బాలీవుడ్‌లో కూర్చోవడానికి చెయిర్ కూడా ఇవ్వరు.. ఫ్యాన్సీ కారులో వస్తే ఓ పెద్ద స్టార్ అనుకుంటారు: దుల్కర్ సల్మాన్

మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ బాలీవుడ్‌పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. అక్కడ తనకు కనీసం కూర్చోవడానికి కుర్చీ కూడా దొరికేది కాదని, ఓ పెద్ద ఫ్యాన్సీ కారులో వస్తే స్టార్ హీరో అనుకుంటారని అతడు అనడం విశేషం.

Published on: Dec 2, 2025, 22:08:51 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

దక్షిణాదిలో స్టార్ హీరోగా వెలుగొందుతున్నాడు దుల్కర్ సల్మాన్. మలయాళం నటుడు అయినా కూడా తెలుగు, తమిళంలోనూ మంచి పేరు సంపాదించాడు. మొత్తంగా ఇండియన్ సినీ ఇండస్ట్రీలో పదేళ్లుగా ఉన్నాడు. 2018లో 'కార్వాన్' (Karwaan) సినిమాతో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన అతడు.. అక్కడ తనకు ఎదురైన వింత పరిస్థితులను తాజాగా గుర్తు చేసుకున్నాడు. 'ది హాలీవుడ్ రిపోర్టర్ ప్రొడ్యూసర్స్ రౌండ్ టేబుల్ 2025'లో పాల్గొన్న దుల్కర్.. అక్కడ సెట్స్ లో గౌరవం దక్కించుకోవడానికి తాను ఏం చేయాల్సి వచ్చిందో వివరించాడు.

బాలీవుడ్‌లో కూర్చోవడానికి చెయిర్ కూడా ఇవ్వరు.. ఫ్యాన్సీ కారులో వస్తే ఓ పెద్ద స్టార్ అనుకుంటారు: దుల్కర్ సల్మాన్
బాలీవుడ్‌లో కూర్చోవడానికి చెయిర్ కూడా ఇవ్వరు.. ఫ్యాన్సీ కారులో వస్తే ఓ పెద్ద స్టార్ అనుకుంటారు: దుల్కర్ సల్మాన్

కుర్చీ కోసం స్టార్‌డమ్ ‘బిల్డప్’

హిందీ సినిమాలు చేస్తున్నప్పుడు తనను, తన సిబ్బందిని అక్కడ ఎవరూ పట్టించుకునేవారు కాదని దుల్కర్ చెప్పాడు. "నేను హిందీ సినిమాలు చేసినప్పుడు, సెట్‌లో నన్ను, నా ఇద్దరు మనుషుల్ని అటూ ఇటూ నెట్టేసేవారు. కనీసం కూర్చోవడానికి కుర్చీలు దొరికేవి కావు. మానిటర్ చూడటానికి కూడా చోటు ఉండేది కాదు. అక్కడ పెద్ద గుంపు ఉండేది. అందుకే నేను ఒక పెద్ద స్టార్‌నని అక్కడ భ్రమ కల్పించాల్సి వచ్చింది. లేకపోతే అక్కడ పనులు జరిగేవి కావు" అని దుల్కర్ ఆవేదన వ్యక్తం చేశాడు.

అదొక కల్చర్ షాక్ అని, అయితే అది తనకు ఒక పాఠం నేర్పిందని అతడు అన్నాడు. "మీరు ఖరీదైన కారులో, కొంతమంది మనుషులతో దిగితే.. అప్పుడు హఠాత్తుగా 'ఓహో.. ఇతను పెద్ద స్టార్' అనే భావన వారికి కలుగుతుంది. ఇది చాలా విచారకరమైన విషయం. ఎందుకంటే నా ఎనర్జీని నేను అక్కడ పెట్టకూడదు" అని దుల్కర్ పేర్కొన్నాడు.

మలయాళంలో అలా కాదు..

తాను వచ్చిన మలయాళ పరిశ్రమలో సంస్కృతి దీనికి పూర్తి విరుద్ధమని దుల్కర్ చెప్పాడు. అక్కడ సెట్‌లో ఎలాంటి విలాసాలు ఉండవని తెలిపాడు. "మేము రాష్ట్రం మొత్తం తిరుగుతూ షూట్ చేస్తాం. ఏదైనా ఇంటి యజమాని అనుమతి తీసుకుని, వారికి డబ్బు చెల్లించి, ఆ ఇళ్లలోనే బట్టలు మార్చుకుంటాం. వారి రెస్ట్‌రూమ్‌లనే వాడతాం. అక్కడ ఎప్పుడూ అదే పద్ధతి" అని గుర్తు చేసుకున్నాడు.

తాను, రానా దగ్గుబాటి ఈ విషయంపై చర్చించుకున్నామని దుల్కర్ చెప్పాడు. హిందీ పరిశ్రమ చాలా పెద్దది కావడం, మార్కెట్ విస్తృతంగా ఉండటం వల్ల ఈ పరిస్థితులు ఉండవచ్చని అభిప్రాయపడ్డారు. "నేను ఏ పరిశ్రమనూ తక్కువ చేయడం లేదు. కానీ ఇదొక సాంస్కృతిక విషయం అనుకుంటా" అని అన్నాడు.

ఈ సంభాషణలో భాగంగా దుల్కర్ తాను పాటించే ఒక నియమాన్ని చెప్పాడు. "నాకు ఏమైనా కావాలంటే నేనే చెల్లించుకుంటాను. నాకు ఎంత రెమ్యునరేషన్ ఇస్తున్నారో, అందులో నుంచే నా సిబ్బంది ఖర్చులు, నాకు కావాల్సిన లగ్జరీ ఖర్చులు నేనే భరిస్తాను. నిర్మాతలకు ఆ భారం వేయను" అని స్పష్టం చేశాడు.

  • Hari Prasad S
    ABOUT THE AUTHOR
    Hari Prasad S

    హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More