OTT Crime Thriller: ఓటీటీలోని బెస్ట్ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్‌లలో ఒకటి.. 7.7 రేటింగ్.. మిస్ కాకుండా చూడండి

OTT Crime Thriller: సస్పెన్స్, క్రైమ్ థ్రిల్లర్ జానర్లను ఇష్టపడే ఓటీటీ ప్రేక్షకులకు ప్రముఖ స్ట్రీమింగ్ వేదిక సోనీ లివ్ (SonyLIV)లో 'కుట్రం పురింధవన్: ది గిల్టీ వన్' (Kuttram Purindhavan: The Guilty One) ఒక అద్భుతమైన వీకెండ్ ఛాయిస్‌గా నిలుస్తోంది. ఈ 7 ఎపిసోడ్ల సిరీస్ ఐఎండీబీలో 7.7 రేటింగ్ సాధించింది.

Published on: Nov 26, 2026, 18:16:11 IST
As Prefered on
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

OTT Crime Thriller: ఒకరికి మంచి చేయాలనే మన ఆలోచనే, చివరికి మన కుటుంబాన్ని సర్వనాశనం చేసే ప్రమాదంగా మారితే ఎలా ఉంటుంది? ఆ క్లిష్ట పరిస్థితుల్లో ఒక సామాన్యుడు తన కుటుంబాన్ని కాపాడుకోవడానికి ఎంత దూరం వెళ్తాడు? ఇదే ఆసక్తికరమైన అంశం చుట్టూ అల్లిన గ్రిప్పింగ్ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ 'కుట్రం పురింధవన్: ద గిల్టీ వన్' (Kuttram Purindhavan: The Guilty One).

OTT Crime Thriller: ఓటీటీలోని బెస్ట్ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్‌లలో ఒకటి.. 7.7 రేటింగ్.. మిస్ కాకుండా చూడండి
OTT Crime Thriller: ఓటీటీలోని బెస్ట్ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్‌లలో ఒకటి.. 7.7 రేటింగ్.. మిస్ కాకుండా చూడండి

ప్రముఖ ఓటీటీ వేదిక సోనీ లివ్ (SonyLIV)లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ 7 ఎపిసోడ్ల సిరీస్, ఐఎండీబీ (IMDb)లో ఏకంగా 7.7 రేటింగ్ సొంతం చేసుకుంది. తమిళంతో పాటు తెలుగు, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లో అందుబాటులో ఉన్న ఈ సిరీస్, వీకెండ్‌లో థ్రిల్ కోరుకునే ప్రేక్షకులకు ఒక పర్ఫెక్ట్ ఆప్షన్.

స్టోరీ ఏమిటి? జాతర రాత్రి జరిగిన హత్య.. మాయమైన చిన్నారి

ఈ కుట్రమ్ పురింధవన్ వెబ్ సిరీస్ కథ ఒక గ్రామంలో జరిగే జాతర రాత్రితో మొదలవుతుంది. ఆ రాత్రి ఒక వ్యక్తి తన ఇంటి బయట దారుణంగా హత్యకు గురవుతాడు. అదే సమయంలో అతని చిన్నారి కూతురు మెర్సీ అనుమానాస్పద స్థితిలో అదృశ్యమవుతుంది. ఈ ఘటనతో మెర్సీ తల్లి ఎస్తేర్ (లక్ష్మీ ప్రియా చంద్రమౌళి) తీవ్ర దిగ్భ్రాంతికి గురై, ఈ విషాదానికి తానే కారణమని కుమిలిపోతుంటుంది.

సరిగ్గా ఇక్కడే కథలో కీలక మలుపు తిరుగుతుంది. భాస్కరన్ (పశుపతి) ఒక రిటైర్డ్ ప్రభుత్వ ఫార్మసిస్ట్. ప్రాణాపాయ స్థితిలో ఉన్న తన మనవడికి అత్యవసరంగా సర్జరీ చేయించేందుకు డబ్బు కోసం పోరాడుతుంటాడు. హత్య జరిగిన రాత్రి గాయపడిన చిన్నారి మెర్సీ సాయం కోరుతూ భాస్కరన్ వద్దకు వస్తుంది. మానవత్వంతో ఆమెకు సాయం చేయడానికి భాస్కరన్ చేసిన ప్రయత్నం, అనుకోకుండా అతడిని పెద్ద చిక్కుల్లో పడేస్తుంది. మరోవైపు పోలీస్ కానిస్టేబుల్ గౌతమ్ (విదార్థ్) దర్యాప్తు నిజానికి దగ్గరవుతుండగా, తన కుటుంబాన్ని కాపాడుకోవడానికి భాస్కరన్ ఆ నిజాన్ని ఏ విధంగా దాచిపెట్టాడనేది ఉత్కంఠ రేపుతుంది.

ఈ సిరీస్ ఎందుకు చూడాలి? పశుపతి నటనే అసలు బలం

సెల్వమణి మునియప్పన్ దర్శకత్వం వహించిన ఈ సిరీస్‌కు ప్రధాన ఆకర్షణ విలక్షణ నటుడు పశుపతి నటన. ఎలాంటి అతి లేకుండా, పరిస్థితుల ప్రభావంతో తప్పుదారి పట్టాల్సి వచ్చిన ఒక సామాన్య మధ్యతరగతి వ్యక్తిలోని భయం, ఆందోళన, పశ్చాత్తాపాన్ని పశుపతి తన కళ్లతోనే అద్భుతంగా పలికించారు.

సాధారణ క్రైమ్ థ్రిల్లర్లలో 'హత్య ఎవరు చేశారు?' (Whodunit) అనే దానిపై సస్పెన్స్ ఉంటుంది. కానీ ఈ సిరీస్‌లో నిజం దాచడానికి జరుగుతున్న ప్రయత్నాన్ని ముందే చూపిస్తూ, ఒక సాధారణ తండ్రి/తాత తన కుటుంబం కోసం ఎంతటి సాహసానికైనా ఎలా సిద్ధపడతాడనే అంశాన్ని హృదయాన్ని హత్తుకునేలా తెరకెక్కించారు.

కుట్రమ్ పురింధవన్.. చూడాలా, వద్దా?

మీరు కేవలం ప్రతి ఐదు నిమిషాలకు ఒక ఫైట్, వేగవంతమైన యాక్షన్, మెరుపు వేగంతో సాగే పోలీస్ ఇన్వెస్టిగేషన్ ఆశిస్తే మొదటి రెండు ఎపిసోడ్లు కాస్త నెమ్మదిగా అనిపించవచ్చు. ఇది ఒక స్లో-బర్న్ క్రైమ్ థ్రిల్లర్. తొలి రెండు ఎపిసోడ్లలో గ్రామ వాతావరణం, పాత్రల నేపథ్యం, వారి ఆర్థిక, మానసిక పరిస్థితులను దర్శకుడు లోతుగా పరిచయం చేస్తారు. అయితే మూడో ఎపిసోడ్ నుంచి కానిస్టేబుల్ గౌతమ్ అనుమానం భాస్కరన్ వైపు మళ్లిన తర్వాత, కథనం ఊపందుకుని చివరి ఎపిసోడ్ వరకు సీటు అంచున కూర్చోబెడుతుంది.

ఒకవేళ మీకు ‘దృశ్యం’, ‘సుడల్: ద వోర్టెక్స్’, 'విలంగు' వంటి భావోద్వేగభరిత సౌత్ ఇండియన్ క్రైమ్ థ్రిల్లర్లు నచ్చినట్లయితే, సోనీ లివ్‌లో ఉన్న ఈ 7 ఎపిసోడ్ల 'కుట్రం పురింధవన్' సిరీస్‌ను ఈ వీకెండ్ వాచ్‌లిస్ట్‌లో తప్పకుండా చేర్చుకోండి.

ABOUT THE AUTHOR

హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.