Gunde Ninda Gudi Gantalu Today Episode: మొగుడిని మించిన మాయలాడివే అంటూ రోహిణిని కడిగి పారేసిన మీనా.. రసవత్తరమైన సీన్
Gunde Ninda Gudi Gantalu Today Episode: గుండె నిండా గుడి గంటలు సీరియల్ మే 12 ఎపిసోడ్ లో రోహిణిని కడిగి పారేస్తుంది మీనా. నీ మొగుడిని మించిన మాయలాడివి అంటూ పరువు తీస్తుంది. ఈ సీన్ చాలా రసవత్తరంగా సాగింది.
Gunde Ninda Gudi Gantalu Today Episode: గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఈరోజు ఎపిసోడ్ లో మీనా ఉగ్రరూపం చూడొచ్చు. అత్తను మించిపోయేలా రోహిణికి క్లాస్ పీకే సీన్ ఈ ఎపిసోడ్ లో హైలైట్. భార్యాభర్తలను కలవకుండా ప్రభావతి చేస్తే.. వాళ్లకు భోజనాలు తీసుకొని వెళ్లిన బాలు, మీనా మాటలు పడతారు. ఆ తర్వాత ఏం జరిగిందో చూడండి.

రోహిణికి మళ్లీ క్లాస్ పీకిన ప్రభావతి
గుండె నిండా గుడి గంటలు సీరియల్ మంగళవారం (మే 12) ఎపిసోడ్ రోహిణికి మరోసారి ప్రభావతి క్లాస్ పీకే సీన్ తో మొదలవుతుంది. శృతి వాళ్ల అమ్మ ఫోన్ చేస్తే నోటికొచ్చినట్లు మాట్లాడవట.. పెద్దలంటే గౌరవం లేదా అంటూ రోహిణిపై మండిపడుతుంది.
ఆమె మన ఇంటి విషయాలు అడిగే సరికి మీ జోక్యం అవసరం లేదని చెప్పానని రోహిణి అంటుంది. తర్వాత రోహిణికి మనోజ్ సపోర్ట్ ఇవ్వడానికి వెళ్లగా.. అతన్ని తిట్టి పంపించేస్తుంది. ఇక నుంచి రోహిణి షోరూమ్ కు రాదని స్పష్టం చేస్తుంది. దీంతో తల్లి మాట కాదనలేక మనోజ్ వెళ్లిపోతాడు.
శృతిని నిలదీసిన రోహిణి.. ముగ్గురు కోడళ్ల గొడవ
ఆ తర్వాత ఇంట్లో ముగ్గురు కోడళ్ల మధ్య గొడవ జరుగుతుంది. తనను అత్త కొట్టిన విషయం మీ అమ్మకు ఎందుకు చెప్పావని శృతిని రోహిణి నిలదీస్తుంది. చెప్తే తప్పేంటని శృతి అంటుంది. హాల్లో జరిగిందే చెప్పింది కదా బెడ్ రూమ్ లో విషయం కాదు కదా అని మీనా మద్దతుగా మాట్లాడుతుంది.
దీంతో ముగ్గురి మధ్య గొడవ పెద్దదవుతుంది. మరోసారి నా విషయం చెబితే బాగుండదు అని రోహిణి వార్నింగ్ ఇస్తుంది. ఏం చేస్తావంటూ రోహిణిపైకి శృతి వెళ్తుంటే.. మీనా అడ్డుపడుతుంది.
తల్లి అనుమతితో రోహిణితో మాట్లాడిన మనోజ్
గదిలోకి వెళ్లిన తర్వాత మనోజ్ ఇంకా రాకపోవడంతో అతనికి ఫోన్ చేస్తుంది. మనోజ్ మాత్రం భయంతో ఫోన్ తీయడు. ఎన్నిసార్లు చేసినా లిఫ్ట్ చేయడు. ఎందుకు ఇన్నిసార్లు కాల్ చేస్తుందో కనుక్కుందామని తల్లికి ఫోన్ చేస్తాడు. ఆమెతో మాట్లాడొచ్చా అని అనుమతి తీసుకుంటాడు. మాట్లాడు కానీ.. ఈరోజు ఇంటికి రావడం లేదని చెప్పు అని ప్రభావతి అంటుంది.
ఇవాళ లోడ్ వస్తుందన్నావ్ కదా.. అదే విషయం చెప్పమంటుంది. అతడు సరే అంటాడు. ఆ తర్వాత రోహిణి మళ్లీ ఫోన్ చేస్తే అదే చెప్పి ఫోన్ పెట్టేస్తాడు. కిచెన్ లో వంట చేస్తున్న మీనా దగ్గరికి వెళ్లిన ప్రభావతి.. ఈరోజు మనోజ్ రావడం లేదని, ఒకరికి వంట తక్కువ చేయాలని చెబుతుంది. ఆ విషయం రోహిణి వింటుంది.
మనోజ్, రోహిణిలను కలవనీయడం లేదన్న మీనా
ఆ తర్వాత ఇంటికి వచ్చిన బాలు ఇంత ప్రశాంతంగా ఉందేంటి అని మీనాను అడుగుతాడు. జరిగిన విషయం చెప్పిన మీనా.. రోహిణి, మనోజ్ లను అత్తయ్య కలవనీయడం లేదని అంటుంది. భార్యాభర్తలను కలవకుండా చేసే వాళ్లు బాగుపడరని చెబుతుంది. అప్పుడే రోహిణి కనీసం తిన్నదో లేదో.. ఆమెకు భోజనం తీసుకెళ్తానని మీనా అంటుంది. సరే అని బాలు వెళ్లిపోతాడు.
మనోజ్‌కు భోజనం తీసుకెళ్లిన బాలు
అటు షాపులో ఉన్న అన్న కోసం బాలు బిర్యానీ తీసుకెళ్తాడు. మంచి ఆకలిపై ఉన్న అతడు.. గబగబా తినేస్తాడు. అమ్మకి నువ్వు డబ్బు మింగావన్న కోపం కాదని, తనకు చెప్పకుండా మింగావన్నదే బాధ అని బాలు అంటాడు. అటు రోహిణి కోసం మీనా భోజనం తీసుకెళ్లిందనీ చెబుతాడు. అయితే అంతా తిన్న తర్వాత మనోజ్ మళ్లీ బుద్ధి చూపిస్తాడు. తనకు భోజనం తీసుకొచ్చి షాపును కొట్టేద్దామనుకుంటున్నావా అని అంటాడు. దీంతో బాలు మరోసారి తనదైన స్టైల్లో మనోజ్ ను తిట్టి వెళ్లిపోతాడు.
రోహిణిని ఎగతాళి చేసిన మీనా
ఇటు రోహిణికి కూడా మీనా భోజనం తీసుకెళ్తుంది. అంతా తిన్న తర్వాత ప్లేటు కూడా మీనాను తీసుకెళ్లమంటుంది. అది చాలదన్నట్లు.. ఇన్నాళ్లూ నెత్తిన పెట్టుకున్న అత్తయ్య నన్ను కొట్టింది కదా.. ఇప్పుడు నీకు సంతోషంగా ఉందా అని మీనాను అడుగుతుంది.
దీంతో ఇక మీనా రెచ్చిపోతుంది. నీలా నాకు నటించడం రాదు.. నువ్వో మహానటివి.. ఇల్లు తాకట్టు పెట్టి పార్లర్ పెట్టడం, తర్వాత డబ్బు కోసం దానికి అత్తయ్య పేరు పెట్టడం, నీ మొగుడి లవర్ మింగిన సొమ్ము తిరిగిస్తే దానిని జైల్లో ఉన్న మీ నాన్న ఇచ్చాడని అబద్ధం చెప్పడం.. ఇలా చెత్త నటన నాకు రాదు అని ఎడాపెడా వాయించేస్తుంది. ఇంతసేపూ మనుషులు తిన్నదే కదా తిన్నావు.. ఎందుకలా మాట్లాడతావు అని పరువు తీస్తుంది.
మొగుడిని మించిన మాయలాడివే నువ్వు అనీ తిడుతుంది. మీనా విశ్వరూపం చూసి రోహిణి నోట మాటరాదు. ఆమెను నోరెత్తనీయకుండా మీనా తిట్టిన తిట్టు తిట్టకుండా తిడుతుంది. దీంతో ఆమె ముఖం ఎక్కడ పెట్టుకోవాలో తెలియని పరిస్థితుల్లోకి వెళ్లిపోతుంది. అక్కడితో గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.
ABOUT THE AUTHORHari Prasad Sహరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More

E-Paper


