Lenin Review: లెనిన్ రివ్యూ.. అఖిల్ నట విశ్వ రూపం.. మూడేళ్ల తర్వాత పవర్‌ఫుల్ కంబ్యాక్.. మరి మనోడు హిట్ కొట్టాడా?
Lenin Review: అక్కినేని అఖిల్ సుదీర్ఘ విరామం తర్వాత నటించిన మోస్ట్ అవేటెడ్ కమర్షియల్ రివెంజ్ డ్రామా ‘లెనిన్’ ఇవాళ రిలీజైంది. మురళి కిషోర్ దర్శకత్వంలో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా తెరకెక్కిన ఈ చిత్రం అఖిల్‌కు కావాల్సిన బ్రేక్ ఇచ్చిందా? మనోడు హిట్ కొట్టాడా? అన్నది లెనిన్ రివ్యూలో చూసేయండి.
Lenin Review:

సినిమా పేరు : లెనిన్
నటీనటులు : అక్కినేని అఖిల్, భాగ్యశ్రీ బోర్సే, ఈశ్వరీ రావు, ప్రమోద్ పంజు, బ్రహ్మాజీ, శివాజీ, సునీల్ తదితరులు
డైరెక్టర్ : మురళీ కిశోర్ అబ్బూరు
ప్రొడ్యూసర్లు : అక్కినేని నాగార్జున, సూర్యదేవర నాగవంశీ
రిలీజ్ డేట్ : జూలై 10, 2026
ఇది మా మహా భారతం కథ అంటూ థియేటర్లకు వచ్చిన సినిమా ‘లెనిన్’. అక్కినేని అఖిల్ (Akhil Akkineni) కెరీర్‌లో అత్యధిక కాలం వేచి చూసిన ప్రాజెక్ట్ ఇది. ‘ఏజెంట్’ తర్వాత దాదాపు మూడేళ్ల గ్యాప్ తీసుకుని, పక్కా ప్లానింగ్‌తో అఖిల్ చేసిన మాస్ అండ్ క్లాస్ ఎంటర్‌టైనర్ ఇది. అక్కినేని నాగార్జున, సూర్యదేవర నాగవంశీ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రంపై మొదటి నుంచి అంచనాలు గట్టిగానే ఉన్నాయి. మరి ఈ రోజు విడుదలైన ఈ సినిమా ఎలా ఉందో లెనిన్ రివ్యూలో చూద్దాం.
స్టోరీ ఏంటంటే?
లెనిన్ కథ అంతా 1989 కాలంలో చిత్తూరు జిల్లాలోని ‘శ్రీరామపురం’ అనే ఊరిలో నడుస్తుంది. లెనిన్ (అఖిల్ అక్కినేని) ఒక అనాథ. అతడిని జయంతి (ఈశ్వరి రావు) తన సొంత కొడుకు వసంత్ (ప్రమోద్ పంజు)తో సమానంగా పెంచుకుంటుంది. వసంత్ ఏమో డాక్టర్ చదువుతాడు. లెనిన్ ఊర్లోనే ఉంటాడు.
ఊరిలో జరిగే ‘భారతం మిట్ట’ ఉత్సవాల్లో లెనిన్‌కు భారతి (భాగ్యశ్రీ బోర్సే) పరిచయమవుతుంది. ఇద్దరూ ప్రేమలో పడతారు. అంతా సవ్యంగా సాగుతోంది అనుకునే టైమ్‌లో.. లెనిన్‌కు తన ప్రాణంగా భావించే మనుషుల గురించి కొన్ని నమ్మలేని చేదు నిజాలు తెలుస్తాయి. ఆ నిజాలు ఏంటి? తన వాళ్లే తనకు ఎందుకు శత్రువులుగా మారారు? వారిని లెనిన్ ఎలా ఎదిరించాడు? అనేదే మిగతా కథ.
విశ్లేషణ
ఇప్పుడు సినీ ఇండస్ట్రీలో రా అండ్ రస్టిక్ మూవీస్ కు మంచి డిమాండ్ ఉంది. ఇలాంటి కథలతో వచ్చిన సినిమాలు హిట్ అవుతున్నాయి. ఇప్పుడు అఖిల్ కూడా అదే జోనర్ లో లెనిన్ తో థియేటర్లకు వచ్చాడు. ఈ సారి ‘మనోడు కొడుతున్నాడు’ అని నాగార్జున, జూలై 10న సినిమానే మాట్లాడుతుందని అఖిల్ ఈ మూవీపై కాన్ఫిడెన్స్ వ్యక్తం చేశారు. వాళ్ల కాన్ఫిడెంట్ కు తగ్గట్లుగానే లెనిన్ మూవీ ఉంది.
లెనిన్ మూవీ మహాభారతం కథ, ద్రౌపది నేపథ్యం, లెనిన్ గ్రామానికి ఉన్న సంబంధంతో ఇంట్రెస్టింగ్ ఫీల్ ఇస్తుంది. కానీ ఫస్ట్ హాఫ్ కాస్త స్లోగా సాగుతుంది. లెనిన్ ప్రపంచంలోని పాత్రలను, కథను పరిచయం చేయడానికి డైరెక్టర్ కాస్త టైమ్ తీసుకున్నాడు. లెనిన్ కథ, హీరోయిన్ తో లవ్ ట్రాక్ తో మూవీ నెమ్మదిగా సాగుతుంది.
అయితే ప్రీ ఇంటర్వెల్, ఇంటర్వెల్ తో లెనిన్ మూవీకి ఒక్కసారిగా ఊపు వస్తుంది. ఈ ట్విస్ట్ మైండ్ బ్లోయింగ్ గా ఉంటుంది. ఇక సెకండాఫ్ లో లెనిన్ నట విశ్వరూపంతో రెచ్చిపోయాడు. రివేంజ్ డ్రామా అయితే ఆడియన్స్ పీక్ లెవల్ ఎంటర్ టైన్మెంట్ అందిస్తుంది. ఇక క్లైమాక్స్ అదిరేలా ఉంది.
మరో రేంజ్ లో
డైరెక్టర్ మురళి కిషోర్ మంచి ప్రయత్నమే చేశాడు. అప్పటివరకూ లవర్ బాయ్ లా, స్టైలిష్ హీరోలా చేసిన అఖిల్ తో రా అండ్ రస్టిక్ మూవీ ప్రయోగం మెచ్చుకోదగ్గదే. అయితే లెనిన్ లో ఫస్ట్ హాఫ్ తర్వాత స్టోరీ కాస్త ఊహకు తగ్గట్లుగానే సాగుతుంది. ముఖ్యంగాసెకండ్ హాఫ్‌లో స్క్రీన్ ప్లే ఇంకాస్త గ్రిప్పింగ్‌గా ఉండి ఉంటే సినిమా రేంజ్ మరోలా ఉండేది. ఎడిటర్ నవీన్ నూలి సెకండ్ హాఫ్‌లో కొన్ని సాగదీత సీన్లను ట్రిమ్ చేసి ఉంటే బాగుండేది.
ఎవరెలా చేశారంటే?
లెనిన్ చిత్రం కచ్చితంగా అఖిల్ కెరీర్‌లోనే వన్ ఆఫ్ ది ఫైనేస్ట్ మూవీ అని చెప్పొచ్చు. ‘అఖిల్’ మూవీ నుంచి ‘ఏజెంట్’ వరకూ అఖిల్ యాక్టింగ్ చేస్తూ వచ్చాడు. కానీ అవన్నీ ఒకెత్తయితే.. లెనిన్ మూవీ మరో ఎత్తు. మాస్ కమర్షియల్ ఎంటర్‌టైనర్ కోసం అఖిల్ చేస్తున్న ప్రయత్నం ఈ సినిమాతో ఒక కొలిక్కి వచ్చింది. యాక్షన్ సీక్వెన్సుల్లో, ఎమోషనల్ సీన్లలో అఖిల్ మునుపటి కంటే చాలా మెచ్యూర్డ్‌గా నటించాడు. చిత్తూరు యాసలో డైలాగ్ లను కూడా బాగా చెప్పాడు.
- భాగ్యశ్రీ బోర్సే (Bhagyashri Borse) కేవలం గ్లామర్ బొమ్మలా కాకుండా కథను మలుపు తిప్పే ఒక పవర్‌ఫుల్ పాత్రలో కనిపించింది. అఖిల్, భాగ్యశ్రీల లవ్ ట్రాక్, కెమిస్ట్రీ స్క్రీన్ పై చాలా ఫ్రెష్‌గా వర్కవుట్ అయ్యాయి.
- ఈ సినిమాలో అతిపెద్ద సర్‌ప్రైజ్ మాత్రం ప్రమోద్ పంజు అని చెప్పొచ్చు. సెకండ్ హాఫ్ వరకు అతని పాత్రను మేకర్స్ దాచిన విధానం, ఆ తర్వాత వచ్చే నెగెటివ్ షేడ్స్ ట్విస్ట్ థియేటర్లలో ఆడియన్స్‌కు గూస్ బంప్స్ ఇస్తాయి. విలన్ పాత్రలో అతను అదరగొట్టాడు. వీరికి తోడు యతిరాజుగా నెగెటివ్ షేడ్స్ లో శివాజీ, సెంటిమెంట్ సీన్లలో ఈశ్వరి రావు చక్కగా నటించారు.
టెక్నికల్ పరంగా
టెక్నికల్ పరంగా చూస్తే మ్యూజిక్ డైరెక్టర్ తమన్ (Thaman S) అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ (BGM) సినిమాను నెక్స్ట్ లెవెల్‌కు తీసుకెళ్లింది. ముఖ్యంగా ప్రీ-ఇంటర్వెల్, ఇంటర్వెల్ బ్లాక్స్, క్లైమాక్స్ ఫైట్ సీన్లలో తమన ఇరగదీశాడు. లియోన్ బ్రిట్టో సినిమాటోగ్రఫీ 1989 నాటి చిత్తూరు వాతావరణాన్ని కళ్ళకు కట్టింది.
ఫైనల్ గా
ఫైనల్ గా లెనిన్ ఒక డీసెంట్ మాస్ కమర్షియల్ రివెంజ్ డ్రామా. మూడేళ్లు వేచి చూసినందుకు అఖిల్‌కు ఈ మూవీ ఒక బెస్ట్ మెమోరీగా నిలిచిపోతుంది. యాక్షన్, థ్రిల్, ఫ్యామిలీ ఎమోషన్స్ కావాలనుకునే ఆడియన్స్ లెనిన్ ను థియేటర్లో చూడొచ్చు.
రేటింగ్: 3/5
ABOUT THE AUTHORChandu Shanigarapuచందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More

E-Paper


