Kiara Advani: ఆ సినిమా సమయంలోనే బ్రేకప్ చెప్పుకున్నాం.. కానీ కార్గిల్ మళ్లీ మా ఇద్దరినీ కలిపింది: కియారా లవ్ స్టోరీ ఇలా
Kiara Advani: కియారా అద్వానీ, సిద్ధార్థ్ మల్హోత్రా ప్రస్తుతం నెట్టింట తమ లవ్ స్టోరీ ముచ్చట్లతో సందడి చేస్తున్నారు. 'కాఫీ విత్ కరణ్' సీజన్ 9లో పాల్గొన్న ఈ దంపతులు.. తమ సంబంధంలో ఎదుర్కొన్న అత్యంత కష్టమైన సమయాన్ని బయటపెట్టారు. 'షేర్‌షా' షూటింగ్ సమయంలోనే తాము బ్రేకప్ చెప్పుకున్నామని కియారా చెప్పింది.
Kiara Advani: బాలీవుడ్ స్టార్ జంట కియారా అద్వానీ, సిద్ధార్థ్ మల్హోత్రా కెరీర్‌లో విపరీతమైన క్రేజ్ తెచ్చిపెట్టిన మూవీ 'షేర్‌షా' (Shershaah). కార్గిల్ యుద్ధ వీరుడు కెప్టెన్ విక్రమ్ బాత్రా జీవితం ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా షూటింగ్ సమయంలోనే వీరిద్దరి మధ్య ప్రేమ చిగురించింది. అయితే ఈ ప్రేమ ప్రయాణం అందరూ అనుకున్నంత సులువుగా సాగలేదని, ఒక దశలో ఇద్దరి మధ్య తీవ్రమైన విభేదాలు వచ్చి బ్రేకప్ వరకు వెళ్లిందని వీరు వెల్లడించారు.

కరణ్ జోహార్ పాపులర్ షో 'కాఫీ విత్ కరణ్' ఆఖరి సీజన్ (సీజన్ 9) ఎపిసోడ్‌లో ఈ జంట పాల్గొని తమ రిలేషన్‌షిప్‌కు సంబంధించిన ఆసక్తికరమైన రహస్యాలను వెల్లడించారు.
"నాకు హాట్ అండ్ కోల్డ్ వద్దు.. కియారా ఘాటు హెచ్చరిక"
'లస్ట్ స్టోరీస్' ప్యాకప్ తర్వాత ఒక పార్టీలో తొలిసారి కలుసుకున్న కియారా-సిద్ధార్థ్, 2019లో 'షేర్‌షా' ప్రాజెక్ట్ ద్వారా దగ్గరయ్యారు. అయితే సినిమా కార్గిల్ షెడ్యూల్ ప్రారంభమవ్వడానికి సరిగ్గా ముందు రోజు రాత్రి వీరిద్దరి మధ్య పెద్ద రచ్చ జరిగింది.
కియారా ఆనాటి ఘట్టాన్ని గుర్తు చేసుకుంటూ.. "కార్గిల్ బయలుదేరే ముందు రాత్రి నేను సిద్ధార్థ్‌తో స్పష్టంగా చెప్పేశాను. 'నువ్వు నా విషయంలో చాలా హాట్ అండ్ కోల్డ్ గా వ్యవహరిస్తున్నావు. నాకు అర్థం కావడం లేదు. నా విషయంలో ఉంటే పూర్తిగా ఉండాలి లేదా వెళ్ళిపోవాలి. ఈ రెండింటి మధ్య ఊగిసలాడే మనస్తత్వం నాకు నచ్చదు, నేను భరించలేను' అని తెగేసి చెప్పాను" అని చెప్పింది.
ఆ సమయంలో సిద్ధార్థ్ కూడా కియారాతో ఏకీభవించారు. తన కెరీర్‌పై దృష్టి పెట్టాల్సిన సమయం కావడం వల్ల, రిలేషన్‌షిప్‌లో సీరియస్‌గా కమిట్ అయితే పనికి అంతరాయం కలుగుతుందని భావించి ఇద్దరూ విడిపోవాలని నిర్ణయించుకున్నారు.
30 రోజుల కార్గిల్ ఫోన్ కాల్స్.. మళ్లీ చిగురించిన బంధం!
బ్రేకప్ చెప్పుకుని సిద్ధార్థ్ మల్హోత్రా కార్గిల్ షూటింగ్‌కు వెళ్లారు. అక్కడ కనీస వసతులు లేని అత్యంత ప్రతికూల వాతావరణంలో, సిగ్నల్స్ కూడా సరిగ్గా లేని ప్రదేశంలో ఒక నెల రోజుల పాటు షూటింగ్ జరిగింది. అయితే విడిపోయినప్పటికీ కియారా జ్ఞాపకాలు సిద్ధార్థ్‌ను వదల్లేదు.
నెట్‌వర్క్ సరిగ్గా లేకపోయినా, రోజూ షూటింగ్ ప్యాకప్ అయిన వెంటనే సిద్ధార్థ్ కియారాకు కాల్ చేసేవారు లేదా మెసేజ్‌లు పెట్టేవారు. వరుసగా 30 రోజుల పాటు ప్రతీ రాత్రి కార్గిల్ నుంచి కియారాతో మాట్లాడటంతో ఇద్దరి మధ్య దూరం తగ్గి, బంధం మరింత బలపడింది. ఈ 30 రోజుల నిరంతర సంభాషణలే తమను మళ్లీ ప్రేమికులుగా మార్చాయని కియారా వివరించారు.
రాజస్థాన్‌లో రాజసం.. ఇప్పుడు రెండోసారి గర్భం!
కొన్నేళ్ల పాటు తమ ప్రేమాయణాన్ని గుట్టుగా ఉంచిన ఈ జంట 2023లో రాజస్థాన్‌లోని జైసల్మేర్ కోటలో సాంప్రదాయ హిందూ పద్ధతిలో వివాహం చేసుకున్నారు. ఈ దంపతులకు 2025 జులైలో కుమార్తె 'సారాయా' (Saraayah) జన్మించింది. అక్టోబర్ 2026లో కియారా అద్వానీ మళ్లీ గర్భవతి అని ఈ జంట అధికారికంగా ప్రకటించింది.
ఇక 2003లో ప్రారంభమైన 'కాఫీ విత్ కరణ్' టాక్ షో.. ప్రస్తుతం జియోహాట్‌స్టార్ (JioHotstar)లో 9వ సీజన్‌తో ముగింపు పలుకుతోంది. చివరి సీజన్‌లో విడిపోయి మళ్లీ ఒకటైన తమ ప్రేమ కథను పంచుకుని కియారా-సిద్ధార్థ్ జోడీ వీక్షకులకు ప్రత్యేకమైన జ్ఞాపకాలను అందించింది.
ABOUT THE AUTHORHari Prasad Sహరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More

E-Paper


