గుండె నిండా గుడి గంటలు టుడే ఎపిసోడ్: కామాక్షి నగలతో ఉడాయించిన సుందరి - మాణిక్యం అల్లుడితోనే - బాలు వేట.. రోహిణికి గండం
Gunde Ninda Gudi Gantalu June 25th Episode: గుండె నిండా గుడి గంటలు సీరియల్ జూన్ 25 ఎపిసోడ్ లో కామాక్షి నగలతో ఉడాయిస్తుంది సుందరి. అయితే ఇందులో అసలు ట్విస్ట్ ఏంటంటే.. మటన్ కొట్టు మాణిక్యం అల్లుడితోనే ఆమె జంప్ కావడం. బాలు, మీనా ఆమె కోసం వేట మొదలుపెడతారు.
Gunde Ninda Gudi Gantalu Today Episode: స్టార్ మా సీరియల్ గుండె నిండా నిండా గుడి గంటలు ఈరోజు ఎపిసోడ్ లో పెద్ద ట్విస్టే ఎదురైంది. అది అటు తిరిగి ఇటు తిరిగి రోహిణి మెడకు చుట్టుకునేలా ఉంది. కామాక్షి నగలతో సుందరి ఉడాయించడం, ఆ అబ్బాయి మటన్ కొట్టు మాణిక్యం అల్లుడే కావడం ఇక్కడ అసలు ట్విస్ట్.

అత్తకు మీనా, శృతి మాటకు మాట
బాలు స్టార్ట్ చేసిన డ్రైవింగ్ స్కూల్లో డ్రైవింగ్ నేర్చుకోవడానికి మీనా చెక్కు రాసే సీన్ తో సీరియల్ తాజా ఎపిసోడ్ ప్రారంభమైంది. ప్రభావతి దెప్పిపొడవడంతో మీనా, శృతి ఆమెకు తమదైన స్టైల్లో గడ్డి పెడతారు. అటు రోహిణి, మనోజ్ లకు కూడా తలంటు పడుతుంది. దీంతో ఏం మాట్లాడాలో తెలియక అందరూ బిక్కమొహాలు వేస్తారు.
మనోజ్‌ను చితకబాదిన రోహిణి
రూమ్ లోకి వెళ్లగానే మనోజ్ ను రోహిణికి చితకబాదుతుంది. ఇంటికి తగిలించిన అతని డిగ్రీలు ఉన్న నేమ్ బోర్డుతో కొడుతుంది. ఇన్ని డిగ్రీలు చదివి ఏం లాభం.. ఇంత కూడా ముందు జాగ్రత్త, తెలివి లేదు.. జీఎస్టీ కట్టాలని తెలియదా.. రూ.3 లక్షలు అప్పు అయింది అంటూ రోహిణి రెచ్చిపోతుంది. నీకంటే బాలు చాలా నయం.. చదువుకోకపోయినా అన్నింట్లోనూ జాగ్రత్తగా ఉంటాడు అని కూడా అంటుంది. దీంతో మనోజ్ లబోదిబోమంటాడు.
సుమతికి ఫైన్ వేసిన ట్రాఫిక్ పోలీస్ అరుణ్
మరోవైపు రోడ్డుపై స్కూటీపై వెళ్తున్న సుమతిని ట్రాఫిక్ పోలీస్ అరుణ్ ఆపుతాడు. హెల్మెట్ ఏదంటూ ప్రశ్నిస్తాడు. నేను మీకు తెలుసు కదా.. హాస్పిటల్లో కలిశాను.. మీ అమ్మగారికి ఎలా ఉంది అంటూ సుమతి అడుగుతుంది.
బాగానే ఉంది కానీ.. తెలిసిన వాళ్లయినా నేను డ్యూటీలో ఉన్నప్పుడు పట్టించుకోను.. ఫైన్ కట్టాల్సిందే అని అరుణ్ అంటాడు. రూ.1000 కట్టమంటాడు. అన్ని డబ్బులా అని సుమతి అంటే.. నేనే కడతాను అని అరుణ్ అంటాడు. అవసరం లేదు.. నేనే కడతానంటూ సుమతి డబ్బులు ఇచ్చి వెళ్లిపోతుంది. డ్యూటీలో ఉంటే సార్ వాళ్ల అమ్మగారికి కూడా ఓసారి ఫైన్ వేశాడని పక్కనే ఉన్న కానిస్టేబుల్ చెబుతాడు.
సుందరికి కామాక్షి నగలు.. ఇంటికి సత్యం, ప్రభావతి, బాలు, మీనా
ఇటు సుందరిని పెళ్లి చూపుల కోసం కామాక్షి రెడీ చేస్తుంది. తన నగలన్నీ ఆమెకు వేస్తుంది. వాటిని ఎలా కొన్నానో కూడా ఆమెకు చెబుతుంది. ఆ నగలు చూసి సుందరి మురిసిపోతుంది. అప్పుడే ఇంటికి సత్యం, ప్రభావతి, బాలు, మీనా వస్తారు. సుందరి రెడీ అయిందా.. ఓసారి పంపిస్తే రిహార్సల్ చేస్తానని బాలు సరదాగా అంటాడు. రెడీ అయితే వెళ్లి తీసుకురా అని కామాక్షిని పంపిస్తాడు రంగా.
కామాక్షి బంగారంతో ఉడాయించిన సుందరి
లోనికి వెళ్లిన కామాక్షి అక్కడ ఓ లెటర్ ఉండటం చూసి గట్టిగా అరుస్తుంది. నాకీ సంబంధం ఇష్టం లేదు.. మరో అబ్బాయిని ప్రేమించాను.. నాకోసం వెతకొద్దు అని అందులో రాసి ఉంటుంది.
తన నగలన్నీ తీసుకొని సుందరి ఉడాయించిందని కామాక్షి లబోదిబోమని ఏడుస్తుంది. పెళ్లి చూపులకు ముందు అమ్మాయి పారిపోయిందని తెలిస్తే పరువు పోతుందని రంగా భయపడుతుంటే.. కామాక్షి మాత్రం తన నగలు పోయాయని ఏడుస్తుంది.
సుందరిని వెతుక్కుంటూ హాస్టల్‌కు బాలు, మీనా
ఏమీ భయపడొద్దని, సుందరిని తాను వెతికి పట్టుకొస్తానని మీనాను తీసుకొని వెళ్తాడు బాలు. ఎక్కడని వెతుకుతామని మీనా అంటే ఆమెను నేరుగా సుందరి హాస్టల్ కు తీసుకెళ్తాడు బాలు. అక్కడ ఆమె రూమ్మేట్ స్వప్నను పిలిపిస్తాడు. సుందరి గురించి వివరాలు అడిగితే మొదట ఆమె చెప్పదు. కానీ మీనా రంగంలోకి దిగి సార్ సీఐడీ నుంచి వచ్చాడు.. చెప్పకపోతే నిన్ను సీఐడీ ఆఫీసుకు తీసుకెళ్తాడని బెదిరిస్తుంది.
మాణిక్యం అక్క కొడుకుతోనే సుందరి జంప్
ఇటు సీరియల్లో పెద్ద ట్విస్ట్ వస్తుంది. సుందరి లేచిపోయింది మటన్ కొట్టు మాణిక్యం అక్కడ కొడుకుతోనే అని తేలుతుంది. అబ్బాయి పారిపోవడంతో ఆ తల్లిదండ్రులు కూడా బాధపడుతుంటే మాణిక్యం వచ్చి ఓదారుస్తాడు. అమ్మాయి పెదనాన్నకు సంబంధించిన వివరాలు ఉన్నాయని అబ్బాయి తల్లి చెబుతుంది.
తాను వాళ్లు ఎక్కడున్నారో తెలుసుకుంటానని మాణిక్యం చెబుతాడు. అయితే బాలుకి సంబంధం ఉన్న అమ్మాయితోనే తన అల్లుడు లేచిపోయాడని అప్పుడు మాణిక్యానికి తెలియదు. ఇది తర్వాతి ఎపిసోడ్లలో ఎలాంటి ట్విస్ట్ ఇస్తుంది.. రోహిణిని ఎలా ఇబ్బందుల్లోకి నెట్టేస్తుందన్నది తేలనుంది.
కిశోర్ వివరాలు బాలుకి చెప్పిన స్వప్న
మరోవైపు మీనా బెదిరింపులకు భయపడిన స్వప్న ఆ అబ్బాయి వివరాలు చెబుతుంది. అబ్బాయి పేరు కిశోర్ అని, ప్రస్తుతం వాళ్లు ఓ ఫ్రెండ్ ఇంట్లో ఉన్నారని వెల్లడిస్తుంది. ఆ వివరాలతో కామాక్షి ఇంటికి వెళ్తారు బాలు, మీనా. అక్కడ కామాక్షి వెంట పడి కొడుతుంటాడు రంగా. ఆ అబ్బాయితో రోజూ ఫోన్ లో సుందరి మాట్లాడే విషయం ముందే తెలిసినా చెప్పలేదని రంగా అంటాడు. అమ్మాయి ఎక్కడ ఉందో తెలిసిందని బాలు, మీనా చెబుతారు. అక్కడితో గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.
ABOUT THE AUTHORHari Prasad Sహరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More

E-Paper


