గుండె నిండా గుడి గంటలు టుడే ఎపిసోడ్: బాలు చెంప పగలగొట్టిన సత్యం.. పండుగ రోజే ఇంట్లో చిచ్చు పెట్టిన శృతి తల్లి

గుండె నిండా గుడి గంటలు సీరియల్ బుధవారం (అక్టోబర్ 22) ఎపిసోడ్ ఆసక్తికరంగా సాగింది. దినేష్ బారి నుంచి బాలు, మీనా సురక్షితంగా బయటపడటం, పండుగ రోజే శృతి తల్లి శోభ చిచ్చు పెట్టడం, బాలుని సత్యం చెంపదెబ్బ కొట్టడంలాంటి సీన్లతో సాగిపోయింది.

Published on: Oct 22, 2025, 07:14:28 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

గుండె నిండా గుడి గంటలు ఈరోజు అంటే 537వ ఎపిసోడ్ లో మీనాను బాలు.. బాలుని మీనా కాపాడటం చూడొచ్చు. అంతేకాదు ఇద్దరూ కలిసి దినేష్ ను పోలీసులకు అప్పగిస్తారు. అయితే ఆ తర్వాత ఇంట్లో శృతి తల్లి శోభ ఇంట్లో చిచ్చు పెడుతుంది. దీంతో బాలుపై సత్యం చేయి చేసుకునే పరిస్థితి తలెత్తుతుంది.

గుండె నిండా గుడి గంటలు టుడే ఎపిసోడ్: బాలు చెంప పగలగొట్టిన సత్యం.. పండుగ రోజే ఇంట్లో చిచ్చు పెట్టిన శృతి తల్లి
గుండె నిండా గుడి గంటలు టుడే ఎపిసోడ్: బాలు చెంప పగలగొట్టిన సత్యం.. పండుగ రోజే ఇంట్లో చిచ్చు పెట్టిన శృతి తల్లి

మీనా పారేసిన పూలను వెతుక్కుంటూ వెళ్లిన బాలు..

గుండె నిండా గుడి గంటలు సీరియల్ బుధవారం (అక్టోబర్ 22) ఎపిసోడ్ మీనా కోసం బాలు వెతికే సీన్ తో మొదలవుతుంది. విద్య ఇంటి ముందు మీనా పారేసిన ఇంగ్లిష్ పూలను బాలు చూస్తాడు. తనను ఏ దారిలో తీసుకెళ్లారో వాటి ద్వారా చెప్పేలా మీనా తెలివిగా ఒక్కో పువ్వును దారిలో జారవిడుస్తూ వెళ్తుంది.

అటు నువ్వు చెప్పినట్లే ఆ అమ్మాయిని తీసుకొచ్చి కట్టేశామని రౌడీలు దినేష్ కు చెబుతారు. అయితే అక్కడ మీనా ఉండటం చూసి దినేష్ షాక్ తింటాడు. అయితే తనను జైలుకు పంపించిన బాలుపై ప్రతీకారం తీర్చుకోవడానికి ఇదీ పనికొస్తుందని అనుకుంటాడు.

మనోజ్‌కు అబద్ధం చెప్పిన రోహిణి..

ఇటు దినేష్ కు ఇవ్వడానికి మరో రూ.50 వేలు కావడంతో ఇంటికి వెళ్లి మనోజ్ ను డబ్బులు అడుగుతుంది రోహిణి. విద్య తండ్రికి సర్జరీ అవసరమని అబద్ధం చెబుతుంది. అయితే మనోజ్ మాత్రం తన దగ్గర డబ్బులు లేవని అంటాడు. దీంతో అతన్ని రోహిణి తిడుతుంది.

అప్పుడే దినేష్ ఆమెకు ఫోన్ చేస్తాడు. మనోజ్ ఉండటంతో ఆమె ఫోన్ లిఫ్ట్ చేయదు. దీంతో అతడు వెంటనే డబ్బు తీసుకురాకపోతే ఇంటికి వస్తానని బెదిరింపు మెసేజ్ పంపిస్తాడు. దీంతో రోహిణి.. విద్య ఇచ్చిన గొలుసు ఇచ్చి మిగిలిన డబ్బుకు కాస్త సమయం అడుగుదామని అతని దగ్గరికి వెళ్తుంది.

దినేష్‌కు వార్నింగ్ ఇచ్చిన మీనా..

అటు మీనా దగ్గరికి వెళ్లిన దినేష్ తన నాటకాల కోసం ఉపయోగించే గద, కిరీటం పెట్టుకుంటాడు. ఎవడ్రా నువ్వు అని మీనా అడిగితే.. ఈ రాజ్యానికి రాజుని అని అంటాడు. వెంటనే తనను వదిలేయాలని, లేదంటే తన భర్త వచ్చి మిమ్మల్ని చితగ్గొడతాడని వార్నింగ్ ఇస్తుంది. అంతలో మీనా చూపించిన పూల దారిలో బాలు అక్కడికి వస్తాడు. అది చూసిన దినేష్ మీనా అరవకుండా నోటికి ప్లాస్టర్ వేసి ఆమె కనిపించకుండా దాచేస్తాడు.

రౌడీలను చితకబాదిన బాలు, మీనా

మీనాను బంధించిన ఇంట్లోకి బాలు వస్తాడు. అక్కడికి రాగానే పోలీసులకు ఫోన్ చేసి సమాచారం ఇస్తాడు. ఆ తర్వాత దినేష్, రౌడీలు అతన్ని చుట్టుముడతారు. దినేష్ ను చూడగానే నువ్వా అంటూ అతని కాలర్ పట్టుకుంటాడు బాలు. నా భార్య ఎక్కడ అని అడిగితే.. రూ.లక్ష ఇచ్చి నీ భార్యను తీసుకెళ్లమని దినేష్ అంటాడు. దీంతో బాలు వాళ్లందరినీ చితగ్గొడతాడు.

యితే ఓ రౌడీ బాలు తలపై వెనుక నుంచి గదతో కొట్టడంతో అతడు స్పృహ కోల్పోతాడు. దీంతో అతన్ని కూడా కట్టేస్తారు. అప్పుడే మీనా తన కట్లు విప్పుకొని తన ఉగ్రరూపం చూపిస్తుంది. దినేష్ సహా మిగిలిన వాళ్లందరినీ చితకబాదుతుంది.

మీనాను తెగ పొగిడిన పోలీసులు, బాలు

దినేష్ ను కింద పడేసి పక్కనే ఉన్న త్రిశూలంతో అతనిపై దాడి చేయబోతుండగా.. పోలీసులు వస్తారు. అక్కడ సీన్ రివర్స్ కావడంతో వాళ్లు షాక్ తింటారు. నీ భార్యను కిడ్నాప్ చేశారన్నావ్.. ఇక్కడ చూస్తే ఆమెనే నిన్ను కాపాడుతోంది అని ఎస్సై అడుగుతాడు. ఈ వెధవలు తనను తలపై కొట్టడంతో స్పృహ కోల్పోయానని, అప్పుడే మీనా ఇలా చేసిందని చెబుతాడు. అదంతా అక్కడికి వచ్చిన రోహిణి చూస్తుంది. దినేష్ అమ్మాయిలను బ్లాక్ మెయిల్ చేసి డబ్బు గుంజుతాడని పోలీసులకు బాలు చెప్పడం విన్న రోహిణి వీళ్లకు నిజం తెలిసినట్లుందని ఏడుస్తూ అక్కడి నుంచి వెళ్లిపోతుంది.

ఆ తర్వాత ఎస్సై కూడా మీనా ధైర్యాన్ని పొగుడుతాడు. పోలీసులు వాళ్లను తీసుకెళ్లిన తర్వాత సత్యభామలా ఉగ్రరూపం చూపించావని బాలు కూడా మీనాను పొగుడుతాడు. ఈ విషయం మా అమ్మకు చెబితే ఇక ఎప్పుడూ నీ జోలికి రాదని అంటాడు. కానీ మీనా మాత్రం వద్దని అంటుంది. అటు రోహిణి నేరుగా విద్య దగ్గరికి వెళ్లి బాలు, మీనాలకు తన గురించి నిజం తెలిసిపోయిందని, ఇక తన రెండో పెళ్లి కూడా పెటాకులైనట్లే అని ఏడుస్తూనే ఉంటుంది.

పండుగ రోజే చిచ్చు పెట్టిన శోభ

అటు పండుగ రోజే సత్యం ఇంట్లో శృతి తల్లి శోభ చిచ్చు పెడుతుంది. ఇంట్లో గది కోసం గొడవలు జరుగుతున్నాయని తెలిసి వచ్చానని, అప్పట్లో మా ఆయన లోన్ ఇప్పించకపోతే మీరు ఈ మాత్రం ఇల్లు కూడా కట్టుకోలేకపోయేవారని అందరి ముందే అంటుంది. దీంతో బాలు ఆవేశం కట్టలు తెంచుకుంటుంది. ఏం మాట్లాడుతున్నారు.. ముందు బయటకు వెళ్లండి అంటూ ఆమె మీదికి వెళ్తాడు. దీంతో సత్యం బాలు చెంప పగలగొడతాడు. అక్కడితో గుండె నిండా గుడి గంటలు ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.

  • Hari Prasad S
    ABOUT THE AUTHOR
    Hari Prasad S

    హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More