వరుస పెట్టి గుళ్లు తిరుగుతున్న రిషబ్ శెట్టి.. కాంతార ఛాప్టర్ 1 సక్సెస్‌తో మొక్కులు తీర్చుకుంటూ..
కాంతార ఛాప్టర్ 1 మూవీ ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ దగ్గర రికార్డులు తిరగరాస్తోంది. దీంతో ఆ మూవీ స్టార్ రిషబ్ శెట్టి కర్ణాటకలోని ఆలయాలను వరుసగా సందర్శిస్తున్నాడు. తాజాగా హోంబలే ఫిల్మ్స్ మైసూరులో రిషబ్ ఆలయాలకు వెళ్లిన వీడియోను షేర్ చేసింది.
'కాంతార ఛాప్టర్ 1' సినిమా దేశవ్యాప్తంగా రూ.500 కోట్లు కలెక్ట్ చేసే దిశగా దూసుకెళ్తున్న వేళ.. హీరో, దర్శకుడు రిషబ్ శెట్టి కృతజ్ఞతా భావంతో కర్ణాటకలోని పలు దేవాలయాలను దర్శించి ప్రత్యేక పూజలు చేస్తున్నాడు. ఈ విజయం తనకెంత ముఖ్యమో తెలియజేస్తూ హోంబలే ఫిలింస్ ఈ వీడియోను షేర్ చేసింది.

కాంతార ఛాప్టర్ 1 బ్లాక్‌బస్టర్
'కాంతార ఛాప్టర్ 1' సినిమా సృష్టించిన సునామీ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. దేశవ్యాప్తంగా రికార్డులను తిరగరాస్తూ ఈ చిత్రం రూ.500 కోట్ల క్లబ్‌లో చేరేందుకు సిద్ధమవుతోంది. ఈ అద్భుతమైన విజయాన్ని ఆస్వాదిస్తున్న హీరో, దర్శకుడు రిషబ్ శెట్టి తన ఆనందాన్ని, కృతజ్ఞతను దైవానికి తెలియజేశాడు. అతడు ఇటీవల కర్ణాటకలోని పలు ప్రముఖ దేవాలయాలను దర్శించి ప్రత్యేక పూజలు చేశాడు.
ఈ మేరకు నిర్మాణ సంస్థ హోంబలే ఫిలింస్ తమ అధికారిక ఎక్స్ అకౌంట్ ద్వారా గురువారం సాయంత్రం ఒక వీడియోను పంచుకుంది. ఆ వీడియోలో.. రిషబ్ శెట్టి దేవాలయాన్ని సందర్శించగా, ఆలయ నిర్వాహకులు, అభిమానులు అతనికి ఘనంగా స్వాగతం పలికారు. పూలమాలలతో సత్కరించారు. రిషబ్ నడుస్తున్నప్పుడు తన చుట్టూ ఉన్న అభిమానులకు చేతులెత్తి నమస్కరిస్తూ, పలుమార్లు తలవంచి కృతజ్ఞతలు తెలిపాడు.
ఆ తర్వాత అతడు ప్రత్యేక పూజలు నిర్వహించాడు. అర్చకులతో మాట్లాడాడు. ఆలయ మర్యాద ప్రకారం అర్చకులు అతనికి శాలువా కప్పి సత్కరించారు. మరొక దేవాలయంలో కూడా రిషబ్ శెట్టి అదే విధమైన భక్తిని ప్రదర్శిస్తూ పూజలు చేశాడు. అక్కడ అర్చకులు అతనితో మాట్లాడగా, సంతోషంతో నవ్వుతూ కనిపించాడు. రిషబ్ తన అభిమానులకు నవ్వుతూ, చేతులెత్తి నమస్కరించి, షేక్‌హ్యాండ్ ఇస్తూ వీడియోను ముగించాడు.
రిషబ్ శెట్టి ఈ ఆలయ సందర్శన కోసం సంప్రదాయబద్ధంగా తెల్లటి షర్ట్, పంచె ధరించి, మెడలో కండువా వేసుకున్నాడు. ఈ వీడియోను షేర్ చేస్తూ హోంబలే ఫిలింస్ ఇలా రాసింది: "బ్లాక్‌బస్టర్ కాంతార అద్భుతమైన విజయం సాధించినందుకు కృతజ్ఞతాపూర్వక హృదయాలతో రిషబ్ శెట్టి.. చాముండేశ్వరి దేవాలయం, శ్రీకంఠేశ్వర దేవాలయాన్ని దర్శించి, పూజలు, మొక్కుబడులు చెల్లించాడు" అని రాశారు.
'కాంతార: చాప్టర్ 1' వివరాలు
'కాంతార: చాప్టర్ 1' దేశవ్యాప్తంగా థియేటర్లలో భారీగా వసూళ్లను సాధిస్తూనే ఉంది. అయితే, రెండో వారం నాటికి వసూళ్లలో కొంత తగ్గుదల కనిపించింది. Sacnilk.com అందించిన సమాచారం ప్రకారం, ఈ చిత్రం ఇప్పటివరకు ఇండియాలో రూ.485.40 కోట్ల నెట్ కలెక్షన్స్ సాధించింది.
కథ విషయానికి వస్తే.. 'కాంతార: చాప్టర్ 1' అనేది తులునాడు ప్రాంతంలో దైవారాధన మూలాల చుట్టూ తిరుగుతుంది. ఈ ఆరాధన చరిత్ర నాలుగో శతాబ్దానికి చెందిన కదంబ రాజవంశం వరకు విస్తరించి ఉంటుంది. రిషబ్ శెట్టి ఇందులో కాంతార అడవికి, అక్కడి గిరిజన తెగలకు రక్షకుడైన 'బెర్మే' పాత్రను పోషించారు. రుక్మిణి వసంత్, గుల్షన్ దేవయ్య, జయరామ్ వంటి నటీనటులు కీలక పాత్రల్లో నటించారు.
దైవాల నుంచి అధికారాన్ని లాక్కోవాలని ప్రయత్నించే ఒక రాజకుటుంబం, దాన్ని ప్రతిఘటించే గిరిజనుల మధ్య జరిగే సంఘర్షణే ఈ సినిమా కథాంశం. ఈ చిత్రంలో రాకేశ్ పూజారి, హరిప్రశాంత్, దీపక్ రాయ్ పనాజే, షనీల్ గౌతమ్, నవీన్ బోండెల్ వంటి సహనటులు కూడా ముఖ్యపాత్రల్లో కనిపించారు. విజయ్ కిరగందూర్, చలువే గౌడ హోంబలే ఫిలింస్ బ్యానర్‌పై నిర్మించిన ఈ చిత్రం దేశవ్యాప్తంగా వివిధ భాషల్లో విడుదలైంది.
ABOUT THE AUTHORHari Prasad Sహరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More

E-Paper


