గుండె నిండా గుడి గంటలు టుడే ఎపిసోడ్: బాలు, మీనాలకు క్షమాపణ చెప్పిన సత్యం.. వెనక్కి తగ్గని ప్రభావతి.. భార్యకు దూరం

గుండె నిండా గుడి గంటలు సీరియల్ గురువారం (డిసెంబర్ 4) ఎపిసోడ్ లో ప్రభావతి అసలు వెనక్కి తగ్గదు. మీనాకు క్షమాపణ చెప్పదు. దీంతో సత్యమే వాళ్లను క్షమాపణ అడుగుతాడు. భార్యను అసహ్యంతో పూర్తిగా దూరం పెట్టేస్తాడు.

Published on: Dec 4, 2025, 07:40:09 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఈరోజు అంటే 568వ ఎపిసోడ్ లో ప్రభావతి వెనక్కి తగ్గకపోగా.. మరింత రచ్చ చేస్తుంది. కామాక్షి రంగంలోకి దిగినా మాట వినదు. దీంతో ఆమెకు సత్యంతో మరింత దూరం పెరిగిపోతుంది. బాలు, మీనాలకు తాను క్షమాపణ చెప్పిన సత్యం.. ప్రభావతిని అసహ్యించుకోవడం మొదలుపెడతాడు.

గుండె నిండా గుడి గంటలు టుడే ఎపిసోడ్: బాలు, మీనాలకు క్షమాపణ చెప్పిన సత్యం.. వెనక్కి తగ్గని ప్రభావతి.. భార్యకు దూరం
గుండె నిండా గుడి గంటలు టుడే ఎపిసోడ్: బాలు, మీనాలకు క్షమాపణ చెప్పిన సత్యం.. వెనక్కి తగ్గని ప్రభావతి.. భార్యకు దూరం

ప్రభావతి గురించి మీనా ఆవేదన.. మనోజ్‌ను కొట్టబోయిన బాలు

గుండె నిండా గుడి గంటలు సీరియల్ గురువారం (డిసెంబర్ 4) ఎపిసోడ్ ప్రభావతి గురించి మీనా ఆవేదన చెందే సీన్ తో మొదలవుతుంది. అత్తయ్య గదిలో నుంచి రావడం లేదని, ఇంత గొడవ అవుతుందని తాను అనుకోలేదని మీనా అంటుంది. అమ్మ గురించి మరీ అంత ఆందోళన చెందాల్సిన అవసరం లేదని బాలు చెప్పినా వినదు.

దీంతో ఎవరు చెబితే ఆమె బయటకు వస్తుందో వాళ్లనే పిలిపిస్తానని బాలు అంటాడు. ఇద్దరూ కలిసి ప్రభావతిని బయటకు తీసుకురావడానికి వెళ్తారు. అప్పటికే మనోజ్, రోహిణి ఆమెను పిలుస్తున్నా పలకదు. బాలు రాగానే అంతా నీవల్లే అని మనోజ్ పైకి దూసుకెళ్లడంతో బాలు అతన్ని కొట్టబోతాడు.

ఎంట్రీ ఇచ్చిన కామాక్షి.. సత్యంను బుజ్జగించే పని

అదే సమయంలో కామాక్షి ఎంట్రీ ఇస్తుంది. ఆమె పిలిచినా మొదట తలుపు తీయకపోవడంతో ఏమైనా అఘాయిత్యం చేసుకుందేమో అని అనుమానిస్తుంది. అయితే ఆ తర్వాత డోరు తెరిచి కామాక్షిని లోపలికి లాక్కొని మళ్లీ డోరు వేస్తుంది. అందరూ కిందికి వస్తారు.

మీనాక్షి కూడా ప్రభావతిని తీసుకొని సత్యం దగ్గరికి వస్తుంది. అతన్ని బుజ్జగించే ప్రయత్నం చేస్తుంది. ప్రభావతిని కొడుకు కోసం ఏదో తప్పు చేసిందని, క్షమించేయమని అంటుంది. దీంతో బాలు జోక్యం చేసుకొని తప్పు ఆమె చేసి క్షమాపణ అడగకుండా ఎలా ఉంటుందని అంటాడు.

మీనాను క్షమాపణ అడగాలన్న సత్యం.. ప్రభావతి రచ్చ

దీంతో క్షమాపణ అడగాలని ప్రభావతికి మీనాక్షి చెబుతుంది. క్షమించడానికి తాను ఎవరిని.. మీనాను ఆమె క్షమాపణ అడగాలని సత్యం అంటాడు. దీంతో ప్రభావతి రచ్చ చేస్తుంది. ఈ పూలమ్ముకునేదాన్ని నేను క్షమాపణ అడగడం ఏంటి.. చచ్చినా ఆ పని చేయను.. అయినా ఇదంతా బంగారం కోసమే చేశావు కదా.. ఇది తీసుకొని నీ బొంద మీద వేసుకో అంటూ చేతికి ఉన్న బంగారు గాజులను మీనా ముఖాన విసిరి కొడుతుంది ప్రభావతి. ఆమెను నానా మాటలు అనడంతో బాలు తల్లికి వార్నింగ్ ఇస్తాడు. తల్లివని కూడా చూడనంటాడు. అటు సత్యం కూడా ఎదిగిన కొడుకుల ముందు మెడ పట్టి బయటకు గెంటేయకూడదని మౌనంగా ఉన్నానని అంటాడు.

క్షమాపణ చెప్పే ప్రసక్తే లేదన్న ప్రభావతి

గొడవ పెద్దది కావడంతో ప్రభావతిని తీసుకొని కామాక్షి పైన గదిలోకి వెళ్తుంది. తప్పు చేశావు కదా.. క్షమాపణ అడిగితే ఏమవుతుందని అని నచ్చజెప్తుంది. అయినా ప్రభావతి మాత్రం వినదు. మీనాను క్షమాపణ అడిగే ప్రసక్తే లేదంటుంది. అది నాటకాలు ఆడుతోంది.. నా ముందు వినయంగా ఉంటూ.. వెనుక ఇలా విషం చిమ్ముతుంది అంటూ మరోసారి మీనాను నానా మాటలు అంటుంది. దీంతో చేసేది లేక కామాక్షి కూడా మౌనంగా ఉండిపోతుంది.

తల్లి శోభకు ఇంట్లో గొడవ గురించి చెప్పిన శృతి

ఇటు శృతికి తల్లి శోభ ఫోన్ చేస్తుంది. కిట్టీ పార్టీ ఇస్తున్నాను రమ్మంటుంది. అందులో ఏముంటుంది మా ఇంట్లోనే ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఉంది కదా అంటూ ఇంట్లో జరిగిన గొడవ గురించి తల్లికి చెబుతుంది శృతి. దీంతో ఆమె మీ ఇంట్లో ఎప్పుడూ గొడవలు జరుగుతూనే ఉంటాయా.. మీ ఆంటీ, మనోజ్ ఇక మారరా అని అంటుంది. ఇక్కడికి వచ్చేయమని చెప్పినా నువ్వు వినవు కదా అని శోభ అనడంతో ఎంత జరిగినా ఈ ఇంట్లో పాజిటివ్ వైబ్ ఏదో ఉందని శృతి చెబుతుంది.

ఇటు ప్రభావతి చేసిన పనికి సత్యం బాధపడుతూ ఉంటాడు. మీ అమ్మ ఎలాంటిదో చూశారు కదా.. ఇన్నేళ్లూ భరిస్తూ రావడం వల్లే ఆమె ఇలా తయారైందని కొడుకులు, కోడళ్లకు చెబుతూ సత్యం బాధపడతాడు. ఆమె తరఫున బాలు, మీనాలను క్షమాపణ అడుగుతాడు. తప్పు ఒప్పుకోకుండా నీ తల్లి, నా తల్లి మీద నిందలు వేసినప్పుడు ప్రభావతి వ్యక్తిత్వం మీద అసహ్యం వేసిందని మీనాతో సత్యం అంటాడు. ఆమెను పూర్తిగా దూరం పెట్టేస్తాడు. అంతటితో గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.

  • Hari Prasad S
    ABOUT THE AUTHOR
    Hari Prasad S

    హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More