ధర్మేంద్ర.. బాలీవుడ్ మోస్ట్ సక్సెస్‌ఫుల్ స్టార్.. అమితాబ్, షారుక్ ఖాన్‌ల కంటే ఎక్కువ హిట్స్

ధర్మేంద్ర బాలీవుడ్ లో మోస్ట్ సక్సెస్‌ఫుల్ హీరో అంటే నమ్మగలరా? తన కెరీర్లో ఏకంగా 75 హిట్ సినిమాలు అందించాడు. అందులో 7 బ్లాక్‌బస్టర్ కావడం విశేషం. అయినా అతనికి సూపర్ స్టార్ అనే హోదా మాత్రం ఎప్పుడూ రాలేదు.

Published on: Nov 24, 2025, 14:29:42 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

బాలీవుడ్ ఐకాన్, సీనియర్ నటుడు ధర్మేంద్ర సోమవారం (నవంబర్ 24) కన్నుమూశాడు. 89 ఏళ్ల ఈ వెటరన్ నటుడు ఈ నెల ప్రారంభంలో ఆరోగ్యం బాగోలేక ఆసుపత్రిలో చేరి, కోలుకుని ఇంటికి వచ్చాడు. యాక్షన్ హీరోల నుంచి రొమాంటిక్ లీడ్స్ ఆరు దశాబ్దాల సినీ ప్రయాణంలో ధర్మేంద్ర ఎంతో మంది బాలీవుడ్ హీరోల కంటే ఎక్కువ విజయాలను రుచి చూశాడు. అయినప్పటికీ ఆశ్చర్యకరంగా 'సూపర్‌స్టార్' అనే హోదా మాత్రం అతనికి దక్కలేదు.

ధర్మేంద్ర.. బాలీవుడ్ మోస్ట్ సక్సెస్‌ఫుల్ స్టార్.. అమితాబ్, షారుక్ ఖాన్‌ల కంటే ఎక్కువ హిట్స్ (HT_PRINT)
ధర్మేంద్ర.. బాలీవుడ్ మోస్ట్ సక్సెస్‌ఫుల్ స్టార్.. అమితాబ్, షారుక్ ఖాన్‌ల కంటే ఎక్కువ హిట్స్ (HT_PRINT)

ధర్మేంద్ర అద్భుతమైన సినీ కెరీర్

ధర్మేంద్ర కేవల్ కృష్ణ డియోల్ 1960లో 24 ఏళ్ల వయసులో 'దిల్ భీ తేరా హమ్ భీ తేరే' సినిమాతో సినీ ప్రయాణం మొదలుపెట్టాడు. ఆ తర్వాత 'బందిని', 'ఆయే మిలన్ కి బేలా', 'కాజల్' వంటి చిత్రాలలో సహాయ పాత్రల్లో కనిపించాడు. అయితే 1965లో వచ్చిన వార్ మూవీ 'హకీకత్' అతడిని బాక్సాఫీస్ దృష్టిని ఆకర్షించేలా చేసింది. ఆ తర్వాత 'ఫూల్ ఔర్ పత్తర్' సినిమాతో అతని రేంజ్ మరో స్థాయికి చేరింది.

అప్పటి నుంచి 1970ల చివరి వరకు ధర్మేంద్ర వరుసగా అగ్రశ్రేణి బాలీవుడ్ స్టార్లలో ఒకరిగా నిలిచాడు. ఆ సమయంలో 'అనుపమ', 'ఆద్మీ ఔర్ ఇన్సాన్', 'మేరా గావ్ మేరా దేశ్', 'సీతా ఔర్ గీత', 'షోలే', 'లోఫర్', 'యాదోం కీ బారాత్', 'ధరమ్ వీర్' వంటి భారీ హిట్‌లలో నటించాడు.

హిట్ స్టార్ ధర్మేంద్ర

1980లలో ధర్మేంద్ర యాక్షన్ సినిమా వైపు మొగ్గు చూపాడు. 'బద్లే కీ ఆగ్', 'గులామి', 'లోహా', 'ఎలాన్-ఎ-జంగ్' వంటి తక్కువ బడ్జెట్ సినిమాలలో కూడా విజయాలు అందుకున్నాడు. 64 ఏళ్ల కెరీర్‌లో ధర్మేంద్ర ప్రధాన పాత్రలో 75 హిట్‌లలో నటించాడు.

హిందీ సినీ నటుల్లో అత్యధిక హిట్ సినిమాల్లో నటించిన ఘనత అతనికే దక్కింది. ఇది అమితాబ్ బచ్చన్ (57), రాజేష్ ఖన్నా (42), షారుఖ్ ఖాన్ (35), సల్మాన్ ఖాన్ (38) వంటి సూపర్‌స్టార్ల మొత్తం కెరీర్ హిట్ల కంటే ఎక్కువ కావడం విశేషం.

ఎందుకు సూపర్‌స్టార్ అని పిలవలేదు?

తన సమకాలీనులు, జూనియర్ల కంటే ధర్మేంద్ర ఎక్కువ హిట్లు ఇచ్చినా అతడు ఎప్పుడూ పరిశ్రమలో నంబర్ వన్ స్టార్‌గా నిలవలేదు. 1970లలో ధర్మేంద్రకు వచ్చిన పెద్ద హిట్‌లలో చాలా వరకు 'షోలే', 'యాదోం కీ బారాత్', 'మేరా గావ్ మేరా దేశ్', 'ధరమ్ వీర్' వంటి ఇద్దరు హీరోల సినిమాలు లేదా మల్టీ-స్టారర్ మూవీస్. ఆ సమయంలో ఇతర హీరోలు రెగ్యులర్‌గా సోలో హిట్లు ఇచ్చేవారు.

1980లలో ధర్మేంద్ర సోలో హిట్లు ఇచ్చినప్పటికీ అవి అమితాబ్ బచ్చన్, వినోద్ ఖన్నా లేదా రిషి కపూర్ నటించిన చిత్రాల కంటే చిన్న స్థాయిలో ఉండేవి. ధర్మేంద్ర 6 బ్లాక్‌బస్టర్‌లు, 7 సూపర్ హిట్‌లలో నటించినప్పటికీ.. 150 ఫ్లాప్‌లలో కూడా కనిపించాడు. బాలీవుడ్ లో మిథున్ చక్రవర్తి తర్వాత ఇది రెండో అత్యధికం. ఈ తక్కువ సక్సెస్ రేటు కారణంగా ధర్మేంద్రకు 'సూపర్‌స్టార్' అనే ట్యాగ్ దక్కలేదు.

అయితే బి-గ్రేడ్ యాక్షన్ సినిమాలు చేయాలనే తన నిర్ణయాన్ని ధర్మేంద్ర ఎప్పుడూ సమర్థించుకున్నారు. 1980ల చివర్లో ఒక ఇంటర్వ్యూలో అతడు ఇలా అన్నాడు. "నాకు యాభై ఏళ్లు దాటినా ఈ రోజుల్లో హెలికాప్టర్‌ల నుంచి కూడా దూకుతున్నాను. అది ఒక గొప్ప విషయం కావొచ్చు (నవ్వుతూ). పాత అలవాట్లు అంత తేలికగా పోవు. నాకు సినిమాలు అంటే చాలా ఇష్టం.

అవకాశం వచ్చినప్పుడల్లా సంతకాలు చేస్తూనే ఉంటాను. ఒక సినిమా ఆడదని తెలిసినా నేను ఉత్తమంగా ఇవ్వడానికి ప్రయత్నిస్తాను. నేను సంవత్సరంలో ఇన్ని సినిమాలు చేస్తున్నాను. వాటిలో మూడు బాగా ఆడుతున్నాయి. మిగతావాటిని నేను పక్కన పెట్టలేను. వాటిని కూడా శ్రమించి తీశాం. నన్ను ఇక్కడ అక్కడ దూకడం, విలన్లను కాల్చడం చూస్తే ప్రేక్షకులు ఇంకా ఇష్టపడుతున్నారు. కాబట్టి జనం సంతోషంగా ఉన్నప్పుడు కొనసాగించడంలో తప్పు ఏముంది?" అని అన్నాడు.

ధర్మేంద్ర సెకండ్ ఇన్నింగ్స్

1990ల చివర్లో తన కుమారులు సన్నీ డియోల్, బాబీ డియోల్ తమకంటూ స్థానం సంపాదించుకున్న తర్వాత ధర్మేంద్ర సీనియర్ పాత్రలకు మారారు. 1998లో వచ్చిన 'ప్యార్ కియా తో డర్నా క్యా' అతని మొదటి సీనియర్ పాత్ర. ఆ తర్వాత అతడు తన కుమారులతో కలిసి 'యమ్లా పగ్లా దీవానా' చిత్రాలలో, 'అప్నే'లో కనిపించారు.

80 ఏళ్లు దాటిన తర్వాత కూడా కరోనా మహమ్మారి అనంతరం అతడు 'రాకీ ఔర్ రాణీ కీ ప్రేమ్ కహానీ', 'తేరీ బాతోం మే ఐసా ఉల్జా జియా' చిత్రాలలో కనిపించాడు. వచ్చే నెలలో విడుదల కానున్న శ్రీరామ్ రాఘవన్ దర్శకత్వంలోని 'ఇక్కిస్' చిత్రంలో కూడా అతడు నటించాడు.

  • Hari Prasad S
    ABOUT THE AUTHOR
    Hari Prasad S

    హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More