ఇండస్ట్రీ అంటే జనాలకు విరక్తి వచ్చేసింది.. కామెంట్స్, వ్యూస్ కొంటున్నాం.. బేబీ ఇప్పుడు తీస్తే సగం కూడా రాదు: సాయి రాజేష్
బేబీ మూవీ డైరెక్టర్ సాయి రాజేష్ ప్రస్తుతం ఇండస్ట్రీ పరిస్థితి, మారుతున్న ప్రేక్షకుల అభిరుచిపై సంచలన కామెంట్స్ చేశారు. బేబీ మూవీ ఇప్పుడు తీసి ఉంటే అందులో సగం షేర్ కూడా వచ్చేది కాదని ఆయన అనడం విశేషం.
టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు, నిర్మాత సాయి రాజేష్ (Sai Rajesh) సినిమా ప్రమోషన్ల తీరుపై, టాలీవుడ్ ప్రస్తుత మార్కెట్ పరిస్థితిపై విస్మయం వ్యక్తం చేస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు. నిర్మాత ధీరజ్ మొగిలినేని నిర్మాణంలో వస్తున్న 'సమ్మర్ హాలిడేస్' (Summer Holidays) చిత్ర టీజర్ లాంచ్ ఈవెంట్‌లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా డిజిటల్ ప్రమోషన్లలో జరుగుతున్న లూప్‌హోల్స్, ఫేక్ నంబర్ల గురించి ఆయన ఓపెన్‌గా మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి.
డిజిటల్ ప్రమోషన్ల మాయాజాలం.. ఏది నిజమో తెలియట్లేదు
ప్రస్తుత కాలంలో సినిమాలకు జరుగుతున్న ఆన్‌లైన్ ప్రమోషన్లపై సాయి రాజేష్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రేక్షకుల నిజమైన స్పందన ఏంటో తెలుసుకోవడం మునుపటిలా సాధ్యం కావడం లేదని వాపోయారు.
యూట్యూబ్ వ్యూస్, కామెంట్స్, ట్విటర్ ట్రెండ్స్ అన్నీ చాలావరకు మేనేజ్ చేస్తున్నామని, పాజిటివ్ కామెంట్స్ కొంటున్నామని ఆయన ఓపెన్‌గా ఒప్పుకున్నారు. డబ్బులు పెట్టి వ్యూస్ కొనడం వల్ల, నెగిటివిటీని పాజిటివిటీగా మార్చడం వల్ల ఏ కంటెంట్ జనాలకు నిజంగా నచ్చుతుందో, ఏది నచ్చట్లేదో అర్థం కాక మేకర్స్ తీవ్ర అయోమయంలో పడిపోతున్నారని అన్నారు.
ఇలాంటి కృత్రిమమైన ప్రమోషన్ల వల్ల సాధారణ ప్రేక్షకులకు కూడా సినిమా ఇండస్ట్రీ అన్నా, అందులో వచ్చే ప్రమోషనల్ కంటెంట్ (టీజర్లు, ట్రైలర్లు) అన్నా నమ్మకం పోయి, ఒక రకమైన విరక్తి వచ్చేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ ట్రెండ్ ఇలాగే కొనసాగితే రాబోయే రోజుల్లో అసలు ఎలాంటి కథలు రాయాలి, ఎలాంటి సినిమాలు తీయాలో అర్థం కావడం లేదని భయాందోళన వ్యక్తం చేశారు.
"ఇప్పుడు వస్తే 'బేబి'కి సగం షేర్ కూడా రాదు"
తన కెరీర్‌లోనే బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన ‘బేబి’ (Baby) సినిమా గురించి సాయి రాజేష్ చేసిన వ్యాఖ్యలు అందరినీ ఆశ్చర్యపరిచాయి.
"నేను చాలా నమ్మకంగా, నిజాయితీగా చెబుతున్నాను.. ఒకవేళ నా ‘బేబి’ సినిమాను ఈరోజు ఉన్న మార్కెట్ పరిస్థితుల్లో రిలీజ్ చేసి ఉంటే, దానికి ఒరిజినల్‌గా వచ్చిన కలెక్షన్లలో సగం కూడా వచ్చేది కాదు. గడిచిన ఈ రెండేళ్లలోనే ప్రేక్షకుల ఆలోచనా విధానంలో, మార్కెట్ సినారియోలో అంతటి మార్పులు వచ్చేసాయి" అని రాజేష్ అన్నారు.
నిర్మాత ధీరజ్ మొగిలినేనికి ప్రశంసలు
పరిశ్రమ ఇంతటి కష్టకాలంలో ఉండి, కొన్ని జానర్లను మనం చంపేస్తున్న తరుణంలో కూడా వైవిధ్యమైన సినిమాలను ఎంకరేజ్ చేస్తున్న నిర్మాత ధీరజ్ మొగిలినేనిని సాయి రాజేష్ అభినందించారు. 'ది గర్ల్‌ఫ్రెండ్' (The Girlfriend), 'సమ్మర్ హాలిడేస్' వంటి విభిన్నమైన, ప్రయోగాత్మక ప్రాజెక్టులను ధైర్యంగా నిర్మిస్తూ టాలీవుడ్‌లో ముందుకు వెళ్తున్నందుకు ఆయనకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
సాయి రాజేష్ చేసిన ఈ వ్యాఖ్యలపై నెటిజన్లలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొంతమంది ఆయన నిజాయితీని మెచ్చుకుంటుంటే, మరికొందరు ఇండస్ట్రీ భవిష్యత్తుపై ఆయన మరీ అంత నిరాశావాదంతో మాట్లాడాల్సింది కాదని అభిప్రాయపడుతున్నారు. ఏదేమైనప్పటికీ, ఈ వ్యాఖ్యలు టాలీవుడ్ మార్కెటింగ్ ట్రాన్స్‌పరెన్సీపై సరికొత్త చర్చకు దారితీశాయి.
తరచుగా అడిగే ప్రశ్నలు (FAQs)
1. సాయి రాజేష్ ఏ సినిమా ఈవెంట్‌లో ఈ వ్యాఖ్యలు చేశారు?
'సమ్మర్ హాలిడేస్' (Summer Holidays) సినిమా టీజర్ లాంచ్ ఈవెంట్‌లో సాయి రాజేష్ ఈ సంచలన వ్యాఖ్యలు చేశారు.
2. ఆన్‌లైన్ ప్రమోషన్లపై సాయి రాజేష్ చేసిన ప్రధాన విమర్శ ఏంటి?
యూట్యూబ్ వ్యూస్, కామెంట్స్ కొనుగోలు చేయడం, ట్విటర్ ట్రెండ్స్‌ని మార్చడం వల్ల సినిమాలపై ప్రేక్షకుల నిజమైన స్పందన ఏంటో మేకర్స్‌కి తెలియకుండా పోతోందని, దీనివల్ల ప్రేక్షకులకు ఇండస్ట్రీ ప్రమోషన్లపై నమ్మకం పోతోందని ఆయన విమర్శించారు.
3. తన సొంత సినిమా 'బేబి' గురించి ఆయన ఏమన్నారు?
ప్రస్తుత మార్కెట్ పరిస్థితుల్లో గనుక 'బేబి' సినిమా విడుదలైతే, గతంలో అది సాధించిన బాక్సాఫీస్ వసూళ్లలో కనీసం సగం కూడా రాబట్టలేకపోయేదని ఆయన వ్యాఖ్యానించారు.
ABOUT THE AUTHORHari Prasad Sహరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More

E-Paper


