Kushboo Udayanidhi: ఇంత చీప్ గా మాట్లాడతారా? వెంటనే త్రిషకు బహిరంగ క్షమాపణ చెప్పాల్సిందే: ఉదయనిధిపై ఖుష్బూ ఫైర్
Kushboo Udayanidhi: హీరోయిన్ త్రిషను ఉద్దేశించి తమిళనాడు మాజీ డిప్యూటీ సీఎం, నటుడు ఉదయనిధి స్టాలిన్ చేసిన డబుల్ మీనింగ్ వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఈ వ్యాఖ్యలపై ప్రముఖ నటి, రాజకీయ నాయకురాలు ఖుష్బూ సుందర్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. త్రిషకు పబ్లిక్ గా సారీ చెప్పాలని డిమాండ్ చేశారు.
Kushboo Udayanidhi: తంజావూరులో జరిగిన ఒక బహిరంగ సభలో తమిళనాడు మాజీ డిప్యూటీ సీఎం, నటుడు ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలు దక్షిణాది సినీ, రాజకీయ వర్గాల్లో తీవ్ర సంచలనం సృష్టిస్తున్నాయి. తమిళనాడు ముఖ్యమంత్రి, నటుడు విజయ్‌ను లక్ష్యంగా చేసుకుని మాట్లాడుతూ.. నటి త్రిష కృష్ణన్ పేరును ప్రస్తావిస్తూ ఉదయనిధి చేసిన "డబుల్ మీనింగ్" వ్యాఖ్యలపై నెటిజన్లు, పలువురు ప్రముఖులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఖుష్బూ ఫైర్
ఈ ఘటనపై ప్రముఖ నటి, రాజకీయ నాయకురాలు ఖుష్బూ సుందర్ (Khushbu Sundar) సోషల్ మీడియా వేదికగా అత్యంత ఘాటుగా స్పందించారు. ఉదయనిధి ప్రసంగాన్ని 'చీప్, దిగజారిన రాజకీయ సంస్కృతి'గా అభివర్ణించారు. తన సోషల్ మీడియా ఖాతాలో మహిళా పరాశక్తిగా ఉన్న దేవుని ఫోటోను షేర్ చేస్తూ, ఉదయనిధి వైఖరిని ఖుష్బూ సుందర్ తప్పుబట్టారు.
ఇంత చీప్ గానా?
‘‘ఉదయనిధి స్టాలిన్ ప్రసంగం విన్నాను. అది అత్యంత చీప్ గా, అసభ్యకరమైనదిగా, మహిళలను తీవ్రంగా అవమానించేలా ఉంది. అంతేకాదు, ఆయన వారసత్వంగా స్వీకరించాలనుకుంటున్న రాజకీయ సంస్కృతికి అది అద్దం పడుతోంది’’ అని ఖుష్బూ సుందర్ ఫైర్ అయ్యారు.
రాజకీయ వినోదంగా
‘‘ఇలాంటి ఆలోచనా విధానం ఉన్నవారు ఒక రాజకీయ పార్టీకి నాయకత్వం వహించి, భవిష్యత్తులో రాష్ట్రాన్ని పాలించాలని ఆశిస్తే.. అప్పుడు దేవుడు మాత్రమే ప్రజలను కాపాడాలి. మహిళలను దూషించడం, అవమానించడం, కించపరచడాన్ని రాజకీయ వినోదంగా మార్చుకుని, తమ అనుచరుల చప్పట్లు, ఈలలు, నవ్వుల మధ్య ఆనందించడం వంటి సంస్కృతి నుంచి ఇంకేం ఆశించగలం? ఈ విషయాన్ని నాకన్నా బాగా ఇంకెవరు అర్థం చేసుకుంటారు’’ అని ఖుష్బూ రాసుకొచ్చారు.
మహిళలను గౌరవించాలి
‘‘ఇలాంటి భాషను సహజంగా తీసుకునేవారు ఒక విషయం గుర్తుంచుకోవాలి. మహిళల గౌరవాన్ని రాజకీయ ప్రయోజనాల కోసం బలి చేస్తే, చివరికి ఏ కుటుంబమూ.. మీ సొంత కుటుంబం కూడా అలాంటి అవమానాలకు అతీతం కాదు. రాజకీయాల్లో విభేదాలు ఉండొచ్చు, కానీ ప్రజా వేదికపై మాట్లాడే మాటలకు హద్దులు ఉండాలి. మహిళలను ఎప్పుడూ గౌరవించాలి. వారి గౌరవాన్ని మీ ఇష్టానుసారం ఉపయోగించుకునే రాజకీయ పావులుగా చూడకూడదు’’ అని ఖుష్బూ మండిపడ్డారు.
త్రిషకు సారీ చెప్పాలి
‘‘మీ రాజకీయ ప్రత్యర్థి పనితీరు, దూరదృష్టి, నాయకత్వానికి సమానంగా నిలవలేమని తెలిసినప్పుడు వ్యక్తిగత దూషణలు, అసభ్య వ్యాఖ్యలే సులభమైన మార్గంగా కనిపిస్తాయి. ఉదయనిధి స్టాలిన్, ఆయన తండ్రి ఎం.కే. స్టాలిన్ గతంలో ఎన్నో వివాదాలను ఎదుర్కొని ఉండవచ్చు. కానీ అవే ప్రజా జీవితానికి ప్రమాణాలుగా మారకూడదు.
ప్రతిపక్ష నాయకుడు త్రిషను బహిరంగ వేదికపై అవమానించినందుకు ఆమెకు ఎలాంటి షరతులు లేకుండా బహిరంగంగా క్షమాపణ చెప్పాల్సిన బాధ్యత ఉంది. ఆయన తన తప్పును ఒప్పుకుని, క్షమాపణ చెప్పే ధైర్యం, సంస్కారం చూపుతారో లేదో చూడాలి’’ అని ఖుష్బూ పోస్టును ముగించారు.
అసలు తంజావూరు సభలో ఏం జరిగింది?
కావేరి నీటి సమస్యపై తంజావూరులో జరిగిన నిరసన సభలో ఉదయనిధి మాట్లాడారు. "మా పార్టీపై అక్రమ కేసులు పెట్టడంపైనే సీఎం శ్రద్ధ చూపిస్తున్నారు తప్ప, కావేరి సమస్యపై నోరు విప్పడం లేదు" అని ఉదయనిధి తమిళంలో వ్యాఖ్యానించారు.
ఆ సమయంలో సభలోని ఒకరు 'త్రిష' పేరును బిగ్గరగా అరవడంతో, ఉదయనిధి నవ్వుతూ ఒక డబుల్ మీనింగ్ వ్యాఖ్య చేశారు. దానికి చుట్టూ ఉన్న అనుచరులు ఈలలు వేస్తూ కేరింతలు కొట్టారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో వివాదం చెలరేగింది. దీంతో ఉదయనిధిని పోలీసులు అరెస్ట్ కూడా చేశారు.
ABOUT THE AUTHORChandu Shanigarapuచందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More

E-Paper


