గుండె నిండా గుడి గంటలు టుడే ఎపిసోడ్: రోహిణికి ముంచుకొస్తున్న ‘మలేషియా’ ముప్పు.. బాలు ఇంటికి అనుకోని అతిథులు.. గుణకు షాక్
గుండె నిండా గుడి గంటలు టుడే ఎపిసోడ్: గుండె నిండా గుడి గంటలు సీరియల్ మే 25 ఎపిసోడ్ లో బాలు ఇంటికి అనుకోని అతిథులు రావడానికి సిద్ధమయ్యారు. అయితే ఆ అతిథులే రోహిణి మలేషియా గుట్టు రట్టు చేయబోతున్నారు. తర్వాత ఏం జరిగిందో చూడండి.
గుండె నిండా గుడి గంటలు టుడే ఎపిసోడ్: బాలు, మీనా కలిసి రోహిణి మలేషియా డ్రామా గుట్టు రట్టు చేయడానికి సిద్ధమవుతున్నారు. ట్రిప్‌లో బాలుకి అనుకోకుండా కలిసి మలేషియా దంపతులు.. వాళ్ల ఇంటికి అతిథులుగా రాబోతున్నారు. దీంతో ఓవైపు పోయిన డబ్బు కోసం వెతుకుతున్న రోహిణికి.. మరో పెద్ద గండం ముంచుకొస్తోంది.

బాలుకి కలిసిన మలేషియా దంపతులు
గుండె నిండా గుడి గంటలు సీరియల్ సోమవారం (మే 25) ఎపిసోడ్ బాలుకి మలేషియా దంపతులు ట్రిప్ లో కలిసే సీన్ తో మొదలవుతుంది. తనది పాలకొల్లు అయినా మలేషియాలో సెటిలయ్యానని, చాలా ఏళ్ల తర్వాత రాజమండ్రి వచ్చినట్లు ఆ వ్యక్తి చెబుతాడు. తన భార్యను పరిచయం చేస్తాడు.
బాలు కూడా రాజమండ్రి గురించి, ఇన్నేళ్లలో ఇక్కడ మారిన పరిస్థితుల గురించి చెప్పి పరిచయం పెంచుకుంటాడు. ఈరోజు తమ 25వ పెళ్లి రోజు అని వాళ్లు చెప్పి గుడికి తీసుకెళ్లమని అడుగుతారు. సరే అంటూ ముందుగానే మీనాకు ఫోన్ చేసి గుడిలో ఏర్పాట్లు చేయాలని బాలు చెబుతాడు.
సీసీటీవీ ఫుటేజీ కోసం గుడికి గుణ
మరోవైపు రోహిణి చెప్పినట్లుగానే గుడిలో సీసీటీవీ ఫుటేజీ కోసం గుణ వెళ్తాడు. అదే గుడి దగ్గర పూలు అమ్మే మీనా తల్లి పార్వతి, చెల్లి సుమతి, తమ్ముడు శివ అతన్ని చూస్తారు. వీడు మళ్లీ నీ గురించే వచ్చాడా అని తల్లి అడిగితే.. లేదని శివ అంటాడు. తర్వాత గుడి సెక్రటరీ దగ్గరికి వెళ్లిన గుణ తనకు సీసీటీవీ ఫుటేజ్ కావాలని అడుగుతాడు.
ఎవరికి పడితే వాళ్లకు ఇవ్వమని ఆ వ్యక్తి కాస్త గట్టిగానే చెబుతాడు. తాను గుడి బయట పూలు అమ్మే మీనా తమ్ముడు శివకు ఫ్రెండ్ అని చెప్పినా ఆ వ్యక్తి వినడు. వాళ్లు కూడా ఆ ఫుటేజీ అడిగినా ఇవ్వలేదని అంటాడు. దీంతో గుణకు షాక్ తగులుతుంది.
గుణ గురించి మీనాకు చెప్పిన గుడి సెక్రటరీ
ఇటు గుడిలో మలేషియా దంపతుల కోసం మీనా ఏర్పాట్లు చేస్తుంటుంది. బయటకు వచ్చిన తర్వాత గుణ వచ్చాడంటూ పార్వతి.. మీనాకు చెబుతుంది. అప్పుడే గుడి సెక్రటరీ కూడా మీనా దగ్గరికి వచ్చి ఓ వ్యక్తి మీ పేరు చెప్పి సీసీటీవీ ఫుటేజీ అడిగాడని అంటాడు. అతని పేరు గుణానా అని అడిగితే అవునని చెబుతాడు. అంటే రోహిణి పంపిస్తేనే వాడు వచ్చి ఉంటాడు.. ఇన్నాళ్లూ అప్పులే అనుకున్నాను.. వాడితో ఇలాంటి పనులు కూడా చేయిస్తుందన్నమాట అని మీనా అంటుంది.
మలేషియా దంపతుల 25వ పెళ్లి రోజు జరిపిన బాలు
ఆ తర్వాత మలేషియా దంపతులను తీసుకొని బాలు గుడికి వస్తాడు. మీనా, ఆమె పుట్టింటి వాళ్లను పరిచయం చేస్తాడు. అప్పటికే వాళ్లు అన్ని ఏర్పాట్లు చేస్తారు. వాళ్ల కోసం దండలు కూడా ఇస్తారు. దీంతో వాళ్లు ఆశ్చర్యపోతారు.
బాలు అనుకుంటే.. మీరు కూడా అంతే మంచితనం చూపిస్తున్నారేంటి అని అంటారు. తర్వాత గుడిలోకి తీసుకెళ్లి ప్రత్యేక పూజలు చేయించి వాళ్ల పెళ్లి రోజును బాలు ఘనంగా చేస్తాడు. దీంతో వాళ్లు ఎంతో సంతోషిస్తారు. అంతేకాదు భోజనానికి తమ ఇంటికే రావాలని, మీనా చాలా బాగా వంట చేస్తుందని కూడా చెబుతాడు. వాళ్లు సరే అంటారు.
శిష్యులను చూసి మురిసిపోయిన ప్రభావతి
అటు డ్యాన్స్ క్లాసులో శిష్యులకు ప్రభావతి డ్యాన్స్ నేర్పిస్తూ ఉంటుంది. మీరు చాలా బాగా నేర్పిస్తున్నారని, మీరు కొత్త ఇంటికి వెళ్లిపోతే తాము చాలా మిస్ అవుతామని వాళ్లు అంటారు. దీంతో ప్రభావతి తెగ మురిసిపోతుంది. తాను ఎక్కడికీ వెళ్లడం లేదని, ఇక్కడే ఉంటానని, డ్యాన్స్ నేర్పిస్తూనే ఉంటానని చెబుతుంది. అది విని వాళ్లలో ఉండే లవర్స్ సంతోషపడతారు. బయటకు వెళ్లిన తర్వాత ప్రభావతి వాళ్లు ఇంటి విషయంలో మోసపోయిన విషయం గురించి ఆ అబ్బాయికి అమ్మాయి చెబుతుంది.
గుణ దగ్గరికి రోహిణి
ఇటు గుణ ఫోన్ చేయడంతో రోహిణి అతని దగ్గరికి వెళ్తుంది. సీసీటీవీ ఫుటేజ్ దొరికిందా అని అడిగితే లేదని చెబుతాడు. ఎంత ప్రయత్నించినా అతడు వినలేదని అంటాడు. మీనా పేరు చెప్పలేదా అని అడిగితే.. చెప్పినా వినలేదని, తాను వెళ్లినప్పుడు వాళ్లందరూ అక్కడే ఉన్నారని కూడా గుణ చెప్పడంతో రోహిణి షాక్ తింటుంది. వాళ్లు ఉన్నప్పుడు ఎందుకు వెళ్లావని అడిగితే.. వాళ్లు రోజంతా అక్కడే ఉంటారు.. వాళ్లు లేకుండా ఎలా వెళ్లేదని అడుగుతాడు.
అంతేకాదు మీనా కూడా ఆ ఫుటేజీ గురించి అడిగిందట అని గుణ చెప్పడంతో రోహిణి షాక్ తింటుంది. అంటే వాళ్లు కూడా ఇంకా అతని గురించి వెతుకుతున్నారన్నమాట అని అనుకుంటుంది. పోలీసుల ద్వారానే ప్రయత్నించాలని గుణ చెప్పి వెళ్లిపోతాడు. వెంటనే మనోజ్ కు ఫోన్ చేసి పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఆ ఫుటేజీ సంపాదించే ప్రయత్నం చేయాలని చెబుతుంది.
రోహిణి గురించి ప్రభావతికి సర్ది చెప్పిన కామాక్షి
మరోవైపు రోహిణి వల్లే మనోజ్ గాడికి ఏదీ కలిసి రావడం లేదని, ఆమె చేసే పనుల వల్లే వాడికి ఇలా జరుగుతోందని చెప్పి ప్రభావతి బాధపడుతుంది. కానీ కామాక్షి మాత్రం ఆమెకు సర్ది చెబుతుంది. తన భర్త కోసం ఆమె అలా చేస్తోంది.. అయినా ఇంట్లో నిన్ను గౌరవించే కోడలు ఆమె ఒక్కతే.. రేపు మలేషియా తండ్రి ఆస్తి మొత్తం ఆమెకే వస్తుంది.. రోహిణితో బాగా ఉంటేనే నీకు లాభం అని చెబుతుంది. దీంతో ప్రభావతి కూడా ఆలోచనలో పడుతుంది.
అటు మలేషియా అతిథుల కోసం మీనా వంట చేయడానికి సిద్ధమవుతుంది. వాళ్లు ఇంటికి వస్తే రోహిణి మలేషియా గుట్టు రట్టు కావడం ఖాయంగా కనిపిస్తోంది. అప్పుడే ప్రభావతి ఇంటికి వచ్చి ఏం చేస్తున్నావంటూ మీనాను నిలదీస్తుంది. అంతటితో గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.
ABOUT THE AUTHORHari Prasad Sహరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More

E-Paper


