Logan Child Artist: 11 ఏళ్లకే పార్టీల్లో డ్రగ్స్ ఇచ్చారు.. మార్వెల్ సూపర్ హీరో మూవీ లోగన్ చైల్డ్ ఆర్టిస్ట్ కామెంట్స్

Logan Child Actress Dafne Keen About Drugs At 11 Age: 11 ఏళ్ల పిన్న వయసులోనే హాలీవుడ్‌లో డ్రగ్స్ సంస్కృతిని చూశానని సూపర్ హీరో మూవీ 'లోగన్' చైల్డ్ ఆర్టిస్ట్ డాఫ్నే కీన్ సంచలన విషయాలు బయటపెట్టారు. రీల్ ఫాదర్ హ్యూ జాక్‌మ్యాన్ శ్రేయోభిలాషిలా తనకు అండగా నిలిచారని ఒక ఇంటర్వ్యూలో వెల్లడించారు.

Published on: Nov 6, 2026, 11:40:33 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

Logan Child Actress Dafne Keen About Drugs At 11 Age: హాలీవుడ్ సినీ ప్రపంచంలో మెరిసే రంగుల వెనుక ఎవరికీ తెలియని చీకటి కోణాలు ఉంటాయని మరోసారి నిరూపితమైంది. ప్రపంచవ్యాప్తంగా అపారమైన ప్రజాదరణ పొందిన మార్వెల్ సూపర్ హీరో చిత్రం 'లోగన్' (2017) ద్వారా చైల్డ్ ఆర్టిస్ట్‌గా గుర్తింపు తెచ్చుకున్న డాఫ్నే కీన్ హాలీవుడ్ సంస్కృతిపై సంచలన వ్యాఖ్యలు చేశారు.

11 ఏళ్లకే పార్టీల్లో డ్రగ్స్ ఇచ్చారు.. మార్వెల్ సూపర్ హీరో మూవీ లోగన్ చైల్డ్ ఆర్టిస్ట్ కామెంట్స్
11 ఏళ్లకే పార్టీల్లో డ్రగ్స్ ఇచ్చారు.. మార్వెల్ సూపర్ హీరో మూవీ లోగన్ చైల్డ్ ఆర్టిస్ట్ కామెంట్స్

11 ఏళ్లకే డ్రగ్స్ తీసుకోమ్మన్నారు

11 ఏళ్ల పిన్న వయసులోనే హాలీవుడ్ వేడుకల్లో తనను డ్రగ్స్ తీసుకోమని ఒత్తిడి తెచ్చారని, అయితే తాను వాటికి దూరంగా ఉన్నానని 21 ఏళ్ల డాఫ్నే కీన్ ఒక పాడ్‌కాస్ట్ ఇంటర్వ్యూలో వెల్లడించారు.

తెలుగు రాష్ట్రాల్లోనూ మార్వెల్ సినిమాలకు, 'ఎక్స్-మెన్' సిరీస్‌కు భారీగా అభిమానులు ఉన్నారు. అందులో వోల్వరీన్ కూతురు లారా (ఎక్స్-23) పాత్రలో నటించి డాఫ్నే ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు అందుకున్నారు. బాలనటులుగా చలనచిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టే పిల్లలు ఎదుర్కొనే ప్రమాదాలు ఎంత తీవ్రంగా ఉంటాయో డాఫ్నే తెలిపిన విశేషాలు స్పష్టం చేస్తున్నాయి.

పసి వయసులోనే ఎదురైన చేదు అనుభవాలు

'ఇన్‌సైడ్ ఆఫ్ యూ' అనే పాడ్‌కాస్ట్ కార్యక్రమంలో డాఫ్నే కీన్ మాట్లాడుతూ సినిమా షూటింగ్ పూర్తయ్యాక జరిగే 'రాప్ పార్టీల' వాతావరణాన్ని వివరించారు. "11, 12 ఏళ్ల వయసులో రాప్ పార్టీలకు వెళ్లినప్పుడు చాలామంది నా దగ్గరకు వచ్చి కొకైన్ ఆఫర్ చేసేవారు. అంత చిన్న వయసులోనే చిత్ర పరిశ్రమలోని ఆ చీకటి కోణాన్ని కళ్లారా చూశాను. అయితే అలాంటి వాటిపై నాకు ఎలాంటి ఆసక్తి కలగలేదు. అదృష్టవశాత్తూ వాటిని ధైర్యంగా తిరస్కరించాను" అని డాఫ్నే కీన్ చెప్పుకొచ్చారు.

రీల్ ఫాదర్.. రియల్ గైడ్ హ్యూ జాక్‌మ్యాన్

పెద్దయ్యాక కూడా తాను మద్యం, ఇతర మాదకద్రవ్యాలకు సాధ్యమైనంత దూరంగానే ఉంటున్నానని చెప్పారు బ్యూటిఫుల్ డాఫ్నే కీన్. హాలీవుడ్‌లోని చెడు సంస్కృతి మధ్యలో 'లోగన్' ప్రధాన నటుడు, స్టార్ హీరో హ్యూ జాక్‌మ్యాన్ తనకు తండ్రిలా రక్షణగా నిలిచారని డాఫ్నే ఆప్యాయంగా గుర్తుచేసుకున్నారు.

"నా జీవితంలో చూసిన అత్యుత్తమ ఆన్‌స్క్రీన్ తండ్రి హ్యూ జాక్‌మ్యాన్. సెట్‌లో నన్ను ఎవరూ ఇబ్బంది పెట్టకుండా చూసుకున్నారు. పసి వయసులో నాపై పని భారం పడకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. షూటింగ్ వెనుక ఉండే గొడవలు, టెన్షన్లు ఏవీ నా దాకా రాకుండా రక్షించారు" అని హ్యూ జాక్‌మ్యాన్‌పై ప్రశంసల వర్షం కురిపించారు డాఫ్నే.

ఆయన ఇచ్చిన సలహాలు, చూపించిన ఆప్యాయత తన జీవితంలో ఎంతో తోడ్పడ్డాయని వివరించారు. జేమ్స్ మాంగోల్డ్ దర్శకత్వంలో 2017లో వచ్చిన 'లోగన్' సినిమా విమర్శకుల ప్రశంసలు పొందడంతో పాటు బాక్సాఫీస్ వద్ద భారీ విజయం సాధించింది.

'లోగన్' నుంచి 'డెడ్‌పూల్' వరకు డాఫ్నే ప్రయాణం

ఆస్కార్ అవార్డుల్లో బెస్ట్ అడాప్టెడ్ స్క్రీన్‌ప్లే కేటగిరీలో నామినేషన్ సాధించిన తొలి సూపర్ హీరో చిత్రంగా రికార్డు కూడా సృష్టించింది లోగన్ మూవీ. ఇందులో వయోభారంతో బాధపడుతున్న లోగన్, ప్రొఫెసర్ గ్జేవియర్‌లను రక్షించే క్రమంలో లారా అనే చిన్నారి మ్యూటెంట్ పాత్రలో డాఫ్నే కీన్ నటన ప్రేక్షకులను కట్టిపడేసింది.

ఇటీవల 2024లో విడుదలైన ‘డెడ్‌పూల్ అండ్ వోల్వరీన్’ చిత్రంలో కూడా డాఫ్నే మళ్లీ లారా పాత్రలో మెరిసి అభిమానులను అలరించారు. ప్రస్తుతం ఆమె 'పెర్సీ జాక్సన్ అండ్ ది ఒలింపియన్స్' అనే ఓటీటీ సిరీస్‌లో ఆర్టెమిస్ పాత్రలో నటిస్తున్నారు.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More