సినిమా బాగుంది కానీ.. అందులోని పాలిటిక్స్ నచ్చలేదు: హృతిక్ రోషన్ కామెంట్స్.. మండి పడుతున్న ఫ్యాన్స్
బాలీవుడ్ నటుడు హృతిక్ రోషన్ ఓ అనవసర వివాదంలో చిక్కుకున్నాడు. రణ్‌వీర్ సింగ్ నటించిన దురంధర్ మూవీ బాగున్నా.. అందులోని పాలిటిక్స్ నచ్చలేదని అతడు అనడంపై పలువురు ఫ్యాన్స్ మండిపడుతున్నారు. ఇంతకీ ఏం జరిగిందో చూడండి.
ఆదిత్య ధర్ దర్శకత్వంలో రణ్‌వీర్ సింగ్ నటించిన స్పై థ్రిల్లర్ 'ధురంధర్' బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతోంది. ఇప్పటికే అక్షయ్ కుమార్, సిద్ధార్థ్ ఆనంద్ వంటి ప్రముఖులు ఈ సినిమాను మెచ్చుకోగా, తాజాగా హృతిక్ రోషన్ కూడా ఈ జాబితాలో చేరాడు. అయితే అతడు కేవలం పొగడ్తలతో సరిపెట్టకుండా, సినిమాలోని రాజకీయ అంశాలపై తన భిన్నాభిప్రాయాన్ని కూడా వ్యక్తం చేశాడు. ఇదే పలువురు అభిమానుల ఆగ్రహానికి కారణమైంది.

హృతిక్ రోషన్ దురంధర్ రివ్యూ ఇలా..
ప్రస్తుతం బాలీవుడ్‌లో సంచలనం రేపుతున్న సినిమా దురంధర్. ఇది బాక్సాఫీస్ దుమ్ము దులుపుతోంది. సెలబ్రిటీలు కూడా ఈ సినిమాపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. బుధవారం (డిసెంబర్ 10)నాడు హృతిక్ రోషన్ కూడా తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో 'ధురంధర్' పోస్టర్‌ను షేర్ చేస్తూ ఒక నోట్ రాశాడు.
"నేను సినిమాను ప్రేమిస్తాను. కథలో పూర్తిగా లీనమైపోయేవాళ్లను నేను ప్రేమిస్తాను. కథే మనల్ని కంట్రోల్ చేసేలా, మనల్ని కుదిపేసేలా ఉండాలి. 'ధురంధర్' దానికి ఒక ఉదాహరణ. స్టోరీటెల్లింగ్ నాకు బాగా నచ్చింది. ఇదీ సినిమా అంటే" అని హృతిక్ రాసుకొచ్చాడు.
"నేను ఈ సినిమాలోని రాజకీయాలతో విభేదించవచ్చు. ప్రపంచ పౌరులుగా ఫిల్మ్ మేకర్లకు ఉండాల్సిన బాధ్యతల గురించి వాదించవచ్చు. ఏది ఏమైనప్పటికీ, ఒక సినిమా విద్యార్థిగా నేను ఈ సినిమాను ఎంతగా ప్రేమించానో, దీని నుంచి ఎంత నేర్చుకున్నానో విస్మరించలేను. అమేజింగ్" అని తన అభిప్రాయాన్ని కుండబద్దలు కొట్టినట్లు చెప్పాడు.
అయితే ఇందులో తప్పు ఏముంది అంటూ అభిమానులు అతన్ని ప్రశ్నిస్తున్నారు. పాకిస్థాన్ ఉగ్రవాదుల దారుణమైన దాడులను చూపించారు.. వాళ్లకు మీరు మద్దతిస్తున్నారా అని కొందరు హృతిక్ ను ప్రశ్నించగా.. ఓ రాజకీయ పార్టీని పొగిడినట్లు అతనికి అనిపించి ఉండొచ్చని మరికొందరు అంటున్నారు.
సెలబ్రిటీల ప్రశంసలు
రణ్‌వీర్ సింగ్, అక్షయ్ ఖన్నా నటించిన దురంధర్ సినిమాపై ఇప్పటికే పలువురు సెలబ్రిటీలు ప్రశంసలు కురిపించారు. అక్షయ్ కుమార్ స్పందిస్తూ.. "సినిమా చూసి మైండ్ బ్లాక్ అయ్యింది. గ్రిప్పింగ్ స్టోరీ.. ఆదిత్య ధర్ అదరగొట్టేశాడు. మన కథలను ఇలా బలంగా చెప్పాల్సిన అవసరం ఉంది" అని ట్వీట్ చేశాడు.
'వార్' దర్శకుడు సిద్ధార్థ్ ఆనంద్ స్పందిస్తూ.. ఈ సినిమాను ఒక 'నషా' (మత్తు) అని వర్ణించాడు. మరో డైరెక్టర్ మధుర్ భండార్కర్ స్పందిస్తూ.. అక్షయ్ ఖన్నా నటన ఒక మాస్టర్ క్లాస్ అని, రణ్‌వీర్ సింగ్ పవర్ ప్యాక్డ్ పర్ఫార్మెన్స్ ఇచ్చారని కొనియాడాడు.
దురంధర్ సినిమా గురించి..
పాకిస్థాన్ నేపథ్యంలో సాగే స్పై థ్రిల్లర్ ఇది. లియారీలోని ఉగ్రవాద నెట్‌వర్క్‌లలోకి చొరబడే భారతీయ గూఢచారిగా రణ్‌వీర్ సింగ్ నటించాడు. ఇందులో సంజయ్ దత్, అర్జున్ రాంపాల్, ఆర్. మాధవన్ కీలక పాత్రల్లో నటించారు. బాక్సాఫీస్ వద్ద ఈ మూవీ దూసుకెళ్తోంది. Sacnilk రిపోర్టు ప్రకారం ఇప్పటివరకు ఈ మూవీ రూ. 177.74 కోట్లు వసూలు చేసింది.
ABOUT THE AUTHORHari Prasad Sహరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More

E-Paper


