తెలుగు సహా అన్ని సౌత్ ఇండియన్ భాషల్లో ధురంధర్ 2 మూవీ.. ఫ్యాన్స్ డిమాండ్‌తో కన్ఫమ్ చేసిన మేకర్స్
ధురంధర్ 2 మూవీ తెలుగు సహా అన్ని సౌత్ ఇండియన్ భాషల్లో రిలీజ్ కానున్నట్లు మేకర్స్ కన్ఫమ్ చేశారు. ఫ్యాన్స్ డిమాండ్ మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. ధురంధర్ బ్లాక్‌బస్టర్ కావడంతో తెలుగు ప్రేక్షకులు కూడా ఈ మూవీని తెలుగులో రిలీజ్ చేయాలని డిమాండ్ చేసిన విషయం తెలిసిందే.
ఆదిత్య ధర్ దర్శకత్వంలో రణ్‌వీర్ సింగ్ నటించిన 'ధురంధర్' బాక్సాఫీస్ వద్ద రికార్డుల మోత మోగిస్తోంది. కేవలం హిందీలోనే విడుదలైన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ. 900 కోట్ల మైలురాయిని దాటింది. సౌత్ ఇండియాలో ఈ సినిమాకు వచ్చిన ఆదరణ చూసి, దీని సీక్వెల్ ‘ధురంధర్ 2’ను తెలుగుతో సహా అన్ని దక్షిణాది భాషల్లో పాన్ ఇండియా రేంజ్‌లో విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు.
తెలుగు సహా అన్ని సౌత్ ఇండియన్ భాషల్లో ధురంధర్ 2 మూవీ.. ఫ్యాన్స్ డిమాండ్‌తో కన్ఫమ్ చేసిన మేకర్స్
తెలుగులోనూ ధురంధర్ 2
డిసెంబర్ 5న విడుదలైన 'ధురంధర్' (Dhurandhar) సినిమాతో రణ్‌వీర్ సింగ్ మళ్లీ ఫామ్‌లోకి వచ్చాడు. కేవలం హిందీ వెర్షన్ మాత్రమే రిలీజ్ అయినా ఇండియాలో రూ. 600 కోట్లు, ప్రపంచవ్యాప్తంగా రూ. 900 కోట్లు వసూలు చేసి సత్తా చాటింది. ముఖ్యంగా సౌత్ ఇండియాలో ఈ సినిమాకు బ్రహ్మరథం పడుతున్నారు.
మొదటి పార్ట్ క్లైమాక్స్‌లో సీక్వెల్ గురించి అనౌన్స్ చేశారు. అంతేకాదు రంజాన్ సమయంలో అంటే వచ్చే ఏడాది మార్చి 19న రిలీజ్ చేయబోతున్నారు. అయితే మొదటి పార్ట్ కేవలం హిందీలోనే వచ్చినా, సౌత్ ఆడియన్స్ నుండి వచ్చిన భారీ డిమాండ్ మేరకు.. ‘ధురంధర్ 2’ను హిందీతో పాటు తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో గ్రాండ్‌గా రిలీజ్ చేయనున్నారు.
ముంబై కంటే మన దగ్గరే ఎక్కువ క్రేజ్
హిందీ సినిమా అయినా సరే హైదరాబాద్, బెంగళూరు, చెన్నైలో ఆక్యుపెన్సీ రేట్స్ ముంబై కంటే ఎక్కువగా ఉండటం విశేషం. 'సాక్నిల్క్' రిపోర్ట్ ప్రకారం మంగళవారం (డిసెంబర్ 23) నాడు ఆక్యుపెన్సీ చూస్తే హైదరాబాద్ లో 28.75%, చెన్నైలో 37.25%, బెంగళూరులో 49.25%గా ఉండటం విశేషం. అదే ముంబైలో మాత్రం 30 శాతంగానే ఉంది. దీంతో సౌత్ డిస్ట్రిబ్యూటర్లు సీక్వెల్‌ను కచ్చితంగా డబ్బింగ్ చేయాల్సిందేనని పట్టుబట్టారట.
రాకింగ్ స్టార్ యశ్‌తో పోటీ
'ధురంధర్ 2' బాక్సాఫీస్ ఫైట్ మామూలుగా ఉండదు. ఎందుకంటే అదే సమయానికి యశ్, కియారా అద్వానీ నటిస్తున్న భారీ బడ్జెట్ మూవీ 'టాక్సిక్' (Toxic) కూడా రిలీజ్ కానుంది. ఈ రెండు పాన్ ఇండియా సినిమాల మధ్య గట్టి పోటీ ఉండబోతోంది.
ఇక ధురంధర్ మూవీ విషయానికి వస్తే.. పాకిస్థాన్‌లోని బలోచ్ గ్యాంగ్‌ను అంతమొందించడానికి వెళ్లే ఇండియన్ స్పై హంజా అలీ మజారీ (రణ్‌వీర్ సింగ్) కథ ఇది. సీక్వెల్‌లో హీరో బ్యాక్ స్టోరీని చూపించనున్నారు.
ఈ సినిమాలో రణ్‌వీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, ఆర్. మాధవన్, అర్జున్ రాంపాల్ కీలకపాత్రల్లో నటించారు. 'ఉరి' మూవీ ఫేమ్ ఆదిత్య ధర్ ఈ సినిమాను డైరెక్ట్ చేశాడు.