...
...
Next Story

కార్తీక దీపం 2 టుడే ఎపిసోడ్: దొరకని సుమిత్ర ఆచూకీ-ఏడ్చేసిన దశరథ-కింద పడిపోయిన శివన్నారాయణ-నిజం తెలియాల్సిందేనన్న గురువు

కార్తీక దీపం 2 టుడే అక్టోబర్ 16వ తేదీ ఎపిసోడ్ లో సుమిత్ర ఆచూకీ దొరకదు. కార్తీక్, దశరథ, దీప వెతుకుతుంటారు. ఇంతలో శివన్నారాయణ కింద పడిపోయాడని కార్తీక్ కు జ్యోత్స్న కాల్ చేస్తుంది. దశరథ, కాంచన ఏడ్చేస్తారు. ముందు ఉన్నవన్నీ చెడ్డ రోజులే అని దీపకు చెప్తాడు గురువు.

Published on: Oct 16, 2025, 06:54:01 IST
Advertisement

కార్తీక దీపం 2 టుడే అక్టోబర్ 16వ తేదీ ఎపిసోడ్ లో సుమిత్రత్త కనిపిస్తే ఫోన్ చేయమని శ్రీధర్ కు చెప్తాడు కార్తీక్. సుమిత్ర కనిపించడం లేదంటా. కార్తీక్, దశరథ బావ సుమిత్ర కోసం వెతుకుతున్నారంటా అని కాంచనకు చెప్తాడు శ్రీధర్. నేను కూడా వెళ్లి వెతుకుతానని శ్రీధర్ వెళ్తాడు. అసలు అంత పెద్ద గొడవ ఏం జరిగిందని కాంచన కంగారు పడుతుంది.

ఏడ్చేసిన దశరథ

కార్తీక దీపం 2 టుడే ఎపిసోడ్ (jiohotstar)
కార్తీక దీపం 2 టుడే ఎపిసోడ్ (jiohotstar)

కార్లో వెళ్లి కార్తీక్, దశరథ.. నడుచుకుంటూ వెళ్లి దీప సుమిత్ర కోసం వెతుకుతారు. నట్టింట్లోనే మరోసారి చంపేసిందని సుమిత్ర గురించి అన్న మాటలను గుర్తు చేసుకుంటూ కన్నీళ్లు పెట్టుకుంటాడు దశరథ. తను ఇంట్లో నుంచి వెళ్లిపోవడానికి కారణం నేనే. నాకు ఎందుకింత మొండి పట్టుదల. తను నాతో మాట్లాడుతున్నప్పుడు నేనూ మాట్లాడొచ్చు కదా. ఓ శత్రువును చూసినట్లు చూశా. కలిసి భోజనం చేసి ఎన్ని రోజులైందో గుర్తు లేదు. మాట పడ్డ మనిషి ఎంతలా నలిగిపోయి ఉంటుందోనని కార్తీక్ కు చెప్తూ ఏడ్చేస్తాడు దశరథ.

అత్తకు ఏం కాదు

మనసులో బాధ పోయేంత వరకూ మనస్ఫూర్తిగా ఏడ్చేయ్ మామయ్య అని కార్తీక్ అంటాడు. నీ కన్నీళ్లు చూడలేకపోతున్నానని కార్తీక్ కూడా బాధ పడతాడు. నిన్ను వదిలేసి అత్త ఎక్కడికి వెళ్లిపోతుంది? అత్త కూడా నిన్ను తలుచుకుని ఇలాగే బాధపడుతుంటుంది. అత్తకు ఏం కాదు మామయ్య అని కార్తీక్ చెప్తాడు. తాత కింద పడిపోయాడు అర్జెంట్ గా ఇంటికి రమ్మని కార్తీక్ కు కాల్ చేస్తుంది జ్యోత్స్న.

గుండెకు ప్రమాదం

మాటతో పోయేదాన్ని మనిషిని పోగొట్టుకునే వరకూ తెచ్చుకున్నానని దశరథ బాధపడతాడు. పారిజాతం కూడా ఎమోషనల్ అవుతుంది. నా వల్లే నాన్నకు ఈ పరిస్థితి వచ్చిందని దశరథ ఏడ్చేస్తాడు. కోపం, ఆవేశం మనిషి జీవితాన్ని ఎంతలా కుదిపేస్తాయో కళ్లారా చూశానని అంటాడు దశరథ. నువ్వు, డాడీ వెళ్లిపోయిన తర్వాత దీప వెళ్లిపోయింది బావ అని జ్యోత్స్న చెప్తుంది. కనిపించకుండా పోయిన కన్నతల్లి కోసం ఎక్కడ వెతుకుతుందో ఏమిటో అని దీప గురించి అనుకుంటాడు కార్తీక్.

అమ్మవారికి మొర

ఒక తల్లిని పురిట్లోనే దూరం చేశావు. మరో తల్లిని చిన్నప్పుడే తీసుకెళ్లావు. సుమిత్ర, దశరథలే అమ్మానాన్నలు అని తెలిసేలా చేసి ఆశలు పెంచావు. నేను అడిగానా? కష్టాలు, కన్నీళ్లు మోసుకునే తిరిగా. కన్నవాళ్లతో లేకపోయినా వాళ్లు బాగుంటే చాలు అనుకున్నా. కానీ అది కూడా జరగడం లేదు. అమ్మ కనిపించకుండా పోవడానికి కారణం ఏంటీ? అని అమ్మవారి ముందు మొర పెట్టుకుంటుంది దీప. అప్పుడే గురువు గారు అక్కడికి వస్తారు.

చెడ్డ రోజులే

స్కంధ ఆశ్రమానికి వెళ్తుంటే అనుకోకుండా కనిపించావు అందుకే ఆగా. ఎలా ఉన్నావో కళ్లు చూస్తేనే అర్థమవుతోంది. ఏమైంది చెప్పమ్మా అని గురువు అడుగుతాడు. చెప్పుకోలేని కష్టం వచ్చిందని దీప అంటుంది. నువ్వు చేయని తప్పుకు నింద పడటమే కాదు ఎవరో చేసిన తప్పుకు నింద పడుతున్నావు. నీ రక్త పాశం నిన్ను వదిలి పెట్టినా నువ్వు దాన్ని వదిలిపెట్టవు. దొరుకుతుందమ్మా. జాగ్రత్తగా వెళ్లు. కానీ ముందు ఉన్నవన్నీ చెడ్డ రోజులే. కష్ట కాలమే. అన్నిటికీ సిద్ధంగా ఉండాలి.

నీ యోగం మారబోతుంది. నువ్వు ఏదైతే తెలియకూడదు అనుకుంటున్నావో అది అందరికీ తెలిసే రోజు వచ్చింది. దైవం నీకు సాయంగా ఉంటుంది. జరగబోయే కల్లోలానికి నీవే ప్రత్యక్ష సాక్షివి. నీవే ప్రశ్నవి, నీవే సమాధానివి. వెతికేది నీకు మాత్రమే దొరుకుతుందని చెప్పి గురువు వెళ్లిపోతాడు. అంటే అమ్మ దొరుకుతుందనే కదా అని వెతికేందుకు వెళ్తుంది దీప.

నాన్నకు ఏం చెప్పాలి?

శివన్నారాయణను అలా చూసి కాంచన బాధపడుతుంది. ఇంతకు మించిన అరిష్టం ఏం జరగాలి అన్నయ్య. ఇంటి పెద్ద స్పృహ‌లో లేడు. ఇంటి కోడలు ఎక్కడుందో తెలియాలి. ఇప్పుడు ఎవరి కోసం ఏడవాలి. వదిన ఆచూకీ దొరకలేదు. నాన్న కళ్లు తెరిస్తే సుమిత్ర వచ్చిందా అని అడుగుతాడు. ఏం చెప్పాలని కాంచన అంటుంది. కుటుంబాన్ని నిలబెట్టాల్సిన నేనే ఇలా చేశానని దశరథ ఫీల్ అవుతాడు.

నీ లాంటి వాళ్లు మాటలంటే బాధగా ఉంటుంది బావ. ఇన్నేళ్ల జీవితంలో తాళి తీయడం తప్ప సుమిత్ర ఏ తప్పూ చేయలేదు. అదే ఆవిడ జీవితానికి శాపమైంది. అర్థం చేసుకోవాల్సిన నువ్వు కూడా దూరం పెట్టేసరికి తాను తట్టుకోలేకపోయిందని దశరథతో శ్రీధర్ అంటాడు. అత్త, మామయ్య ఆలోచించి మాట్లాడితే సమస్యే ఉండేది కాదని కార్తీక్ అంటాడు. మీ అమ్మ నీ కళ్ల ముందే గేటు దాటి పోతుంటే ఆపకుండా తప్పు చేసింది నువ్వు అని జ్యోత్స్నతో అంటుంది కాంచన.

కళ్లు తెరిచిన శివన్నారాయణ

నా తల్లి బతికి ఉంటే కోడలిని ఇలా పోనిచ్చదా? మనవరాలిని ఇలా పెంచేదా? అని పారిజాతంపై ఫైర్ అవుతుంది కాంచన. అప్పుడే కళ్ల జోడు శుభ్రం చేసుకుంటున్నా. చూశా కానీ ఎవరూ కనిపించలేదు. నా భర్తను ఇలా చూడటం నాకూ అంతే బాధ అని పారు ఏడుస్తుంది. అప్పుడే శివన్నారాయణ కళ్లు తెరుస్తాడు. సుమిత్ర ఏది అని అడుగుతాడు. మమ్మీ కనిపించలేదని జ్యో చెప్పడంతో ఈ రోజు కార్తీక దీపం 2 సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.

 
ABOUT THE AUTHOR
Chandu Shanigarapu

చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe