Gunde Ninda Gudi Gantalu Today Episode: రోహిణిని బయటకు గెంటేసిన ప్రభావతి.. జాబ్ మానేసిన శృతి.. మీనాపై అలిగిన బాలు
Gunde Ninda Gudi Gantalu Serial September 16th Episode: గుండె నిండా గుడి గంటలు సీరియల్ సెప్టెంబర్ 16 ఎపిసోడ్ లో రోహిణిని మరోసారి ఇంట్లో నుంచి గెంటేస్తుంది ప్రభావతి. అడ్డొచ్చిన మీనా, బాలుతో గొడవ పడుతుంది. అటు నీతూ, రవితో గొడవ పడి శృతి జాబ్ మానేస్తుంది.
Gunde Ninda Gudi Gantalu Serial Today Episode: స్టార్ మా సీరియల్ గుండె నిండా గుడి గంటలు ఈరోజు ఎపిసోడ్ లో మనోజ్ కు చలి జ్వరం వస్తుంది. అతనికి సేవలు చేస్తున్న రోహిణిపై నిందలు వేసి ఇంట్లో నుంచి వెళ్లగొట్టడానికి ప్రభావతి ప్రయత్నిస్తుంది. మరోవైపు రెస్టారెంట్లో తనను టీజ్ చేసిన వారితో శృతి గొడవ పడుతుంది. తర్వాత జాబ్ మానేస్తుంది.

సుమతి డబ్బు తీసుకొని మీనా ఎమోషనల్
మీనా తన ఆర్డర్ కు డిపాజిట్ చెల్లించడానికి సుమతి డబ్బు సాయం చేసే సీన్ తో సీరియల్ బుధవారం (సెప్టెంబర్ 16) ఎపిసోడ్ మొదలైంది. సుమతి డబ్బు తీసుకుంటూ మీనా ఎమోషనల్ అవుతుంది. ఇంకా నేను నీకు జడలు వేసి, స్కూలు పంపిస్తున్న జ్ఞాపకాలే ఉన్నాయి.. అప్పుడే ఇంత పెద్దదానివి అయిపోయావు.. ఆర్డర్ పూర్తి కాగానే డబ్బు తిరిగి ఇచ్చేస్తా అని మీనా అంటుంది. మా చదువుల కోసం నువ్వు నీ చదువు పక్కన పెట్టావు.. ఈ మాత్రం కూడా సాయం చేయకపోతే ఎలా అని సుమతి అంటుంది. తర్వాత మీనా వెళ్లిపోతుంది.
శృతిని టీజ్ చేసిన కస్టమర్లు.. రవిని తిట్టిన శృతి
మరోవైపు రెస్టారెంట్ లో శృతి కస్టమర్ల నుంచి ఆర్డర్లు తీసుకుంటూ ఉంటుంది. ఇద్దరు వ్యక్తులు వచ్చి శృతిని టీజ్ చేస్తారు. చాలా బాగుంది.. నువ్వే కావాలి అంటూ తిక్కతిక్కగా మాట్లాడుతారు. దీంతో శృతికి మండిపోతుంది. వాళ్లు సూప్ ఆర్డర్ ఇస్తారు. ఆమె సర్వ్ చేస్తుండగా అందులో ఒకడు ఆమెను తాకబోతాడు. దీంతో సూప్ వాళ్లపై పోస్తుంది. తర్వాత గొడవ పడుతుంది. అప్పుడే రవి, నీతూ అక్కడికి వస్తారు.
ఏం జరిగిందని అడిగితే శృతి జరిగిన విషయం చెబుతుంది. కానీ ఆ కస్టమర్లు మాత్రం శృతి గురించే తప్పుగా చెబుతూ.. రెస్టారెంట్ కు వస్తే ఇలా చేస్తారా అంటూ ఎదురు తిరుగుతారు. ఏదైనా ఉంటే బయట చూసుకునేవాళ్లం కదా అని రవి అనడంతో శృతికి మండుతుంది. నీకు సిగ్గుందా.. నీ భార్యను ఎవడో టీజ్ చేస్తే ఇలా అంటావా.. నీ ప్లేస్ లో బాలు ఉండి ఉంటే ఈపాటికి వాళ్లు కాళ్లు, చేతులు విరిగి పాకుతూ వెళ్లేవారు అని రవిని నానా మాటలు అంటుంది.
నీతూ, శృతి గొడవ.. జాబ్ మానేసిన శృతి
అటు నీతూ కూడా వాళ్లకు సారీ చెప్పమని అడుగుతుంది. నేను వాళ్లకు సారీ చెప్పడమేంటి.. వాళ్లే నాతో తప్పుగా ప్రవర్తించారు అంటూ వాళ్లను మరోసారి చెప్పుతో కొట్టబోతుంది. వాళ్లు బయటకు వెళ్లి నెగటివ్ రివ్యూలు ఇస్తే నా రెస్టారెంట్ పరువు పోతుంది అని నీతూ అంటుంది.
నీకు నీ రెస్టారెంట్ ముఖ్యమేమో.. నాకు నా ఆత్మగౌరవం ముఖ్యం.. వీళ్లను నేనే పోలీసులకు పట్టిస్తాను అని అనడంతో వాళ్లు వెళ్లిపోతారు. ఆ తర్వాత నీతూ తనకు ఏదో చెప్పబోతుంటే అడ్డుపడిన శృతి నువ్వు నన్ను తీసేయాల్సిన అవసరం లేదు.. నేను జాబ్ మానేస్తున్నాను అని చెప్పి వెళ్లిపోతుంది.
మనోజ్‌కు చలి జ్వరం.. రోహిణి సేవలు.. అయినా నిందలు
అటు ఇంట్లో మనోజ్ చలి జ్వరంతో వణుకుతూ పడుకుంటాడు. రోహిణి వచ్చి చూస్తే చాలా జ్వరం ఉంటుంది. దీంతో ఆమె టాబ్లెట్ తెచ్చి వేసి మనోజ్ కు సేవలు చేస్తుంది. జ్వరంలో రోహిణి చేయి పట్టుకొనే పడుకుంటాడు మనోజ్. అయితే కాసేపటి తర్వాత కాస్త జ్వరం తగ్గడంతో తన బుద్ధి చూపిస్తాడు. నువ్వేంటి ఇక్కడ.. నీ సాయం అవసరం లేదు అంటాడు. లేచి బాత్రూమ్ కు వెళ్తుండగా కిందపడబోతే రోహిణి పట్టుకుంటుంది. అయినా సరే ఆమెను వదిలించుకొని మనోజ్ వెళ్తాడు.
మీనా ఫోన్ చేసినా ఎత్తని బాలు.. సత్యం ఫోన్ చేసి..
మరోవైపు రాత్రయినా ఇంటికి రాని బాలుకి మీనా ఫోన్ చేస్తుంది. కానీ అతడు ఫోన్ ఎత్తడు. మీనా పదే పదే చేస్తుంది. అయినా బాలు పట్టించుకోడు. వాడెవడో నన్ను అవమానించడానికి నాలుగు పెగ్గులు వేస్తే అంత రాద్ధాంతం చేస్తావా.. నేను అస్సలు ఫోన్ ఎత్తను అని బాలు అనుకుంటాడు. ఇటు మీనా బాధ పడుతుంది. ఈ ముళ్ల కంపకి ఎవరెన్ని అన్నా భార్య మాత్రం ఒక్క మాట కూడా అనకూడదు అని రుసరుసలాడుతుంది. అప్పుడే సత్యం వచ్చి బాలు గురించి అడిగితే ఇంకా రాలేదని మీనా చెబుతుంది. అసలు వస్తాడో రాడో కనుక్కో.. ఆలస్యమైతే నువ్వు తినేసి పడుకో అని చెబుతాడు.
ఫోన్ చేశావా అని అడిగితే .. కారు నడిపేటప్పుడు ఫోన్ మాట్లాడొద్దని తానే చెప్పానని, అందుకే చేయలేదని అంటుంది. దీంతో సత్యమే ఫోన్ చేసి మీనాకు ఇస్తాడు. నాన్న ఫోన్ చేస్తున్నాడేంటి అనుకొని బాలు లిఫ్ట్ చేస్తాడు. మీనా మాట్లాడటంతో షాక్ తింటాడు. ఫోన్ చేస్తే ఎందుకు తీయడం లేదంటూ మీనా తిడుతుంది. ఈసారి ఇటుక రాయితో కాదు మైలురాయితో కొడతానని వార్నింగ్ ఇస్తుంది. ఆ తర్వాత తనకు ఆలస్యం అవుతుందని సత్యంతో చెబుతాడు బాలు. అదే విషయం మీనాకు చెప్పమంటే నువ్వే చెప్పెయ్ అని చెప్పి పెట్టేస్తాడు.
రోహిణిని లోనికి రానివ్వని ప్రభావతి
మనోజ్ కు రోహిణి సేవలు చేయడం చూసి ప్రభావతి ఆమెను తిడుతుంది. గదిలో నుంచి బయటకు రమ్మని ఏం చేస్తున్నావని అడుగుతుంది. మనోజ్ కు జ్వరం వచ్చిందని చెప్పడంతో ప్రభావతి చాలా కంగారు పడుతుంది. రోహిణిని గదిలోకి వెళ్లొద్దని చెప్పి తాను టాబ్లెట్ తీసుకు రావడానికి పరుగెడుతుంది. తర్వాత మనోజ్ కు సేవలు చేస్తుంది. మనోజ్ మాత్రం తనకు జ్వరం రాలేదని, ఏదో సరదాగా అలా చెప్పానని అనడంతో ప్రభావతి షాక్ తింటుంది.
ఆ తర్వాత మనోజ్ కోసం రోహిణి రాగి జావా కాస్తుంటుంది. అది చూసిన ప్రభావతి అందులో ఏం కలిపావే నంగనాచి అంటూ రోహిణిని ఈడ్చుకొని వెళ్తుంది. ఇంట్లో నుంచి గెంటేయడానికి ప్రయత్నిస్తుంది. మీనా, బాలు అడ్డుకుంటే వాళ్లను కూడా తిడుతుంది. రోహిణి కూడా ఎదురు తిరుగుతుంది. దీంతో ఆమెను ప్రభావతి కొట్టబోతుంది. అక్కడితో గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.
ABOUT THE AUTHORHari Prasad Sహరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More

E-Paper


