Gunde Ninda Gudi Gantalu Today Episode: శివను కాపాడిన బాలు.. ఫ్యూచర్ అల్లుడికి థ్యాంక్స్.. 5 లక్షల వేటలో మీనా..

Gunde Ninda Gudi Gantalu Serial August 26th Episode: గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఆగస్ట్ 26 ఎపిసోడ్ లో శివను బాలు కాపాడతాడు. అయితే దీనికి కారణం అరుణ్ అని తెలియక బాలు గందరగోళంలో పడతాడు. అటు మీనా మూడు రోజుల్లో రూ.5 లక్షలు ఏర్పాటు చేసే పనిలో పడుతుంది.

Published on: Aug 26, 2026, 07:31:34 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Gunde Ninda Gudi Gantalu Serial Today Episode: స్టార్ మా సీరియల్ గుండె నిండా గుడి గంటలు ఈరోజు ఎపిసోడ్ ఉత్కంఠ రేపుతూ సాగింది. శివకు గుణ డ్రగ్స్ ఇవ్వబోతుండటం, సుమతి ఇచ్చిన లొకేషన్ తో బాలు అక్కడికి వస్తుండే సీన్లు ప్రేక్షకులను ఉత్కంఠకు గురి చేస్తాయి. అయితే చివరికి శివ సేఫ్ అయినా.. దీనికి కారణం సుమతి, అరుణ్ అని తెలియక బాలు, మీనా అయోమయంలో పడతారు.

Gunde Ninda Gudi Gantalu Today Episode: శివను కాపాడిన బాలు.. ఫ్యూచర్ అల్లుడికి థ్యాంక్స్.. 5 లక్షల వేటలో మీనా..
Gunde Ninda Gudi Gantalu Today Episode: శివను కాపాడిన బాలు.. ఫ్యూచర్ అల్లుడికి థ్యాంక్స్.. 5 లక్షల వేటలో మీనా..

శివ లొకేషన్ బాలుకి చెప్పిన సుమతి

శివ ఎక్కడున్నాడో బాలుకి సుమతి ఫోన్ చేసి చెప్పే సీన్ తో సీరియల్ బుధవారం (ఆగస్ట్ 26) ఎపిసోడ్ మొదలైంది. శివ లొకేషన్ తెలిసిందని, ఫుడ్ గోడౌన్ వెనుక ఉన్నట్లు చూపిస్తోందని సుమతి చెబుతుంది. నీకు లొకేషన్ ఎలా తెలిసిందని బాలు అడిగితే.. ఓ ఫ్రెండ్ ద్వారా పోలీసులకు చెప్పి లొకేషన్ కనుక్కొన్నానని సుమతి చెబుతుంది. సరే.. ఇక నువ్వు కంగారు పడకు.. నేను వెళ్లి శివను కాపాడతానని బాలు అంటాడు.

శివ కనిపించకపోవడంతో పార్వతి ఆందోళన

ఇటు ఇంటికి కంగారుగా వచ్చిన పార్వతి.. శివ గురించి తనకు ఎందుకు చెప్పలేదని సుమతిని నిలదీస్తుంది. నీకెలా తెలుసని అడిగితే.. నేనే చెప్పానంటూ మీనా వస్తుంది. ఆ ముదనష్టపు గుణగాడు వీడిని వదిలేడా లేడు.. చివరి పరీక్ష రాసేస్తే వాడు డిగ్రీ పూర్తి చేసి ఓ ఉద్యోగం వెతుక్కుంటాడని ఆశిస్తే వాడు ఇలా చేశాడని పార్వతి బాధపడుతుంది.

ఏం కాదులే అమ్మ.. నేను శివ లొకేషన్ బావకు ఇచ్చాను.. బావ వెళ్తున్నాడు అని సుమతి చెబుతుంది. నీకెలా లొకేషన్ తెలిసిందని మీనా అడిగితే.. తెలిసిన ఫ్రెండ్ తో పోలీసుల ద్వారా తెలుసుకున్నానని చెబుతుంది.

గుణను వేడుకున్న శివ.. మాట వినని గుణ

అటు శివను గుణ ఓ చోట కట్టేస్తాడు. తనను వదిలేయాలని, ఇవాళ చివరి పరీక్ష ఉందని శివ వేడుకుంటాడు. ఇది రాస్తే తన డిగ్రీ పూర్తవుతుందని, ఉద్యోగం చేసుకుంటానని అంటాడు.

డిగ్రీ పూర్తి చేసి ఉద్యోగం చేసి సంపాదించే జీతం కంటే తన దగ్గర పని చేస్తే రెండింతలు ఎక్కువిస్తానని గుణ అంటాడు. కానీ శివ మాత్రం అందుకు ఒప్పుకోడు. నీలాంటి లఫూట్ గాడి దగ్గర పని చేయను అని తేల్చి చెబుతాడు. దీంతో గుణ మరింత రెచ్చిపోతాడు.

శివకు డ్రగ్స్ ఇవ్వబోయిన గుణ

ఇక లాభం లేదు.. నీ పని నువ్వు చెయ్ అని తన మనిషికి చెబుతాడు గుణ. అతడు డ్రగ్స్ కలిపిన ఇంజెక్షన్ ను ఇవ్వడానికి రెడీ అవుతాడు. ఏంటది అని శివ అడిగితే.. అందులో డ్రగ్స్ ఉన్నాయి.. ఇది ఇస్తే నువ్వు మత్తుగా పడుకుంటావు.. ఎగ్జామ్ రాయలేవు.. అంతేకాదు ఇవి నీ ఫ్రెండ్స్ కు కూడా అమ్ముతున్నావని నీపై పోలీసు కేసు కూడా పెట్టిస్తాను అని గుణ బెదిరిస్తాడు. శివ వద్దని వేదుకుంటున్నా.. గుణ మనిషి ఆ ఇంజెక్షన్ ఇవ్వడానికి ప్రయత్నిస్తాడు.

గుణను చితకబాది శివను కాపాడిన బాలు, రాజేష్

అప్పుడే లొకేషన్ వెతుక్కుంటూ అక్కడికి వచ్చిన బాలు.. శివకు ఇంజెక్షన్ ఇవ్వబోతుండగా అతని చేయిని పట్టుకుంటాడు. గుణతోపాటు అతని మనుషులను బాలు, రాజేష్ చితకబాదుతారు. ఎన్నిసార్లు నిన్నిలా కొట్టాలిరా అంటూ గుణను బాలు ఇరగదీస్తాడు. అప్పుడే పోలీసులు కూడా వస్తారు.

మీరు కూడా వచ్చారా.. అసలు మీకెలా తెలుసు అని బాలు అడిగితే.. మా డిపార్ట్‌మెంట్ లోని వ్యక్తే సమాచారం ఇచ్చాడని వాళ్లు చెబుతారు. ఆ వ్యక్తి ఎవరో దేవుడిలా వచ్చి కాపాడాడు అని రాజేష్ అంటాడు. ఆ తర్వాత గుణతోపాటు అతని మనుషులను పోలీసులు తీసుకెళ్తారు.

అరుణ్‌కు థ్యాంక్స్ చెప్పిన సుమతి.. ఫ్యూచర్ అల్లుడు అంటూ..

అటు సుమతికి అరుణ్ ఫోన్ చేస్తాడు. జరిగిన విషయం చెబుతాడు. పోలీసులు వెళ్లే కంటే ముందే మీ బావ అక్కడికి వెళ్లి శివను కాపాడాడట అని అరుణ్ అంటాడు. అవును.. మా బావ చేయగలడనే ముందు ఆ లొకేషన్ ఆయనకు చెప్పానని సుమతి అంటుంది. ఇందుకు సాయం చేసిన అరుణ్ కు థ్యాంక్స్ చెబుతుంది.

మీ బావకు కూడా ఇలాగే థ్యాంక్స్ చెబుతారా అని అరుణ్ అడిగితే.. ఆయన మా ఇంటి అల్లుడు.. ఆయన వచ్చిన తర్వాతే మేము ధైర్యంగా ఉండగలుగుతున్నాం.. మొదట్లో తాగి గట్టిగా మాట్లాడితే భయపడేవాళ్లం కానీ ఆయన చాలా మంచివాడు అని సుమతి చెబుతుంది. అలా అయితే నేను కూడా ఫ్యూచర్ అల్లుడినే కదా అని అరుణ్ అంటే.. సుమతి సిగ్గు పడుతూ అప్పుడు థ్యాంక్స్ వెనక్కి తీసుకుంటానని అంటుంది.

మీనాకు బాలు ఫోన్.. ఊపిరి పీల్చుకున్న పార్వతి

మీనాకు బాలు ఫోన్ చేస్తాడు. శివ సేఫ్ గానే ఉన్నాడని, తన పక్కనే ఉన్నాడని చెబుతాడు. దీంతో మీనా, పార్వతి ఊపిరి పీల్చుకుంటారు. ఆ గుణగాడే వాడిని కిడ్నాప్ చేశాడని, సమయానికి సుమతి లొకేషన్ చెప్పడంతో తాను వెళ్లానని బాలు అంటాడు. తర్వాత శివతోనూ పార్వతి మాట్లాడుతుంది. తనకు ఏమీ కాలేదని, బాగానే ఉన్నానని శివ చెబుతాడు. అతన్ని ఎగ్జామ్ సెంటర్ కు తీసుకెళ్తానని బాలు చెప్పి ఫోన్ పెట్టేస్తాడు.

సుమతి ప్రేమ విషయం చెప్పబోయిన మీనా

అప్పుడే సుమతి కూడా అరుణ్ తో ఫోన్ మాట్లాడేసి వస్తుంది. మీ బావ శివను కాపాడాడట అని మీనా చెబితే తెలుసు అని సుమతి అంటుంది. నీకెలా తెలుసు అని మీనా అడిగితే.. మీ ముఖాలు వెలిగిపోవడం చూస్తుంటేనే తెలుస్తుందని కవర్ చేస్తుంది. అలాంటి అల్లుడు దొరకడం నిజంగా మన అదృష్టం అని పార్వతి అంటుంది.

అవును అక్కా.. బావ వచ్చినప్పటి నుంచీ మనం ధైర్యంగా ఉంటున్నామని సుమతి చెబుతుంది. నీకు ఎలాంటి భర్త వస్తాడో అని పార్వతి అంటే.. ఆ ఛాన్స్ మనకు ఇవ్వదులే అమ్మ.. తానే వెతుక్కుంటుంది అని మీనా అంటుంది. దీంతో సుమతి కంగారు పడుతుంది. కానీ మీనా ఆమె ప్రేమ విషయం చెప్పదు.

రూ.5 లక్షలు వేటలో మీనా

మరోవైపు మీనాకు పెద్ద ఆర్డర్ వచ్చినట్లు ఎపిసోడ్ చివర్లో చూపించారు. ఈ సీన్ తో చింతామణి రీఎంట్రీ ఇచ్చింది. అయితే ఆ ఆర్డర్ దక్కించుకోవాలంటే మూడు రోజుల్లో రూ.5 లక్షలు డిపాజిట్ చేయాలని కండిషన్ పెడతారు. మూడు రోజుల్లో రూ.30 వేలైనా తేగలవా అని చింతామణి ఎగతాళి చేస్తుంది. కాంట్రాక్టుపై సంతకం పెట్టిన మీనా.. మూడు రోజుల్లో రూ.5 లక్షలతో వస్తానని చింతామణికి ఛాలెంజ్ చేసి వెళ్తుంది. అక్కడితో గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.

  • Hari Prasad S
    ABOUT THE AUTHOR
    Hari Prasad S

    హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More