Main Vaapas Aaunga : దేశ విభజన మధ్య నలిగిపోయిన ‘ప్రేమ’ కథ- ఇంతియాజ్ అలీ మ్యాజిక్ రిపీట్! మస్ట్​ వాచ్..

Main Vaapas Aaunga review : భారత విభజన నాటి చేదు జ్ఞాపకాలు, ఒక అసంపూర్ణ ప్రేమకథ ఆధారంగా దర్శకుడు ఇంతియాజ్ అలీ తెరకెక్కించిన చిత్రం 'మై వాపస్ ఆవూంగా'. నసీరుద్దీన్ షా నటన అద్భుతంగా ఉన్న ఈ సినిమా ప్రేక్షకులను ఏ మేరకు మెప్పించిందో రివ్యూలో చూద్దాము.

Published on: Jun 13, 2026, 06:43:37 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

మై వాపస్ ఆవుంగా

డైరక్టర్- ఇంతియాజ్ అలీ
నటీనటులు- దిల్జీత్ దోసాంజ్, నసీరుద్దిన్ షా, వేదంగ్ రైనా, శార్వరి.
రేటింగ్- 3.5 స్టార్స్

ఈ మధ్యకాలంలో వస్తున్న చాలా హిందీ సినిమాలు చూస్తుంటే.. వాటన్నింటినీ ఒకే ఇన్‌స్టాగ్రామ్ ఫిల్టర్ వేసి పంపించారేమో అనే అనుమానం రాక మానదు. అతిగా పాలిష్ చేసిన ఆ విజువల్స్ అస్సలు నిజ ప్రపంచాన్ని ప్రతిబింబించవు. దీనివల్ల ఆయా సినిమాలకు ఒక ప్రత్యేకమైన వ్యక్తిత్వం లేకుండా పోతోంది. మరి బాలీవుడ్ క్లాసిక్ లవ్ స్టోరీస్ దర్శకుడు ఇంతియాజ్ అలీ కూడా ఈ ట్రెండ్‌కు లొంగిపోయాడా? అనే ప్రశ్న తలెత్తింది.

మై వాపస్ ఆవూంగాలో దిల్జీత్ దోసాంజ్..
మై వాపస్ ఆవూంగాలో దిల్జీత్ దోసాంజ్..

కానీ, లక్కీగా అలా జరగలేదు. అసలు ఒక సినిమాను వెండితెరపై ఎలా విజువలైజ్ చేయాలో, సినిమా అంటే ఎలా ఉండాలో ఇంతియాజ్ అలీని చూసి నేర్చుకోవాలని ‘మై వాపస్ ఆవూంగా’ మరోసారి నిరూపించింది. ఈ విషయంలో సినిమాటోగ్రాఫర్ సిల్వెస్టర్ ఫోన్సెకాకు కూడా ప్రత్యేకంగా అభినందనలు తెలపాల్సిందే.

‘మై వాపస్ ఆవూంగా’ కథ ఏంటి?

ఈ కథ అంతా 95 ఏళ్ల వృద్ధుడు ఇషార్ సింగ్ గ్రెవాల్ (నసీరుద్దీన్ షా) చుట్టూ తిరుగుతుంది. పాకిస్తాన్‌లోని సర్గోధా నగరానికి ఎలాగైనా వెళ్లాలనే కంగారులో ఆయనకు అకస్మాత్తుగా స్ట్రోక్ వస్తుంది. దీనివల్ల ఆయన మెల్లమెల్లగా తన జ్ఞాపకశక్తిని కోల్పోతుంటారు. ఈ కష్టసమయంలో తాతయ్యకు తోడుగా ఉండేందుకు మనవడు నిర్వైర్ (దిల్జీత్ దోసాంజ్) ఇంగ్లాండ్ నుండి తిరిగి వస్తాడు. ఇషార్ స్పృహలోకి వస్తూ, పోతూ ఉన్నప్పుడు.. దేశ విభజనకు ముందు ఆయన గడిపిన జీవితానికి సంబంధించిన కొన్ని చేదు జ్ఞాపకాలు, దృశ్యాలు బయటకు వస్తుంటాయి. వాటి ఆధారంగా నిర్వైర్ తన తాతయ్య గతంలో దాగి ఉన్న ఒక రహస్యాన్ని ముక్కలు ముక్కలుగా అర్థం చేసుకోవడం ప్రారంభిస్తాడు. తన చివరి రోజుల్లో ఇషార్ ప్రశాంతంగా కన్నుమూయకుండా ఏదో ఒక బలమైన కారణం అడ్డుపడుతోందని తెలుసుకుంటాడు. అసలు ఆ కారణం ఏంటి? అనేది ఈ సినిమా ముఖ్య కథాంశం.

భారతదేశ విభజన అనేది మానవ చరిత్రలోనే అత్యంత పెద్ద వలసగా నిలిచిపోయింది. మనలో చాలా మందికి ఆనాటి భయంకరమైన దృశ్యాలు కేవలం చరిత్ర పుస్తకాల్లోని ఫోటోలుగా మాత్రమే తెలుసు. కానీ ఆ నరకాన్ని నేరుగా అనుభవించిన ఆనాటి తరం పరిస్థితి ఏంటి? తమ సొంత ఇళ్లను, ప్రాణప్రదమైన మనుషులను వదిలేసి రావలసి వచ్చిన వారి బాధ ఎలాంటిది? అన్నింటికీ మించి, వారు తమ జీవితాంతం మోసిన ఆ గుండె కోత, గాయాల విలువ ఎంత? 'మై వాపస్ ఆవూంగా' సినిమా ఆ జ్ఞాపకాలను కేవలం గుర్తుచేయడమే కాకుండా.. సరిహద్దులు గీసిన చాలా కాలం తర్వాత కూడా మనుషుల హృదయాల్లో మిగిలిపోయిన ఆ వేదనను అర్థం చేసుకునే ప్రయత్నం చేసింది.

ఇంతియాజ్ అలీ మేకింగ్ స్టైల్‌లో ఒక విలక్షణమైన నైపుణ్యం ఉంటుంది. ఆ నైపుణ్యం పీక్స్​కి చేరినప్పుడు అది వెండితెరపై ఒక మ్యాజిక్‌లా కనిపిస్తుంది. ఈ సినిమా చూస్తున్నప్పుడు కూడా సరిగ్గా అదే అనుభూతి కలుగుతుంది. ఈ సినిమా డ్యురేషన్ 2 గంటల 46 నిమిషాలు. కానీ, స్క్రీన్ మీదున్న పాత్రలతో ప్రేక్షకుడు పూర్తిగా కనెక్ట్ అయ్యేలా చేయడంలో ఇంతియాజ్ అలీ దిట్ట. అందువల్ల సమయం ఎలా గడిచిపోయిందో మనకు తెలియదు, గడియారంలోని ముల్లు కంటే పాత్రల మధ్య ఉండే ఎమోషనల్ బాండింగ్ మనల్ని ఎక్కువగా కట్టిపడేస్తుంది.

సినిమా ప్రారంభం నుండే ప్రేక్షకుడిని కథలోకి లాగేస్తుంది. అయితే, కొంత సమయం గడిచిన తర్వాత స్క్రీన్‌ప్లే కాస్త నెమ్మదిస్తుంది. ఇంటర్వెల్ వచ్చేసరికి.. ఎప్పుడో కోల్పోయిన ఈ పాత ప్రేమకథలో ఇక చెప్పడానికి ఏముంది? అనే భావన కలుగుతుంది. కానీ సెకండ్ హాఫ్ ఆ ప్రశ్నకు అద్భుతమైన సమాధానం ఇస్తుంది. ఇటు గుండెల్ని పిండేస్తూనే, అటు ఒక మంచి అనుభూతిని మిగిల్చేలా ద్వితీయార్థాన్ని చాలా చక్కగా మలిచారు.

నటీనటుల పర్ఫార్మెన్స్ ఎలా ఉందంటే..

ఈ సినిమాకు దక్కిన చప్పట్లలో సింహభాగం ఖచ్చితంగా నసీరుద్దీన్ షాకే దక్కుతాయి. క్షీణిస్తున్న జ్ఞాపకశక్తితో బాధపడే వృద్ధుడిగా, తనను ఎప్పుడో వదిలివెళ్లిన ప్రేమ కోసం తపించే ప్రేమికుడిగా ఆయన నటన నూటికి నూరు శాతం సహజంగా ఉంది. సినిమాలో కేవలం రెండు సెకన్ల పాటు సాగే ఒక సీన్ ఉంటుంది: ఆయన కళ్ల ముందుకు జియా (యుక్తవయస్సులో ప్రేయసి) పోర్ట్రెయిట్ రాగానే, మరణశయ్యపై ఉన్న ఇషార్ చేతులు తెలియకుండానే తన గడ్డాన్ని సర్దుకోవడం ప్రారంభిస్తాయి. ఈ మధ్యకాలంలో ఒక నటుడి నుండి వచ్చిన అత్యుత్తమ ప్రదర్శనలలో దీనిని టాప్‌లో ఉంచవచ్చు.

ఇక జియా పాత్రకు ఇంతియాజ్ అలీ ఎందుకు శార్వరిని ఎంచుకున్నారో సినిమా చూస్తే అర్థమవుతుంది. జియా పాత్రలో ఉండే చలాకీతనాన్ని చూపిస్తూనే, ఇషార్ హృదయంలో తనకు ఉన్న స్థానం పట్ల ఆమెకు ఉండే ఒక నిశ్శబ్దమైన అవగాహనను శార్వరి చాలా బాగా బ్యాలెన్స్ చేసింది. వేదంగ్ తన మూడో సినిమాకే అద్భుతమైన వైవిధ్యాన్ని కనబరిచాడు. తెరపై శార్వరి, వేదంగ్ జంట చాలా బాగుంది.

వేదంగ్ నటన గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. విభజన అనంతరం, తన ఇంటికి, తన వారి దగ్గరికి వెళ్లేందుకు ఇషార్ చేసే ప్రయత్నం కచ్చితంగా కంటతడి పెట్టిస్తుంది. మనం కూడా ఆ పాత్రకు కనెక్ట్ అయిపోతాము.

ఈ చిత్రానికి ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ అందించిన సంగీతం, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఇది సినిమాకు ఒక పెద్ద అసెట్ అని చెప్పవచ్చు. ప్రతి సన్నివేశంలోని ఎమోషన్‌ను రెహమాన్ తన మ్యూజిక్‌తో మరింత పైకి లేపారు. సంగీత ప్రియులను, ప్రేక్షకులను ఈ స్కోర్ ఖచ్చితంగా మంత్రముగ్ధులను చేస్తుంది.

అయితే, అందరినీ ఆశ్చర్యపరుస్తూ ఈ సినిమాలో దిల్జీత్ దోసాంజ్ పాత్ర కాస్త బలహీనంగా అనిపిస్తుంది. బనితా సంధు (కావేరి పాత్ర) తో సాగే ఆయన ట్రాక్, కథను నడిపించే ప్రధాన పాత్రల మధ్య ఉండే ఎమోషన్‌తో పోలిస్తే అంతగా ఆకట్టుకోదు. చిన్న పాత్ర అయినప్పటికీ వినోద్ నాగ్‌పాల్ అద్భుతంగా చేశారు. అంజనా సుఖానీ, సంజయ్ సూరి తమ పాత్రల పరిధి మేర చక్కగా నటించారు.

చివరిగా చెప్పాలంటే: 'మై వాపస్ ఆవూంగా' అనేది కేవలం ఒక సినిమా కాదు, కాలం చెరిగిపోని ఒక ఎమోషనల్ జర్నీ. ఇంతియాజ్ అలీ మార్క్ ఎమోషనల్ లవ్ స్టోరీస్ ఇష్టపడే వారు దీనిని అస్సలు మిస్ అవ్వకూడదు.

ప్రస్తుత బాలీవుడ్ చిత్రాలు భారీ బడ్జెట్, భారీ తారాగణం, భారీ సెట్టింగులనే సినిమా విజయ సూత్రాలుగా పొరపడుతున్న కాలంలో.. దర్శకుడు ఇంతియాజ్ అలీ వాటన్నింటికీ భిన్నంగా అత్యంత అరుదైన, హృదయానికి హత్తుకునే ఒక స్వచ్ఛమైన మానవీయ కథను అందించారు. అక్కడక్కడా సినిమా కాస్త నెమ్మదించినట్లు అనిపించినప్పటికీ, కథ ఎమోషనల్ పీక్స్‌కు వెళ్లినప్పుడు మాత్రం ప్రేక్షకుడిని లీనమయ్యేలా చేస్తుంది. నేటి తరం దర్శకులలో చాలా తక్కువ మంది మాత్రమే అందుకోగలిగిన భావోద్వేగ శిఖరాలను ఇంతియాజ్ అలీ ఈ చిత్రంతో అందుకున్నారు.

  • శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More