Web Series: ఓటీటీ ప్రపంచంలో కామెడీ, హారర్, యాక్షన్ థ్రిల్లర్లు ఎన్నో వస్తుంటాయి. కానీ చూస్తున్నంత సేపు కళ్లు తిప్పుకోనివ్వకుండా ఉత్కంఠ రేపుతూనే, క్లైమాక్స్ వచ్చేసరికి గుండెను బరువెక్కించి కంటతడి పెట్టించే వెబ్ సిరీస్‌లు చాలా అరుదుగా వస్తాయి. అలాంటి ఒక అద్భుతమైన ఎమోషనల్ క్రైమ్ డ్రామా వెబ్ సిరీస్ 'గ్రహణ్' (Grahan).

ఐఎండీబీలో ఏకంగా 8.3 రేటింగ్ సొంతం చేసుకున్న ఈ సిరీస్, ప్రముఖ ఓటీటీ వేదిక జియోహాట్‌స్టార్ (JioHotstar)లో హిందీతో పాటు తెలుగులోనూ స్ట్రీమింగ్ అవుతోంది. 1984, 2016 అనే రెండు వేర్వేరు కాలాల నేపథ్యంలో సాగే ఈ సిరీస్ కథాంశం, విశేషాలు తెలుసుకుంటే మీరు కూడా తప్పకుండా మీ వాచ్‌లిస్ట్‌లో చేర్చుకుంటారు.
కథాంశం ఏమిటి? తండ్రే ప్రధాన నిందితుడిగా తేలితే..
ఈ కథ 2016 సంవత్సరంలో నిజాయితీపరురాలైన యువ ఐపీఎస్ ఆఫీసర్ అమృతా సింగ్ (జోయా హుస్సేన్) చుట్టూ మొదలవుతుంది. 1984లో జరిగిన సిక్కు వ్యతిరేక అల్లర్ల కేసును తిరిగి దర్యాప్తు చేసే బాధ్యత అమృతా సింగ్‌కు అప్పగిస్తారు. ఎంతో నిబద్ధతతో విచారణ ప్రారంభించిన ఆమెకు, కేసు లోతుల్లోకి వెళ్లే కొద్దీ దిగ్భ్రాంతికరమైన నిజాలు తెలుస్తాయి.
ఆ అల్లర్ల కేసులో లభించిన కీలక ఆధారాలన్నీ తన సొంత తండ్రి గుర్సేవక్ సింగ్ (పవన్ మల్హోత్రా) వైపే ప్రధాన నిందితుడిగా వేలెత్తి చూపిస్తాయి. ప్రాణానికి ప్రాణంగా ప్రేమించే తండ్రి గతానికి సంబంధించిన ఈ చేదు నిజం తెలిశాక, అమృత ఒక కూతురిగా తండ్రిని కాపాడుకుంటుందా? లేక ఒక పోలీస్ ఆఫీసర్‌గా నిజాన్ని బయటపెడుతుందా? అనే సంఘర్షణ ప్రేక్షకులను కట్టిపడేస్తుంది.
కంటతడి పెట్టించే 'రిషి - మను'ల విషాద ప్రేమకథ
అమృత దర్యాప్తు ముందుకు సాగే కొద్దీ కథ 1984 నాటి గతాన్ని ఆవిష్కరిస్తుంది. అక్కడ రిషి రంజన్ (అన్షుమాన్ పుష్కర్) అనే హిందూ యువకుడు, మంజీత్ అలియాస్ మను ఛాబ్రా (వామికా గబ్బి) అనే సిక్కు యువతి మధ్య అల్లుకున్న స్వచ్ఛమైన ప్రేమకథ మొదలవుతుంది.
{{/usCountry}}అమృత దర్యాప్తు ముందుకు సాగే కొద్దీ కథ 1984 నాటి గతాన్ని ఆవిష్కరిస్తుంది. అక్కడ రిషి రంజన్ (అన్షుమాన్ పుష్కర్) అనే హిందూ యువకుడు, మంజీత్ అలియాస్ మను ఛాబ్రా (వామికా గబ్బి) అనే సిక్కు యువతి మధ్య అల్లుకున్న స్వచ్ఛమైన ప్రేమకథ మొదలవుతుంది.
{{/usCountry}}అయితే దేశవ్యాప్తంగా చెలరేగిన మత అల్లర్లు, స్వార్థపూరిత రాజకీయ కుట్రలు, నమ్మకద్రోహాల సుడిగుండంలో వీరి అమాయకపు ప్రేమకథ చిక్కుకుంటుంది. 1984 నాటి ప్రేమకథకు, 2016 నాటి ఐపీఎస్ ఆఫీసర్ అమృత తండ్రికి ఉన్న అసలు సంబంధం ఏమిటనేది తెరపై చూస్తున్నప్పుడు ఎవరికైనా కళ్లు చెమర్చక మానవు.
వివాదాలను దాటుకుని ఘనవిజయం.. 'చౌరాసీ' నవల ఆధారంగా..
ప్రముఖ హిందీ రచయిత సత్య వ్యాస్ రాసిన అత్యంత ప్రజాదరణ పొందిన నవల 'చౌరాసీ' (Chaurasi) ఆధారంగా ఈ వెబ్ సిరీస్‌ను రూపొందించారు. శైలేంద్ర కుమార్ ఝా క్రియేటర్‌గా వ్యవహరించగా, రంజన్ చందేల్ అత్యంత హృద్యంగా దర్శకత్వం వహించారు.
జూన్ 24, 2021న ఈ సిరీస్ విడుదలయ్యే సమయంలో సున్నితమైన అంశాలు ఉన్నాయంటూ కొన్ని వర్గాల నుంచి తీవ్ర అభ్యంతరాలు, నిషేధించాలనే డిమాండ్లు వ్యక్తమయ్యాయి. కానీ విడుదలైన తర్వాత ఇందులోని మానవీయ కోణం, నటీనటుల అద్భుత అభినయానికి విమర్శకులు, ప్రేక్షకుల నుంచి ప్రశంసల వర్షం కురిసింది.
జియోహాట్‌స్టార్‌లో తెలుగు సహా 7 భాషల్లో అందుబాటులో..
మొత్తం 8 ఎపిసోడ్లు ఉన్న ఈ సిరీస్‌లో ప్రతి ఎపిసోడ్ సుమారు 45 నుంచి 55 నిమిషాల నిడివితో ఎక్కడా బోర్ కొట్టకుండా సాగుతుంది. పవన్ మల్హోత్రా, జోయా హుస్సేన్, వామికా గబ్బి, అన్షుమాన్ పుష్కర్ తమ పాత్రల్లో జీవించేశారు.
ప్రస్తుతం జియోహాట్‌స్టార్ వేదికగా తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళం, బెంగాలీ, మరాఠీ భాషల్లో 'గ్రహణ్' అందుబాటులో ఉంది. ఒక మంచి ఎమోషనల్ థ్రిల్లర్ చూడాలనుకునే వారికి ఇది బెస్ట్ ఛాయిస్.
ABOUT THE AUTHOR
హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.