గుండె నిండా గుడి గంటలు టుడే ఎపిసోడ్: మాణిక్యం అల్లుడితోనే సుందరి పెళ్లి ఖాయం చేసిన బాలు, మీనా - ప్రభావతికి చింతామణి షాక్

Gunde Ninda Gudi Gantalu June 26th Episode: గుండె నిండా గుడి గంటలు సీరియల్ జూన్ 26 ఎపిసోడ్ లో మాణిక్యం అల్లుడితోనే సుందరి పెళ్లి ఖాయం చేస్తారు బాలు, మీనా. దీంతో వాళ్లిద్దరూ మరో మెట్టు పైకి ఎక్కుతారు. ఇటు ప్రభావతికి చింతామణి గట్టి షాకిస్తుంది.

Published on: Jun 26, 2026, 07:13:18 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Gunde Ninda Gudi Gantalu Today Episode: స్టార్ మా టాప్ సీరియల్ గుండె నిండా గుడి గంటలు ఈరోజు ఎపిసోడ్ కూడా చాలా ఆసక్తికరంగా సాగింది. బాలు, మీనా వల్ల సుందరి లేయిపోయిన సమస్య సామరస్యంగా పరిష్కారమవుతుంది. మాణిక్యం అల్లుడితోనే పెళ్లి ఫిక్స్ అయినా.. అతడు మాత్రం బాలు కంట పడడు. దీంతో ప్రస్తుతానికి రోహిణి సేఫ్ అయినా.. తర్వాత మాత్రం ఆమెకు ముప్పు తప్పేలా లేదు.

గుండె నిండా గుడి గంటలు టుడే ఎపిసోడ్: మాణిక్యం అల్లుడితోనే సుందరి పెళ్లి ఖాయం చేసిన బాలు, మీనా - ప్రభావతికి చింతామణి షాక్
గుండె నిండా గుడి గంటలు టుడే ఎపిసోడ్: మాణిక్యం అల్లుడితోనే సుందరి పెళ్లి ఖాయం చేసిన బాలు, మీనా - ప్రభావతికి చింతామణి షాక్

సుందరి పెళ్లికి ఒప్పుకున్న రంగా

రంగా ఇంటికి బాలు, మీనా వెళ్లే సీన్ తో గుండె నిండా గుడి గంటలు శుక్రవారం (జూన్ 26) ఎపిసోడ్ ప్రారంభమవుతుంది. సుందరి, నగలు రెండూ సేఫ్ గానే ఉన్నాయని, మీరు పెళ్లికి ఒప్పుకుంటే వాళ్లను ఇంటికి తీసుకొస్తామని రంగాతో చెబుతాడు.

అబ్బాయి బుద్ధిమంతుడు అని బాలు అనగానే రంగా కోపంతో ఊగిపోతాడు. పిల్లను లేపుకెళ్లిన వాడు బుద్దిమంతుడెలా అవుతాడని అంటాడు. ఈకాలం పిల్లలు అంతే.. అయినా వాళ్లు మీ అంగీకారంతోనే పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నారు.. అదీ గొప్ప విషయం.. వాళ్ల ఫ్యామిలీని కూడా కలిసి ఒప్పిస్తాం అని చెప్పడంతో రంగా శాంతించి సరే అంటాడు.

తృటిలో బాలు కంట పడకుండా తప్పించుకున్న మాణిక్యం

బాలు, మీనా బయటకు వస్తుంటే.. రంగా ఇల్లు వెతుక్కుంటూ మాణిక్యం వస్తుంటాడు. ఇంటి బయట బాలు, మీనా మాట్లాడుకుంటుండటంతో మాణిక్యంను వాళ్లు చూసేస్తారేమో అన్న ఉత్కంఠ కలుగుతుంది.

అయితే ఇంటికి దగ్గరగా వచ్చిన మాణిక్యం.. ఉత్త చేతులతో వెళ్తే బాగుండదని, పండ్లు తీసుకురావడానికి తిరిగి వెళ్తాడు. ఆలోపు బాలు, మీనా కూడా అబ్బాయి ఇంటికి వెళ్లి తల్లిదండ్రులతో మాట్లాడదామని బయలుదేరుతారు. దీంతో తృటిలో వాళ్లకు కనిపించకుండా తప్పించుకుంటాడు మాణిక్యం.

అబ్బాయి వాళ్ల ఇంటికి బాలు.. కిశోర్ తండ్రిని ఒప్పించి..

ఇటు బాలు, మీనా కలిసి అబ్బాయి కిశోర్ వాళ్ల ఇంటికి వెళ్తారు. సుందరి తరఫున వచ్చామని చెప్పగానే అబ్బాయి తండ్రి మండిపడతాడు. పెళ్లికి అంగీకరించే ప్రసక్తే లేదని అంటాడు.

మీరు ఒప్పుకోకపోయినా వాళ్లు పెళ్లి చేసుకుంటారు.. తర్వాత కాపురం చేసి పిల్లలను కన్న తర్వాత మీ మనసు కరిగి వాళ్లను చేరదీసినా.. వాళ్లలో ఆ అసంతృప్తి మిగిలిపోతుంది.. ఇప్పుడే పెద్ద మనసు చేసుకొని అంగీకరిస్తే వాళ్లూ సంతోషంగా ఉంటారని బాలు చెబుతాడు. దీంతో కిశోర్ తండ్రి మనసు కరుగుతుంది. అప్పుడే మాణిక్యం కూడా ఫోన్ చేసి తాను రంగాతో మాట్లాడానని, వాళ్లు చాలా మంచి వాళ్లని చెప్పడంతో అతడు ఇక పెళ్లికి ఒప్పుకుంటాడు.

ఇంటికి సుందరి.. రంగా కాళ్లు పట్టుకొని సారీ..

ఆ తర్వాత సుందరిని తీసుకొని రంగా ఇంటికి వెళ్తారు బాలు, మీనా. ఆమెను చూసి కామాక్షి ఆవేశంతో ఊగిపోయినా వాళ్లు అడ్డుకుంటారు. తర్వాత రంగా కాళ్ల మీద పడి సుందరి క్షమాపణ అడుగుతుంది. ముందే చెప్పి ఉంటే ఆ సంబంధం చూసే వాడిని కాదు కదా.. మీ పెళ్లికి మాకు ఎలాంటి అభ్యంతరం లేదు అని రంగా అంటాడు.

ఆ అబ్బాయి మేనమామ కూడా ఇంటికి వచ్చి వెళ్లాడని, సుందరి వచ్చిన తర్వాత మళ్లీ వస్తా అన్నాడని బాలుతో రంగా చెబుతాడు. అతనికి ఫోన్ చేస్తాను.. వచ్చిన తర్వాత మాట్లాడి వెళ్లండి అని అంటే.. బాలు మాత్రం ఉదయం నుంచీ ఇక్కడే ఉన్నాను.. ఒక్క ట్రిప్ కైనా వెళ్లాలని చెప్పి వెళ్లిపోతాడు.

ప్రభావతి దెప్పిపొడుపులు

ఇంటికి వెళ్లగానే ప్రభావతి దెప్పిపొడుపులు మొదలవుతాయి. అందరి సమస్యలు పరిష్కరించారా.. వీళ్లు లేకపోతే ఈ ఊరే నడవదు అన్నట్లుగా చేస్తున్నారు అంటూ తనదైన స్టైల్లో బాలు, మీనాలపై పడి ఏడుస్తుంది. అయితే వాళ్లు చేసిన పని విన్న తర్వాత సత్యం సంతోషిస్తారు. సుందరి పెళ్లి ఖాయం చేసి వచ్చామని, అన్ని సమస్యలు తీరిపోయినట్లే అని బాలు చెబుతాడు. దీంతో ప్రభావతి అక్కడి నుంచి వెళ్లిపోతుంది.

రంగా ఇంటికి మాణిక్యం.. పెళ్లి ఖాయం

మరోవైపు రంగా ఇంటికి మాణిక్యం మరోసారి వెళ్తాడు. మావాడిని పూర్తిగా నీ గుప్పిట్లోకి తీసుకున్నావుగా అంటూ సుందరిని ఆటపట్టిస్తాడు. మా అక్కాబావ కూడా పెళ్లికి అంగీకరించారని, అందరం కలిసి నిశ్చితార్థం, పెళ్లి ముహూర్తాలు పెట్టుకుందామని మాణిక్యం అంటాడు. అదే సమయంలో మీ ఫ్రెండ్ వాళ్లబ్బాయి అంటూ బాలు గురించి మాణిక్యం మాట్లాడతాడు.

వాళ్లు లేకపోతే ఇది ఇంత సులువుగా పరిష్కారం అయ్యేది కాదని అంటాడు. అతన్ని పిలిపిస్తానని, మాట్లాడుదామని రంగా అంటే.. ఇప్పుడు వద్దులెండి తర్వాత మాట్లాడుదాం.. పెళ్లి ఖాయం అయింది కాబట్టి ఇక నుంచి కలుస్తూనే ఉంటాం కదా అని మాణిక్యం వెళ్లిపోతాడు.

కామాక్షి ఇంటికి చింతామణి.. ప్రభావతిని పట్టించుకోకుండా..

అటు కామాక్షి ఇంటికి వచ్చిన చింతామణి రుసరుసలాడుతుంది. ప్రభావతి గురించి ఏదో అనుకున్నాను.. కానీ ఆమెకు అత్తకు ఉండాల్సిన పవర్ అసలు లేనట్లుంది.. మీనాను అడ్డుకోమని చెప్పినా ఆమె ఇంట్లో నుంచే పనులన్నీ పూర్తి చేసింది అని అంటుంది. మీనా చాలా తెలివైన అమ్మాయి అని కామాక్షి కూడా మెచ్చుకుంటుంది.

అప్పుడే ప్రభావతి వస్తుంది. ఆమెను చూసి కూడా చింతామణి ఏమీ పట్టనట్లు కాలి మీద కాలేసుకొని కూర్చొంటుంది. ప్రభావతికి పరిస్థితి అర్థమై సైలెంట్ గా లోనికి వెళ్లిపోతుంది. మీనా విషయంలో గుర్రుగా ఉందని కామాక్షి చెబుతుంది. తాను అడ్డుకున్నా అది అలా చేస్తే నేనేం చేయాలని ప్రభావతి అంటుంది.

సుందరి విషయంలో కామాక్షి కూడా మీనాను పొగడటంతో ప్రభావతికి మరింత మండుతుంది. తర్వాత చింతామణి దగ్గరికి వెళ్లి కొత్త డ్యాన్స్ స్టెప్ నేర్పిస్తానని ప్రభావతి చెప్పినా ఆమె అవసరం లేదు అని అంటుంది. దీంతో ప్రభావతి షాక్ తింటుంది. అక్కడితో గుండె నిండా గుడి గంటలు ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.

  • Hari Prasad S
    ABOUT THE AUTHOR
    Hari Prasad S

    హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More