Made In India Web Series Review: ఇది వెబ్ సిరీస్ కాదు ఓ బిజినెస్ లెసన్.. టైటన్ వాచ్ సామ్రాజ్యం ఎలా అవతరించిందో చూస్తారా?
Made In India Web Series Review: మన దేశంలో టైటన్ వాచ్‌కి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అప్పట్లో పెళ్లిళ్లలో అల్లుడికి ఇచ్చే గిఫ్ట్ నుంచి రిటైర్‌మెంట్ కానుకల వరకు టైటన్ దే హవా. ఈ వాచ్ రియల్ స్టోరీతో వచ్చిన వెబ్ సిరీస్ 'మేడ్ ఇన్ ఇండియా: ఎ టైటన్ స్టోరీ'.
Made In India Web Series Review: అమెజాన్ ఎంఎక్స్ ప్లేయర్ లో తాజాగా వచ్చిన మేడిన్ ఇండియా: ఎ టైటన్ స్టోరీ వెబ్ సిరీస్ కేవలం ఓ బింజ్ వాచ్ చేసే సిరీసే కాదు.. ఓ బిజినెస్ లెసన్ అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఓ బ్రాండ్ ను అసలు ఎలా క్రియేట్ చేస్తారు? దానిని ప్రపంచవ్యాప్తంగా ఎలా చేస్తారు? ఆ క్రమంలో వచ్చిన ఆటంకాలను ఎలా అధిగమిస్తారన్నది ఈ సిరీస్ లో చూడొచ్చు. టాటా నుంచి వచ్చిన టైటన్ వాచ్ ఓ పెద్ద సామ్రాజ్యాన్ని ఎలా నిర్మించిందన్నదే ఈ వెబ్ సిరీస్ ప్రధాన కథాంశం.

మేడిన్ ఇండియా.. కథ ఎలా మొదలైంది?
1970ల చివరి రోజుల్లో టాటా గ్రూప్ ఎంప్లాయ్ జెర్సెస్ దేశాయ్ (జిమ్ సర్బ్) ప్రభుత్వ రంగ సంస్థలో కొన్ని ఏళ్లు పనిచేసి మళ్లీ మాతృసంస్థకు వస్తారు. ఆ టైమ్‌లో టాటా గ్రూప్ చైర్మన్, దిగ్గజం జేఆర్డీ టాటా (నసీరుద్దీన్ షా) ఒక ఫారిన్ వాచ్ మేకర్‌తో చేసిన మీటింగ్ జెర్సెస్ దేశాయ్‌ను ఆలోచనలో పడేస్తుంది. ఇండియాలోనే ఒక కొత్త వాచ్ ప్రాజెక్ట్ స్టార్ట్ చేయాలని ఆయన డిసైడ్ అవుతారు. ఆ ఆలోచన నుంచి పుట్టిందే నేటి ఐకానిక్ బ్రాండ్ 'టైటన్'.
అప్పట్లో HMT వాచీల హవా నడుస్తున్న టైమ్‌లో వాళ్లకు దీటుగా బ్రాండ్ నిలబెట్టడం అంత ఈజీ కాదు. అంతేకాదు అంత వరకూ ఉన్న మెకానికల్ వాచీల స్థానంలో క్వార్ట్జ్ టెక్నాలజీతో టైటన్ కొత్త వాచీలను తయారు చేయాలని నిర్ణయించడం మరో పెద్ద సాహసం. దీనికితోడు ప్రభుత్వ అనుమతులు, టెక్నాలజీ సమస్యలు, మార్కెట్ పోటీని తట్టుకుని సాధారణ వ్యక్తులు ఒక అసాధారణ బ్రాండ్‌ను ఎలా క్రియేట్ చేశారనేదే ఈ వెబ్ సిరీస్ మెయిన్ స్టోరీ.
బ్రాండ్ క్రియేటషన్ ఎలా?
ఒక పెద్ద బ్రాండ్ హిస్టరీని వెబ్ సిరీస్‌గా తీస్తున్నప్పుడు అది కేవలం ఆ కంపెనీకి భజన చేసేలా లేదా కమర్షియల్ యాడ్‌లా మారిపోయే రిస్క్ ఉంది. కానీ డైరెక్టర్ రాబీ గ్రెవాల్ ఆ ట్రాప్‌లో పడకుండా చాలా కేర్ తీసుకున్నారు. టైటన్ సక్సెస్‌ను చూపిస్తూనే, ఆ జర్నీలో వాళ్లు ఎదుర్కొన్న ఫెయిల్యూర్స్, చేసిన తప్పులను కూడా ఎక్కడా దాచకుండా స్క్రీన్ మీద ప్రెజెంట్ చేశారు.
ముఖ్యంగా జెర్సెస్ దేశాయ్ క్యారెక్టర్‌ను దేవుడిలా కాకుండా.. తప్పులు చేసే ఒక సాధారణ మనిషిగా, ఈగో ఉన్న పర్సన్‌గా గ్రే షేడ్స్‌లో చూపించడం సిరీస్‌కు చాలా ప్లస్ అయింది. అయితే స్క్రీన్‌ప్లే కొంచెం స్పీడ్‌గా వెళ్లడం వల్ల కొన్ని చోట్ల ఆ ఎమోషనల్ కనెక్ట్ మిస్ అయినట్లు అనిపిస్తుంది. ఎంత పెద్ద ప్రాబ్లమ్ వచ్చినా క్యారెక్టర్స్ చాలా ఈజీగా సాల్వ్ చేసేస్తున్నట్లు అనిపించడం వల్ల కథలో టెన్షన్ కాస్త తగ్గుతుంది.
జిమ్ సర్బ్, నసీరుద్దీన్ షా.. ఇద్దరూ ఇద్దరే
కుబేర మూవీ విలన్ జిమ్ సర్బ్ గుర్తున్నాడా? ఇందులో జెర్సెస్ పాత్ర పోషించిన అతడు.. తన బ్రిలియంట్ యాక్టింగ్‌తో ఈ వెబ్ సిరీస్‌ను వన్ మ్యాన్ షోలా నడిపించారు. జెర్సెస్ దేశాయ్ రోల్‌లోని అట్రాక్షన్‌ను, తెలివితేటలను చూపిస్తూనే.. ఆయనలోని అహాన్ని కూడా స్క్రీన్ మీద అద్భుతంగా పండించారు. "నేను చేసిన రోల్స్‌లో 80 శాతం రియల్ లైఫ్ వ్యక్తులవే" అని జిమ్ సర్బ్ సిరీస్ రిలీజ్‌కు ముందు సరదాగా చెప్పడం విశేషం.
జేఆర్డీ టాటా క్యారెక్టర్‌లో సీనియర్ నటుడు నసీరుద్దీన్ షా తనదైన మార్క్ చూపించారు. సపోర్టింగ్ యాక్టర్స్ వైభవ్ తత్వవాది, లక్ష్వీర్ శరణ్, అశ్వత్ భట్ తమ రోల్స్‌కు వంద శాతం న్యాయం చేశారు. మెయిన్‌గా కాశ్మీరీ యాక్టర్ అశ్వత్ భట్.. ఒక తమిళ బ్యూరోక్రాట్ రోల్ చేసిన విధానం సూపర్బ్.
1980ల నాటి ఫీల్ తెచ్చే మేకింగ్
డైరెక్టర్ రాబీ గ్రెవాల్ సెలెక్ట్ చేసుకున్న 4:3 యాస్పెక్ట్ రేషియో, సెపియా కలర్ టోన్స్ ఆడియన్స్‌ను డైరెక్ట్‌గా 1980ల నాటి ఇండియాలోకి తీసుకెళ్తాయి. అప్పటి అంబాసిడర్ కార్లు, లంబ్రెట్టా స్కూటర్లతో ప్రొడక్షన్ డిజైన్ ఆ కాలాన్ని పర్ఫెక్ట్‌గా రీక్రియేట్ చేసింది.
టైటన్ స్టార్టింగ్ డేస్ నాటి ఒరిజినల్ ఫోటోలను, ఫుటేజీని వాడటం ఈ వెబ్ సిరీస్‌కు మరింత నేచురాలిటీ తెచ్చింది. వీటికి తోడు బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌లో వాడిన పాత హిందీ, తమిళ క్లాసిక్ సాంగ్స్ ఆడియన్స్‌కు మంచి నోస్టాల్జిక్ ఫీల్ ఇస్తాయి.
'మేడ్ ఇన్ ఇండియా: ఎ టైటన్ స్టోరీ' కేవలం ఒక బ్రాండ్ స్టోరీ మాత్రమే కాదు.. ఇండియన్ బిజినెస్ హిస్టరీలో ఒక కలను నిజం చేసే ప్రయాణం. కొన్ని లోపాలు ఉన్నా.. ఈ వీకెండ్‌లో ఫ్యామిలీతో కలిసి హ్యాపీగా చూడదగ్గ ఒక బెస్ట్ ఇన్‌స్పైరింగ్ సిరీస్ ఇది. ఈ వెబ్ సిరీస్ ను అమెజాన్ ఎమ్ఎక్స్ ప్లేయర్ (Amazon MXPlayer)లో ఫ్రీగా చూడొచ్చు.
ABOUT THE AUTHORHari Prasad Sహరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More

E-Paper


