరి నాటికే ఇది ప్రేక్షకులకు అందుబాటులోకి రానుంది.

Published on: Jun 1, 2026, 17:09:27 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

IMAX in Hyderabad Returns: హైదరాబాద్ సినీ ప్రియుల దశాబ్ద కాలపు నిరీక్షణకు తెరపడనుంది. భాగ్యనగరంలో మళ్లీ ఐమాక్స్ (IMAX) స్క్రీన్ హంగామా షురూ కాబోతోంది. ప్రముఖ డిస్ట్రిబ్యూటర్ ఏషియన్ సునీల్ కొద్దిరోజుల క్రితం ఇచ్చిన హింట్ నిజమైంది.

IMAX in Hyderabad Returns: మహేష్ బాబు 'ఏఎంబీ'తో హైదరాబాద్‌కు ఐమాక్స్ గ్రాండ్ రీఎంట్రీ.. ఎప్పటినుంచంటే?
IMAX in Hyderabad Returns: మహేష్ బాబు 'ఏఎంబీ'తో హైదరాబాద్‌కు ఐమాక్స్ గ్రాండ్ రీఎంట్రీ.. ఎప్పటినుంచంటే?

సూపర్ స్టార్ మహేష్ బాబు నేతృత్వంలోని 'ఏఎంబీ సినిమాస్' భాగస్వామ్యంతో సరికొత్త లేజర్ ఐమాక్స్ థియేటర్ మన ముందుకు వస్తోంది. ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లోని ప్రసిద్ధ ఏఎంబీ క్లాసిక్ సుదర్శన్ (AMB Classic Sudarshan) వేదికగా ఈ అద్భుత థియేటర్ ఆవిష్కృతం కానుంది.

ఏఎంబీ సినిమాస్ ఐమాక్స్ డీల్

ప్రముఖ అంతర్జాతీయ మీడియా సంస్థ 'వెరైటీ' కథనం ప్రకారం.. ఐమాక్స్ కార్పొరేషన్, ఏషియన్ సినిమాస్ సంస్థలు భారత్‌లో మూడు సరికొత్త 'ఐమాక్స్ విత్ లేజర్' (IMAX with Laser) స్క్రీన్లను ఏర్పాటు చేయడానికి అధికారిక ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఏఎంబీ సినిమాస్ బ్రాండ్ కింద ఈ స్క్రీన్లు రానున్నాయి. ఇందులో మొదటి స్క్రీన్‌ను హైదరాబాద్‌లోని ఏఎంబీ క్లాసిక్ లో నెలకొల్పుతున్నారు.

ఈ ఏడాది (2026) డిసెంబర్ నాటికే ఈ థియేటర్ ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతోందని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. మిగిలిన రెండు స్క్రీన్లను 2028 నాటికి అందుబాటులోకి తెచ్చేలా ప్రణాళికలు రూపొందించారు.

ప్రసాద్స్ ఐమాక్స్ జ్ఞాపకాలు.. మహేష్, రాజమౌళి 'వారణాసి' కనెక్షన్

హైదరాబాద్‌కు, ఐమాక్స్‌కు విడదీయరాని బంధం ఉంది. 2015 వరకు నెక్లెస్ రోడ్‌లోని ప్రసాద్స్ ఐమాక్స్ ప్రపంచంలోనే అత్యంత ప్రజాదరణ పొందిన స్క్రీన్లలో ఒకటిగా నిలిచింది. సాంకేతిక మార్పుల కారణంగా 2015లో ప్రసాద్స్ థియేటర్లో పాత ఐమాక్స్ ఫార్మాట్ ప్రదర్శనలు నిలిచిపోయాయి. అప్పటి నుంచి హైదరాబాద్ ప్రేక్షకులు ఒక భారీ స్క్రీన్ అనుభూతి కోసం ఎదురుచూస్తున్నారు.

ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబు, ఎస్.ఎస్. రాజమౌళి కాంబినేషన్‌లో వస్తున్న భారీ అడ్వెంచర్ మూవీ 'వారణాసి'ని ఐమాక్స్ సర్టిఫైడ్ డిజిటల్ కెమెరాలతో చిత్రీకరిస్తున్నారు. ఈ సినిమా వచ్చే ఏడాది (2027) విడుదల కానుంది. ఈ లోపే హైదరాబాద్‌లో సరికొత్త టెక్నాలజీతో ఐమాక్స్ స్క్రీన్ అందుబాటులోకి రావడం తెలుగు సినిమా స్థాయిని అంతర్జాతీయ వేదికపై మరింత పెంచనుంది. మహేష్ సినిమాను మహేష్ కి చెందిన ఐమాక్స్ లోనే చూసే లక్ ఫ్యాన్స్ కి దక్కనుంది.

సినీ ప్రియులకు దక్కిన గౌరవం

"హైదరాబాద్ ప్రజలకు సినిమా అంటే ఉన్న పిచ్చి, ప్రేమ మరెక్కడా చూడలేం. అలాంటి నగరానికి మళ్లీ ప్రతిష్టాత్మక ఐమాక్స్ ఫార్మాట్‌ను తీసుకురావడం ఏఎంబీ సినిమాస్‌కు దక్కిన గొప్ప గౌరవంగా భావిస్తున్నాం. నాణ్యతకు, అత్యుత్తమ సినిమా అనుభూతికి ఏఎంబీ కేరాఫ్ అడ్రస్. ప్రేక్షకులకు అత్యంత అద్భుతమైన విజువల్స్ అందించాలనే మా ప్రయత్నంలో ఐమాక్స్‌తో జతకట్టడం సరైన అడుగు" అని ఏషియన్ గ్రూప్ ప్రతినిధులు సునీల్ నారంగ్, భరత్ నారంగ్ సంతోషం వ్యక్తం చేశారు.

ఈ ప్రతిష్టాత్మక ఒప్పందంపై ఐమాక్స్ చీఫ్ కమర్షియల్ ఆఫీసర్ జియోవన్నీ డోల్చి కూడా హర్షం వ్యక్తం చేస్తూ.. "భారత్‌లో మాకు అత్యంత కీలకమైన మార్కెట్ హైదరాబాద్. ఐమాక్స్ అనుభూతి కోసం ప్రేక్షకులు గంటల తరబడి ప్రయాణం చేసి ఇతర నగరాలకు వెళ్తున్నారని విన్నప్పుడు గర్వంగా అనిపించినా, వారికి ఆ సౌకర్యం స్థానికంగా అందించలేకపోతున్నామే అనే అసంతృప్తి ఉండేది. అందుకే ఏఎంబీతో కలిసి ఈ లేజర్ సాంకేతికతను నేరుగా హైదరాబాద్‌లోనే అందిస్తున్నాం" అని వివరించారు.

హెచ్‌టీ విశ్లేషణ

ఈ డీల్ హైదరాబాద్ థియేట్రికల్ బిజినెస్ స్వరూపాన్నే మార్చేయబోతోంది. ఆర్టీసీ క్రాస్ రోడ్స్ అంటేనే సింగిల్ స్క్రీన్స్ కు కేరాఫ్ అడ్రస్. అలాంటి మాస్ ఏరియాలో అల్ట్రా ప్రీమియం 'ఐమాక్స్ లేజర్' రావడం ఒక బిగ్ గేమ్ ఛేంజర్.

భవిష్యత్తులో వచ్చే పాన్ ఇండియా సినిమాలకు ఈ థియేటర్ కలెక్షన్స్ కీ రోల్ ప్లే చేస్తాయి. టికెట్ ప్రైసింగ్ లో కూడా ఐమాక్స్ ఫార్మాట్ కి ఉండే వెసులుబాటు వల్ల బాక్సాఫీస్ రికార్డులు కూడా మరింత వేగంగా బ్రేక్ అయ్యే ఛాన్స్ ఉంది.

People Also Ask (FAQs)

హైదరాబాద్‌లో కొత్త ఐమాక్స్ థియేటర్ ఎక్కడ ప్రారంభం కానుంది?

ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లోని ప్రసిద్ధ 'ఏఎంబీ క్లాసిక్ సుదర్శన్' (AMB Classic Sudarshan) థియేటర్‌లో ఈ సరికొత్త లేజర్ ఐమాక్స్ స్క్రీన్‌ను ఏర్పాటు చేస్తున్నారు. ఇది సూపర్ స్టార్ మహేష్ బాబు, ఏషియన్ సినిమాస్ సంయుక్త భాగస్వామ్యంలో నడుస్తోంది.

హైదరాబాద్ ఏఎంబీ ఐమాక్స్ స్క్రీన్ ఎప్పటి నుంచి అందుబాటులోకి వస్తుంది?

ఏషియన్ సినిమాస్, ఐమాక్స్ ఒప్పందం ప్రకారం ఈ సరికొత్త 'ఐమాక్స్ విత్ లేజర్' థియేటర్ ఈ ఏడాది (2026) డిసెంబర్ నాటికి ప్రేక్షకులకు అందుబాటులోకి రానుంది.

గతంలో ఉన్న ప్రసాద్స్ ఐమాక్స్ ఏమైంది?

నెక్లెస్ రోడ్‌లోని ప్రసాద్స్ ఐమాక్స్ భారతదేశంలోనే తొలి ఐమాక్స్ స్క్రీన్లలో ఒకటిగా చరిత్ర సృష్టించింది. అయితే, టెక్నాలజీ మారడం వల్ల పాత ఐమాక్స్ రీల్ ఫార్మాట్ ప్రదర్శనలను 2015లో నిలిపివేశారు.

ఏఎంబీ సినిమాస్ ఐమాక్స్ స్క్రీన్ల కోసం ఎన్ని చోట్ల ఒప్పందం చేసుకుంది?

ఐమాక్స్ కార్పొరేషన్, ఏషియన్ సినిమాస్ సంస్థలు భారత్‌లో మొత్తం మూడు సరికొత్త 'ఐమాక్స్ విత్ లేజర్' స్క్రీన్లను ఏర్పాటు చేయడానికి ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఇందులో మొదటిది హైదరాబాద్‌లో రాగా, మిగిలిన రెండు 2028 నాటికి రానున్నాయి.

  • Hari Prasad S
    ABOUT THE AUTHOR
    Hari Prasad S

    హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More