గుండె నిండా గుడి గంటలు టుడే ఎపిసోడ్: రోహిణికి రెండో ప్రెగ్నెన్సీ.. గుట్టు విప్పేసిన మీనా.. ప్రభావతిని నిలదీసిన సత్యం
గుండె నిండా గుడి గంటలు సీరియల్ మంగళవారం (జనవరి 20) ఎపిసోడ్ లో పెద్ద ట్విస్టే వచ్చింది. రోహిణి రెండో ప్రెగ్నెన్సీ గురించి ఇంట్లో వాళ్లందరికీ తెలిసిపోతుంది. దీంతో ప్రభావతిని సత్యం నిలదీస్తాడు.
గుండె నిండా గుడి గంటలు ఈరోజు అంటే 601వ ఎపిసోడ్ లో రోహిణి రెండో ప్రెగ్నెన్సీ గుట్టు విప్పేస్తుంది మీనా. బాలుతోపాటు శృతి, రవి, ప్రభావతి, సత్యంలకు నిజం తెలిసిపోతుంది. దీంతో రోహిణి జీవితంలో పెద్ద ట్విస్టే ఎదురయ్యేలా కనిపిస్తోంది. ఆ తర్వాత ఏం జరిగిందో చూడండి.

చికెన్ మొత్తం తినేసిన ఇంట్లో వాళ్లు
గుండె నిండా గుడి గంటలు సీరియల్ మంగళవారం (జనవరి 20) ఎపిసోడ్ లో బాలు కోసం మీనా వండిన చికెన్ ను ఇంట్లో వాళ్లు లొట్టలేసుకుంటూ తింటారు. ముఖ్యంగా మనోజ్, ప్రభావతి ఫుల్లుగా తినేస్తారు. దీంతో గిన్నె ఖాళీ అయిపోతుంది. బాలేదనుకుంటూనే ప్రభావతి పీకలదాకా తింటుంది. పైగా మీనాను అందరూ పొగుడుతుంటే.. ఆమెకు జీర్ణం కాదు.
మీనా కోసం బాలు హల్వా.. కలిసిపోయిన జంట
ఇటు మీనా కోసం బాలు హల్వా తీసుకొని ఇంటికి వస్తాడు. ఇద్దరూ ఒకరినొకరు చూసుకోగానే మాట్లాడుకోవాలా వద్దా అంటూ సందేహంలో పడతారు. చివరికి మీనాయే బాలు దగ్గరికి వెళ్తుంది. నీకోసం హల్వా తీసుకొచ్చాను తిను అని ఇస్తాడు. మా అమ్మ లేనిపోనివి చెప్పడం వల్లే అలా చేశాను.. ఇక నుంచి ఆమె మాటలు వినను అని అంటాడు.
అదంతా పక్కనుంచి వింటూనే ఉన్న ప్రభావతి.. తనపై చెబుతున్నందుకు మండిపడుతుంది. తర్వాత బాలు కోసం మీనా ప్రత్యేకంగా తీసిపెట్టిన చికెన్ తీసి వడ్డిస్తుంది. మీనా కూడా హల్వా తింటుంది. ఇద్దరూ కలిసిపోవడం చూసి ప్రభావతి మరింత కుళ్లకుంటుంది.
సుమతి హాస్పిటల్‌కు మీనా
ఇటు బాలు మళ్లీ మారిపోయిన విషయం తన స్నేహితులతో చెప్పి మీనా మురిసిపోతుంది. అప్పుడే ఆమెకు సుమతి కాల్ చేసి తాను పనిచేసే హాస్పిటల్ కు రమ్మంటుంది. ఎందుకు అని అడిగితే పూలు కావాలని చెబుతుంది. దీంతో మీనా అక్కడికి వెళ్తుంది. ఇక నుంచి రెగ్యులర్ గా పూజ చేస్తామని, పూలు కావాలని అంటుంది. తనకు జాబ్ వచ్చింది కాబట్టి ఇక అమ్మను పూల కొట్టు తీసేయాలని చెబుతున్నానని మీనాతో సుమతి అంటుంది.
హాస్పిటల్లో రోహిణి.. మీనాలో అనుమానం
అదే సమయంలో రోహిణి అక్కడికి వస్తుంది. ఆమెను చూసిన ఇద్దరూ షాక్ తింటారు. కానీ గతంలో రోహిణి ఇంట్లో చేసిన గొడవ గుర్తు తెచ్చుకొని మనకు ఎందుకులే అని అనుకుంటుంది. అయినా సుమతి మాత్రం రిసెప్షనిస్ట్ దగ్గరికి వెళ్లి రోహిణి గురించి ఆరా తీస్తుంది. ఆమె రెండో ప్రెగ్నెన్సీ గురించి తెలుసుకోవడానికి వచ్చిందని తెలియడంతో అదే విషయం మీనాకు చెబుతుంది. దీంతో ఆమె షాక్ తింటుంది. అయినా ఈ విషయం ఇక్కడే వదిలేయాలని సుమతికి చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతుంది.
ఇంటికి వెళ్తూ కూడా అదే ఆలోచిస్తూ బండి నడుపుతుంది. ఇంట్లో వాళ్లకు చెప్పాలా వద్దా.. రోహిణి దాచే నిజం ఇదేనా అంటూ ఏవేవో ఆలోచనలు చేస్తుంది. ఇంటికి వెళ్లిన తర్వాత విషయాన్ని బాలు, శృతిలకు చెబుతుంది. బాలు వెళ్లి సత్యానికి చెబితే.. అతడు ప్రభావతిని నిలదీస్తాడు. ఈ విషయం నీకు ముందే తెలుసు కదా అని అడగడంతో ఆమె నివ్వెరపోతుంది. అక్కడితో గుండె నిండా గుడి గంటలు ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.
ABOUT THE AUTHORHari Prasad Sహరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More

E-Paper


