007: అత్యంత పిరికి జేమ్స్ బాండ్ ఇతనే, ఫైట్ చేయమంటే మూలన కూర్చున్నాడు- కొత్త జేమ్స్ బాండ్‌పై క్రిస్టోఫర్ నోలన్ కామెంట్స్

Christopher Nolan On New James Bond Robert Pattinson: హాలీవుడ్ ఐకానిక్ గూఢచారి పాత్ర జేమ్స్ బాండ్ 007గా రాబర్ట్ ప్యాటిన్సన్ ఎంపికయ్యారు. అయితే తాజాగా దిగ్గజ దర్శకుడు క్రిస్టోఫర్ నోలన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్యాటిన్సన్‌ను 'అత్యంత పిరికి జేమ్స్ బాండ్' అని అనడం నెట్టింట వైరల్ అవుతోంది.

Published on: Nov 19, 2026, 13:56:45 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

Christopher Nolan On New James Bond Robert Pattinson: ప్రపంచ సినీ ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న కొత్త జేమ్స్ బాండ్ వేటకు తెరపడింది. డేనియల్ క్రెయిగ్ వారసుడిగా, ఏడో 007 ఏజెంట్‌గా హాలీవుడ్ స్టార్ హీరో రాబర్ట్ ప్యాటిన్సన్ ఎంపికయ్యారు.

అత్యంత పిరికి జేమ్స్ బాండ్ ఇతనే, ఫైట్ చేయమంటే మూలన కూర్చున్నాడు- కొత్త జేమ్స్ బాండ్‌పై క్రిస్టోఫర్ నోలన్ కామెంట్స్
అత్యంత పిరికి జేమ్స్ బాండ్ ఇతనే, ఫైట్ చేయమంటే మూలన కూర్చున్నాడు- కొత్త జేమ్స్ బాండ్‌పై క్రిస్టోఫర్ నోలన్ కామెంట్స్

క్రిస్టోఫర్ నోలన్ సెటైర్లు

ఈ ప్రకటన వెలువడినప్పటి నుంచి బ్రాడ్ పిట్, ఎలిజబెత్ డెబికి, మాజీ బాండ్ నటుడు జార్జ్ లాజెన్‌బీ సహా ఎందరో ప్రముఖులు ప్యాటిన్సన్‌కు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. అయితే దిగ్గజ దర్శకుడు క్రిస్టోఫర్ నోలన్ మాత్రం తనదైన శైలిలో ప్యాటిన్సన్‌పై సరదాగా సెటైర్ వేశారు.

తెలుగు రాష్ట్రాల్లోనూ జేమ్స్ బాండ్ సినిమాలకు, క్రిస్టోఫర్ నోలన్ చిత్రాలకు విపరీతమైన క్రేజ్ ఉంది. షాన్ కానరీ, పియర్స్ బ్రోస్నన్ నుంచి డేనియల్ క్రెయిగ్ వరకు బాండ్ డబ్బింగ్ సినిమాలు ఇక్కడి బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబట్టాయి. మరోవైపు 'ఇన్‌సెప్షన్', 'ఓపెన్‌హైమర్' చిత్రాలతో తెలుగు యువతకు క్రేజీ దర్శకుడిగా మారిన నోలన్, తన 'టెనెట్', 'ది ఒడిస్సీ' చిత్రాల్లో ప్యాటిన్సన్‌తో కలిసి పనిచేశారు. ఆ చనువుతోనే నోలన్ తాజాగా ప్యాటిన్సన్‌ను ఆటపట్టించారు.

స్పీల్‌బర్గ్ వేదికపై నోలన్ ఛలోక్తులు

వెస్ట్ హాలీవుడ్‌లోని డైరెక్టర్స్ గిల్డ్ ఆఫ్ అమెరికాలో జరిగిన 'ది ఒడిస్సీ' ప్రత్యేక ప్రదర్శన ఈ సరదా సంభాషణకు వేదికైంది. సినిమా ప్రదర్శన అనంతరం ప్రముఖ దర్శకుడు స్టీవెన్ స్పీల్‌బర్గ్ నిర్వహించిన ప్రశ్నోత్తరాల కార్యక్రమంలో నోలన్ పాల్గొన్నారు.

ది ఒడిస్సీ సినిమా క్లైమాక్స్‌లో మ్యాట్ డామన్ (ఒడిస్సియస్), రాబర్ట్ ప్యాటిన్సన్ (ఆంటినస్) మధ్య వచ్చే యాక్షన్ సన్నివేశాన్ని స్పీల్‌బర్గ్ ప్రశంసించారు. స్టంట్ కోఆర్డినేటర్ జార్జ్ కాటిల్ ఆ ఫైట్‌ను అద్భుతంగా తీర్చిదిద్దారని స్పీల్‌బర్గ్ కొనియాడారు. దీనికి వెంటనే స్పందించిన నోలన్ నవ్వుతూ ప్యాటిన్సన్‌పై పంచ్ విసిరారు.

"రాబర్ట్ ప్యాటిన్సన్ మీరు ఇప్పటివరకు చూసిన అత్యంత పిరికి జేమ్స్ బాండ్" అని నోలన్ సరదాగా వ్యాఖ్యానించారు. నోలన్ మాటలకు స్పీల్‌బర్గ్ సైతం అంతే వేగంగా స్పందిస్తూ.. "బహుశా మీ సినిమా చూసే ఆయన్ను జేమ్స్ బాండ్‌గా ఎంపిక చేశారేమో" అని చమత్కరించారు.

ఫైట్ చేయకుండా మూలన కూర్చున్న బాండ్!

ఆ సన్నివేశం చిత్రీకరణ వెనుక జరిగిన ఆసక్తికర విషయాలను నోలన్ వివరించారు. సెట్‌లో పూర్తి భద్రతా ప్రమాణాలతో యాక్షన్ సీన్లను రిహార్సల్ చేశామని చెప్పారు. మ్యాట్ డామన్, టామ్ హాలండ్ అద్భుతమైన క్రీడాకారుల్లా కష్టపడి ఫైట్ సన్నివేశాల్లో నటించారని నోలన్ ప్రశంసించారు. కానీ ప్యాటిన్సన్ మాత్రం అందుకు పూర్తి భిన్నంగా వ్యవహరించారని వెల్లడించారు.

"సెట్‌లో మేము రాబ్‌ను ఒక మూలన వదిలేశాము. అక్కడ జరుగుతున్న గొడవలో తలదూర్చకుండా, ఆ ఫైట్ అంతటినీ ఒక ప్రేక్షకుడిలా కూర్చుని ఎంతో సరదాగా చూస్తూ ఉండిపోయాడు" అని నోలన్ నవ్వుతూ చెప్పుకొచ్చారు. తెరపై ప్రాణాలకు తెగించి పోరాడే 007 ఏజెంట్‌గా మారబోతున్న ప్యాటిన్సన్, తన సినిమాలో మాత్రం ఫైట్ చేయడానికి ఇష్టపడలేదని క్రిస్టోఫర్ నోలన్ చేసిన ఈ వ్యాఖ్యలు అభిమానులను కడుపుబ్బా నవ్విస్తున్నాయి.

డెనిస్ విల్లెనెవ్ దర్శకత్వంలో 26వ బాండ్ చిత్రం

అమెజాన్ ఎంజీఎం స్టూడియోస్ 2026 నవంబర్ 16న రాబర్ట్ ప్యాటిన్సన్‌ను తదుపరి జేమ్స్ బాండ్‌గా అధికారికంగా ప్రకటించింది. 2021లో వచ్చిన 'నో టైమ్ టు డై' చిత్రంతో డేనియల్ క్రెయిగ్ బాండ్ ప్రయాణం ముగిసిన తర్వాత, ఆ బాధ్యతను ఇప్పుడు 40 ఏళ్ల ప్యాటిన్సన్ భుజాన వేసుకున్నారు.

ఈ ప్రతిష్ఠాత్మక ఫ్రాంచైజీలో రానున్న 26వ చిత్రానికి 'డ్యూన్', 'బ్లేడ్ రన్నర్ 2049' చిత్రాల దర్శకుడు డెనిస్ విల్లెనెవ్ దర్శకత్వం వహిస్తున్నారు. 'పీకీ బ్లైండర్స్' సృష్టికర్త స్టీవెన్ నైట్ కథను అందిస్తుండగా.. అమీ పాస్కల్, డేవిడ్ హేమాన్ నిర్మాతలుగా, తాన్యా లాపోయింట్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తున్నారు.

ట్విలైట్ ఫ్రాంచైజీతో క్రేజ్

'ట్విలైట్' సిరీస్‌తో ప్రపంచవ్యాప్తంగా యువతను ఆకట్టుకున్న రాబర్ట్ ప్యాటిన్సన్, ఆ తర్వాత 'గుడ్ టైమ్', 'ది లైట్‌హౌస్', 'టెనెట్', 'ది బ్యాట్‌మ్యాన్' వంటి విభిన్న చిత్రాలతో నటుడిగా తన స్థాయిని పెంచుకున్నారు. ఇప్పుడు ఏకంగా జేమ్స్ బాండ్‌గా రాబర్ట్ ప్యాటిన్సన్ ఎంపిక కావడం ఇంట్రెస్టింగ్‌గా మారింది.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More