...
...
Next Story

తెలంగాణలో జానకమ్మ బాల్యం.. వేములవాడ రాజన్న దగ్గర పాటలు, మానేరు వాగుతో అనుబంధం!

గాన కోకిల జానకమ్మ లేరు అనే విషయాన్ని ఎవరూ జీర్ణించుకోలేకపోతున్నారు. భాషతో సంబంధం లేకుండా అందరికీ ఇష్టమైన వ్యక్తి జానకమ్మ. ఆమెకు తెలంగాణతోనూ అనుబంధం ఉంది. మన మానేరు వాగులోనూ ఆమె ఆటలు ఆడారు. వేములవాడ రాజన్న దగ్గర పాటలు పాడారు.

Published on: Jul 12, 2026, 15:21:56 IST
Advertisement

గాన కోకిల, సంగీత ప్రపంచంలో అందరూ ఆత్మీయంగా జానకమ్మ అని పిలుచుకునే ప్రముఖ నేపథ్య గాయని ఎస్. జానకి ఇకలేరు. శనివారం సాయంత్రం (జూలై 11, 2026) ఆమె కన్నుమూశారనే వార్త సంగీత ప్రియులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. 88 ఏళ్ల వయసులో ఆమె తుదిశ్వాస విడిచారు. ఆరు దశాబ్దాలకు పైగా తన అమృత గాత్రంతో భాషా సరిహద్దులను చెరిపేసి, భారతీయ సంగీత ప్రపంచానికి ఆమె అందించిన సేవలు అజరామరం.

జానకమ్మ
జానకమ్మ

ఎస్. జానకి గొంతు ఆరు దశాబ్దాలుగా ప్రతి తెలంగాణ ఇంట్లోనూ ప్రతిధ్వనిస్తూనే ఉంది. అయితే ఆమె బాల్యానికి తెలంగాణతో ఒక ప్రత్యేకమైన, మధురమైన అనుబంధం ఉందనే విషయం చాలామందికి తెలియదు. ఆమె పుట్టింది ప్రస్తుత ఆంధ్రప్రదేశ్‌లోనే అయినప్పటికీ ఆరు దశాబ్దాల క్రితం ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని వెనుకబడిన చేనేత గ్రామం 'సిరిసిల్ల'లో ఆమె తన బాల్యంలోని కొంతకాలాన్ని గడిపారు. తర్వాతి కాలంలో రాజన్న సిరిసిల్ల జిల్లాగా మారింది.

ఆమె జీవితంలోని ఈ అరుదైన అధ్యాయం తెలంగాణ ప్రజలతో ఆమెకు మరింత బలమైన భావోద్వేగ బంధాన్ని ముడిపెట్టింది. స్థానిక థియేటర్లలో సినిమాలు చూస్తూ, సినిమా ప్రపంచంపై, సంగీతంపై జానకమ్మకు మక్కువ పెరిగిందని ఆమె ఒక ఇంటర్వ్యూలో స్వయంగా గుర్తుచేసుకున్నారు. దాదాపు 6 సంవత్సరాలు సిరిసిల్లలో ఉన్నారు జానకమ్మ. ఆమె తండ్రి శ్రీరామమూర్తి తెలుగు ఉపాధ్యాయుడిగా, ఆయుర్వేద వైద్యుడిగా పని చేశారు. అప్పుడు సిరిసిల్లలో ఒక బంగ్లాలో అద్దెకు ఉండేవారు. చుట్టు పక్కల పిల్లలతో కలిసి మానేరు వాగులో ఆడుతూ పాటలు పాడుకున్నారు జానకమ్మ. అంతేకాదు వేములవాడ రాజన్న ఆలయానికి కూడా వెళ్లేవారు. అక్కడ పాటలు పాడేవారు. చిన్నతనంలో సిరిసిల్లలో ఎడ్ల బండ్ల మీద వెళ్లి థియేటర్‌లో సినిమాలు చూసేవారు జానకమ్మ. తెలంగాణ మట్టితో ఉన్న ఈ అనుబంధం కూడా ఆమె సంగీత ప్రస్థానానికి తొలి బీజాలు వేసింది.

కె.వి. మహదేవన్, ఎం.ఎస్. విశ్వనాథన్, ఇళయరాజా వంటి దిగ్గజ సంగీత దర్శకులతో ఆమె చేసిన ప్రయోగాలు అద్భుతమైన గీతాలను అందించాయి. 'పదహారేళ్ల వయసు' లోని అమాయకపు ప్రేమను పలికించే ‘సిరిమల్లె పువ్వా’. 'సాగరసంగమం' లో ఎస్.పి. బాలుతో కలిసి పాడిన మెలోడీ ‘మౌనమేలనోయి’, భక్తిరసాన్ని పలికించే ‘ఓం నమః శివాయ’. 'స్వాతిముత్యం' లోని జానపద శైలి ‘సువ్వి సువ్వి’, 'స్వర్ణకమలం' లోని శాస్త్రీయ నృత్య గీతం ‘ఆకాశంలో ఆశల హరివిల్లు’.. ఇలా చెప్పుకుంటూ పోతే.. ఒకటా రెండా.. జానకమ్మ అమృతమైన గోంతు నుంచి వచ్చిన పాటలు ఎన్నో.

జానకమ్మ మృతి పట్ల తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. మెగాస్టార్ చిరంజీవితో పాటు పలువురు టాలీవుడ్ ప్రముఖులు ఆమెతో ఉన్న అనుబంధాన్ని, ఆమె పాటల జ్ఞాపకాలను గుర్తుచేసుకుంటూ నివాళులర్పించారు.

తరాలు మారినా తరగని జానకమ్మ మధుర గాత్రం, ప్రేమకు, భక్తికి, విరహానికి, వేడుకకు నిలువెత్తు రూపంగా నిలిచి, సంగీత ప్రియుల గుండెల్లో ఎప్పటికీ సజీవంగానే ఉంటుంది.

 
ABOUT THE AUTHOR
Anand Sai

ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks