...
...
Next Story

Godari Gattupaina Review: గోదారి గట్టుపైన రివ్యూ- పాటలతో మెప్పించే పల్లె ప్రేమకథ- సుమంత్ ప్రభాస్ మూవీ ఎలా ఉందంటే?

Godari Gattupaina Movie Review In Telugu: సుమంత్ ప్రభాస్ హీరోగా తెరకెక్కిన విలేజ్ రొమాంటిక్ లవ్ డ్రామా సినిమా గోదారి గట్టుపైన. గోదావరి నేపథ్యంలో సాగే స్వచ్ఛమైన ప్రేమకథగా వచ్చిన ఈ సినిమాకు సుభాష్ చంద్ర దర్శకత్వం వహించారు. ఇవాళ విడుదలైన ఈ సినిమా ఎలా ఉందో నేటి గోదారి గట్టుపైన రివ్యూలో తెలుసుకుందాం.

Published on: May 8, 2026, 14:29:02 IST
Advertisement

Godari Gattupaina Movie Review And Rating: 'మేమ్ ఫేమస్' సినిమాతో తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్న హీరో సుమంత్ ప్రభాస్ ఈసారి గోదావరి యాసతో ప్రేమకథను పండించేందుకు 'గోదారి గట్టుపైన' చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. నిధి ప్రదీప్ హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రానికి సుభాష్ చంద్ర దర్శకత్వం వహించారు.

గోదారి గట్టుపైన రివ్యూ- పాటలతో మెప్పించే పల్లె ప్రేమకథ- సుమంత్ ప్రభాస్ మూవీ ఎలా ఉందంటే?
గోదారి గట్టుపైన రివ్యూ- పాటలతో మెప్పించే పల్లె ప్రేమకథ- సుమంత్ ప్రభాస్ మూవీ ఎలా ఉందంటే?

సీనియర్ హీరో జగపతి బాబు, రాజీవ్ కనకాల కీలక పాత్రలు పోషించిన గోదారి గట్టుపైన సినిమా ఇవాళ (మే 8) థియేటర్లలో విడుదల అయింది. మరి ఈ మూవీ ఎలా ఉందో నేటి గోదారి గట్టుపైన రివ్యూలో తెలుసుకుందాం.

కథ:

వేల్పూరు గ్రామానికి చెందిన రాజు (సుమంత్ ప్రభాస్) ఒక ఆటో డ్రైవర్. మంచి మనసున్న మనిషి. తన చెల్లితోపాటు ఇంజనీరింగ్ చదివే మాయ (నిధి ప్రదీప్) రాజుకు పరిచయమవుతుంది. తొలిచూపులోనే మాయతో రాజు ప్రేమలో పడతాడు. మొదట్లో రాజును అసహ్యించుకున్న మాయ, కాలక్రమేణా అతని మంచితనం చూసి ఇష్టపడటం మొదలుపెడుతుంది.

అయితే మాయకు తన తండ్రి శ్యామ్ బాబు (జగపతి బాబు) అంటే అమితమైన గౌరవం. ఆయనకు నచ్చని పని ఆమె అస్సలు చేయదు. మరోవైపు సెక్యూరిటీ గార్డ్‌గా పనిచేసే శ్యామ్ బాబు తనకంటే మంచి స్థానంలో ఉన్న అబ్బాయితో కూతురు పెళ్లి చేయాలనుకుంటాడు. ఈ క్రమంలో ఆటో డ్రైవర్‌తో తన కూతురు ప్రేమలో ఉందని శ్యామ్ బాబుకు తెలుస్తుంది.

మరి కూతురు ప్రేమను శ్యామ్ బాబు అర్థం చేసుకున్నాడా? లేదా తనకు నచ్చిన వ్యక్తితోనే కూతురు పెళ్లి చేశాడా? పోలీస్ స్టేషన్‌లోకి రాజు ఎందుకు వెళ్లాల్సి వస్తుంది? ఆటో డ్రైవర్ అయిన రాజు, అగ్రస్థాయిలో ఉన్న శ్యామ్ బాబును మెప్పించి మాయను సొంతం చేసుకోగలిగాడా? అనేదే మిగతా కథ.

విశ్లేషణ:

ఫస్టాఫ్ అంతా మాయతో రాజు పరిచయం, ప్రేమ, ముద్దు వరకు వెళ్లడంతో సాగుతుంది. జగపతి బాబు పాత్రను ఇంట్రెస్ట్ కలిగించేలా డిజైన్ చేసిన విధానం బాగుంది. సెకండాఫ్‌లో ఆ పాత్రకు సంబంధించిన సీన్స్ ఉత్కంఠ కలిగిస్తాయి. తండ్రికూతుళ్ల అనుబంధం, యువజంట ప్రేమ ఈ రెండు అంశాలతోనే సింపుల్ స్టోరీగా గోదారి గట్టుపైన సాగుతుంది.

కట్టిపడేసే క్లైమాక్స్

ఆ అంశాలన్నింటిని బాగా చూపించారు. సుదర్శన్ కామెడీ టైమింగ్ అక్కడక్కడా నవ్వులు పూయిస్తుంది. ఇక క్లైమాక్స్‌కు ముందు వచ్చే 30 నిమిషాల డ్రామా ప్రేక్షకులను కట్టిపడేస్తుంది. అయితే, కొన్ని అనవసరమైన సీన్లను తగ్గించి ఉంటే బాగుండేది. తెలిసిన కథ కావడంతో సాగదీసిన భావన కలుగుతుంది. ఇంతకన్న ఎక్కువగా చెబితే స్పాయిలర్ అవుతుంది.

ఇక హీరో సుమంత్ ప్రభాస్ తన నటనతో ఆకట్టుకున్నారు. సాధారణంగా ఆటో డ్రైవర్ అంటే మాస్ యాంగిల్‌లో చూపిస్తారు. కానీ ఇందులో ఆ పాత్రను అమాయకంగా, ఒక మంచి మనసున్న వ్యక్తిగా చూపించడం బాగుంది. హీరోయిన్ నిధి ప్రదీప్ తొలి సినిమా అయినా చాలా బాగా పర్మార్మ్ చేసింది.

సాంకేతిక విభాగం

జగపతి బాబు తన నటనతో మెప్పించారు. అలాగే, రాజీవ్ కనకాల సైతం ఆకట్టుకున్నారు. మిగతా పాత్రలంతా తమ పరిధి మేర అలరించారు. ఎడిటింగ్ విషయంలో ఇంకాస్త జాగ్రత్త వహించాల్సింది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి. సినిమాటోగ్రఫీ చాలా బాగుంది.

దర్శకుడు సుభాష్ చంద్ర క్లైమాక్స్ విషయంలో ప్రతిభ చూపినా, అక్కడివరకు కథను నడిపించడంలో తడబడ్డారు. మొత్తానికి 'గోదారి గట్టుపైన' చిత్రం ఒక రొటీన్ ప్రేమకథే అయినా, పాటలు, బ్యూటిపుల్ విజవల్స్, సుమంత్ ప్రభాస్ నటన కోసం చూసేయొచ్చు.

రేటింగ్: 3/5

 
ABOUT THE AUTHOR
Chetupelli Sanjiv Kumar

చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe