OTT: ఏకంగా 9.5 రేటింగ్- క్రెడిట్ కార్డు ఖాళీ చేసే గర్ల్‌ఫ్రెండ్- ఓటీటీలోకి ఫోక్ డ్యాన్సర్ నాగదుర్గ తమిళ్ సినిమా
OTT: వర్సటైల్ స్టార్ ధనుష్ మేనల్లుడు పవిష్ హీరోగా, మన పాపులర్ యూట్యూబర్ నాగదుర్గ హీరోయిన్‌గా నటించిన సరికొత్త రొమాంటిక్ కామెడీ చిత్రం ‘లవ్ ఓ లవ్’. జూలై 10న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా, ఇప్పుడు డిజిటల్ వీక్షకులను అలరించేందుకు సిద్ధమైంది. ఈ చిత్రం ఓటీటీ విశేషాలపై ఓ లుక్కేయండి.
OTT: ధనుష్ దర్శకత్వంలో వచ్చిన 'నిలావుక్కు ఎన్మేల్ ఎన్నడి కోబమ్' (NEEK) చిత్రంతో నటుడిగా పరిచయమైన పవిష్.. హీరోగా నటించిన రెండవ చిత్రం 'లవ్ ఓ లవ్'. మహేష్ రాజేంద్రన్ దర్శకత్వం వహించిన ఈ యూత్‌ఫుల్ రొమాంటిక్ డ్రామా ద్వారా తెలుగు డిజిటల్ స్పేస్‌లో మంచి గుర్తింపు తెచ్చుకున్న యూట్యూబర్ నాగదుర్గ కోలీవుడ్‌లోకి హీరోయిన్‌గా గ్రాండ్ ఎంట్రీ ఇచ్చింది.

లవ్ ఓ లవ్ ఓటీటీ
తెలుగులో ఫోక్ సాంగ్స్ లో డ్యాన్స్ తో బాగా పాపులర్ అయిన నాగదుర్గ ఇప్పుడు హీరోయిన్ గా మారింది. తెలుగులో ‘ఇడుపు కాయితం’ అనే సినిమా చేస్తోంది. అయితే ఈ బ్యూటీఫుల్ హీరోయిన్ ఇప్పటికే తమిళంలో ‘లవ్ ఓ లవ్’ అనే మూవీ చేసింది. ఈ చిత్రం ఓటీటీలోకి రానుంది. జూలై 31 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానుంది.
21 రోజులకే
పవిష్, నాగదుర్గ జంటగా నటించిన లవ్ ఓ లవ్ మూవీ 21 రోజులకే ఓటీటీలోకి రానుంది. ఈ చిత్రం జూలై 10న థియేటర్లలో రిలీజైంది. ఇప్పుడు జూలై 31న ఓటీటీలో రిలీజ్ కానుంది. తమిళంతో పాటు తెలుగు, కన్నడ, మలయాళం భాషల్లో మూవీ స్ట్రీమింగ్ కానుంది. లవ్ ఓ లవ్ సినిమాకు ఐఎండీబీలో ఏకంగా 9.5 రేటింగ్ ఉండటం విశేషం.
క్రెడిట్ కార్డ్ అప్పుల డ్రామా
లవ్ ఓ లవ్ సినిమా కథ విషయానికొస్తే.. ఒక కార్పొరేట్ కంపెనీలో ఉద్యోగం చేసే సాధారణ యువకుడి జీవితం చుట్టూ ఈ సినిమా తిరుగుతుంది. విలాసాలకు అలవాటుపడిన అతని గర్లఫ్రెండ్.. అతనికి సంబంధించిన క్రెడిట్ కార్డులను విచ్చలవిడిగా వాడేసి భారీగా అప్పుల పాలు చేస్తుంది.
ఓవైపు పెరిగిపోతున్న ఆర్థిక భారం, మరోవైపు ప్రేమికురాలితో వచ్చే మనస్పర్థల నడుమ హీరో నలిగిపోతాడు. అతను పోలీస్ స్టేషన్‌లో తన ఆవేదనను వివరించే సన్నివేశాలతో కామెడీ, ఎమోషనల్ కోణంలో లవ్ ఓ లవ్ కథ సాగుతుంది.
బిగ్ స్టార్స్ కాస్టింగ్
ఈ చిత్రంలో హీరో, హీరోయిన్లతో పాటు సీనియర్ దర్శకులు సెల్వరాఘవన్, కె.ఎస్. రవికుమార్, వనితా విజయ్ కుమార్, రమ్య, ఆదిత్య కతిర్ కీలక పాత్రల్లో అలరించారు. ఫాక్స్న్ ఈ సినిమాకు సంగీతం అందించగా, పి.జి. ముత్తయ్య సినిమాటోగ్రాఫర్‌గా, ఎన్.బి. శ్రీకాంత్ ఎడిటర్‌గా వ్యవహరించారు. సినిమాటోగ్రఫీ, నిర్మాణ విలువలు బాగున్నప్పటికీ థియేటర్లలో ఈ చిత్రం మిశ్రమ స్పందన తెచ్చుకుని బిజినెస్ పరంగా ఆశించిన స్థాయిలో రాణించలేకపోయింది.
ఎందుకు చూడాలంటే?
'లవ్ ఓ లవ్' చిత్రం పాతకాలపు 'దేవతయై కండేన్', 'వల్లవన్' రొమాంటిక్ డ్రామాల ఛాయలతో సాగే కథ అయినప్పటికీ.. ప్రస్తుత జెన్-జీ (Gen-Z) యూత్ ఎదుర్కొంటుండే క్రెడిట్ కార్డ్ డెబ్ట్, మోడ్రన్ రిలేషన్‌షిప్ సమస్యలను టచ్ చేసింది.
థియేటర్ల వద్ద వసూళ్లు మందగించినా, ప్రైమ్ వీడియో లాంటి గ్లోబల్ ఓటీటీ వేదికపై మూవీ సత్తాచాటే అవకాశముంది. తెలుగు యూట్యూబర్ నాగదుర్గ తమిళ ఎంట్రీ కావడమే కాకుండా, ఓటీటీ ఆడియన్స్‌కు నచ్చే లైట్-హార్టెడ్ కామెడీ ఉండటంతో డిజిటల్‌లో మంచి వ్యూయర్‌షిప్ సాధించే ఛాన్స్ ఉంది.
ABOUT THE AUTHORChandu Shanigarapuచందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More

E-Paper


