మలయాళంలో ఎన్ని గంటలు పని చేస్తామో తెలియదు.. ఇదేమీ ఉద్యోగం కాదు.. 8 గంటల పని సాధ్యం కాదు: దీపిక డిమాండ్‌పై దుల్కర్, రానా
దీపికా పదుకోన్ 8 గంటల పని డిమాండ్‌పై తాజాగా దుల్కర్ సల్మాన్, రానా దగ్గుబాటిలాంటి నటులు కూడా స్పందించారు. అది సాధ్యం కాదని వాళ్లు స్పష్టం చేశారు. ఇదేమీ ఉద్యోగం కాదు అని రానా అనడం విశేషం.
స్టార్ హీరోయిన్ దీపికా పదుకోన్ రోజుకు 8 గంటల పని డిమాండ్ పై చర్చ కొనసాగుతూనే ఉంది. ఆమె చేసిన ఈ డిమాండ్ వల్ల ప్రభాస్ 'స్పిరిట్', 'కల్కి' సీక్వెల్ నుంచి తప్పుకున్నారన్న వార్తలు ఇండస్ట్రీలో పెద్ద చర్చకు దారితీశాయి. అసలు సినిమా రంగంలో ఇలాంటి నిబంధనలు ఆచరణ సాధ్యమేనా అనే విషయంపై 'ది హాలీవుడ్ రిపోర్టర్ ఇండియా' రౌండ్ టేబుల్ సమావేశంలో నటులు రానా, దుల్కర్ సల్మాన్, నిర్మాత అర్చన కళాపతి తమ అభిప్రాయాలను షేర్ చేసుకున్నారు.

ఇదేమీ ఉద్యోగం కాదు: రానా
పని గంటల గురించి అడిగినప్పుడు రానా దగ్గుబాటి నవ్వుతూ స్పందించారు. ఇది సాధ్యం కాదని అతడు స్పష్టం చేశాడు. "ఇది ఒక ఉద్యోగం కాదు. ఇదొక లైఫ్ స్టైల్. మీరు ఇందులో ఉండాలా వద్దా అనేది మీ ఛాయిస్. ప్రతి సినిమాకు వేర్వేరు అవసరాలు ఉంటాయి. ఇదేమీ ఫ్యాక్టరీ కాదు కదా.. 8 గంటలు కూర్చుంటే గొప్ప సీన్ వచ్చేయడానికి.. కథను సృష్టించేటప్పుడు, దాని కోసం ఎంతైనా కష్టపడటానికి సిద్ధంగా ఉండాలి. దీన్ని ఒక ఇండస్ట్రీ స్టాండర్డ్‌గా మార్చడం చాలా కష్టం" అని రానా తేల్చి చెప్పాడు.
రోజులు పెరిగితే ఖర్చు తడిసి మోపెడవుతుంది: దుల్కర్
మలయాళ పరిశ్రమలో తక్కువ రోజుల్లో ఎక్కువ గంటలు పనిచేయడం మామూలేనని దుల్కర్ చెప్పాడు. తెలుగు పరిశ్రమలో తన అనుభవాన్ని గుర్తు చేసుకుంటూ తాను ఆశ్చర్యపోయానని అన్నాడు.
"మలయాళంలో పని ఎప్పుడు పూర్తవుతుందో తెలియకుండా చేస్తూనే ఉంటాం. నేను మొదటిసారి తెలుగులో 'మహానటి' (2018) చేసినప్పుడు సాయంత్రం 6 గంటలకే ఇంటికి పంపించేవారు. నా కెరీర్‌లో అది మొదటిసారి. అది నాకు చాలా ఆశ్చర్యం కలిగించింది. తమిళంలో రెండో శనివారాలు సెలవు ఉంటుంది. కానీ ఒక నిర్మాతగా ఆలోచిస్తే.. అదనంగా ఒక రోజు షూటింగ్ చేయడం కంటే, ఒకే రోజు ఎక్కువ గంటలు పనిచేయడం చాలా తక్కువ ఖర్చుతో పూర్తవుతుంది" అని దుల్కర్ అసలు లాజిక్ వివరించాడు.
ది గోట్ ప్రొడ్యూసర్ ఏమన్నదంటే?
'ది గోట్' (The GOAT) నిర్మాత అర్చన కళాపతి కూడా వీరితో ఏకీభవించింది. "సినిమాలో 9-5 జాబ్ అనేది అసాధ్యం. భారీ బడ్జెట్ చిత్రాలకు వడ్డీల భారం చాలా ఎక్కువగా ఉంటుంది. అందుకే సెలవు రోజుల్లో కూడా షూటింగ్ చేయడానికి ఇష్టపడతాం" అని ఆమె అన్నారు. అయితే ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లు రిలీజ్ డేట్స్ విషయంలో కచ్చితంగా ఉండటం పరిశ్రమకు కొంత క్రమశిక్షణను తెచ్చిందని ఆమె పేర్కొన్నారు.
రానా, దుల్కర్ కలిసి నిర్మించి, నటించిన 'కాంత' (Kaantha) మూవీ నవంబర్ 14న విడుదలై పాజిటివ్ టాక్ తెచ్చుకున్నప్పటికీ, బాక్సాఫీస్ వద్ద పెద్దగా ప్రభావం చూపలేకపోయింది. దుల్కర్ త్వరలో తెలుగులో పవన్ సాదినేని దర్శకత్వంలో 'ఆకాశంలో ఒక తార', మలయాళంలో 'ఐ యామ్ గేమ్' చిత్రాల్లో నటిస్తుండగా.. రానా తమిళ చిత్రం 'పరాశక్తి'లో కనిపించనున్నాడు.
ABOUT THE AUTHORHari Prasad Sహరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More

E-Paper


