మోహన్‌లాల్ ఆ పని చేసే ముందు క్షణం కూడా ఆలోచించడా.. ఇలా చేస్తాడనుకోలేదు: మలయాళ స్టార్‌పై మండిపడిన నటి

మలయాళ సూపర్ స్టార్ మోహన్‌లాల్ పై మండిపడింది నటి, డబ్బింగ్ ఆర్టిస్ట్ భాగ్యలక్ష్మి. లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటూ ఈ మధ్యే క్లీన్ చిట్ అందుకున్న నటుడు దిలీప్ కు మద్దతివ్వడంపై ఆమె మండిపడింది.

Published on: Dec 16, 2025, 17:56:20 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

లైంగిక వేధింపుల కేసులో మలయాళ నటుడు దిలీప్ నిర్దోషిగా విడుదలైన విషయం తెలిసిందే. తీర్పు వచ్చిన వెంటనే దిలీప్ కొత్త సినిమా 'భ భ బ' (Bha Bha Ba) ప్రమోషన్లలో స్టార్ హీరో మోహన్‌లాల్ భాగస్వామ్యం కావడంపై ప్రముఖ డబ్బింగ్ ఆర్టిస్ట్, నటి భాగ్యలక్ష్మి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. బాధితురాలికి మద్దతు ఇవ్వాల్సిన పెద్దలే ఇలా చేయడం "బాధ్యతారాహిత్యం" అని ఆమె మండిపడింది.

మోహన్‌లాల్ ఆ పని చేసే ముందు క్షణం కూడా ఆలోచించడా.. ఇలా చేస్తాడనుకోలేదు: మలయాళ స్టార్‌పై మండిపడిన నటి
మోహన్‌లాల్ ఆ పని చేసే ముందు క్షణం కూడా ఆలోచించడా.. ఇలా చేస్తాడనుకోలేదు: మలయాళ స్టార్‌పై మండిపడిన నటి

అసలు ఏం జరిగిందంటే?

కేరళలో సంచలనం సృష్టించిన నటి అపహరణ, లైంగిక వేధింపుల కేసులో డిసెంబర్ 8న కోర్టు నటుడు దిలీప్ ను నిర్దోషిగా ప్రకటించింది. ఈ తీర్పు వచ్చిన కొద్ది రోజులకే దిలీప్ నటిస్తున్న 'భ భ బ' (భయం భక్తి బహుమానం) సినిమా ట్రైలర్ విడుదలైంది. డిసెంబర్ 18న విడుదల కానున్న ఈ సినిమాలో మోహన్‌లాల్ గెస్ట్ రోల్ చేస్తున్నాడు.

అయితే తీర్పు వచ్చిన వెంటనే మోహన్‌లాల్ ఈ సినిమా పోస్టర్లను, ప్రమోషనల్ కంటెంట్‌ను షేర్ చేయడంపై వివాదం రాజుకుంది. ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ కేరళ (IFFK)లో పాల్గొన్న సీనియర్ నటి భాగ్యలక్ష్మి.. మోహన్‌లాల్ తీరును తప్పుబట్టింది.

"ఇది ముమ్మాటికీ బాధ్యతారాహిత్యమే.."

మీడియాతో మాట్లాడుతూ భాగ్యలక్ష్మి మోహన్‌లాల్‌పై విరుచుకుపడింది. మోహన్‌లాల్ చర్యను ఆమె సున్నితత్వం లేని, ఆలోచన లేని చర్యగా అభివర్ణించింది.

"తీర్పు వచ్చిన వెంటనే ఆ సినిమా పోస్టర్‌ను షేర్ చేయడానికి ముందు మోహన్‌లాల్ ఒక్క క్షణం కూడా ఆలోచించలేదా? గతంలో ఆ బాధితురాలి కోసం ప్రార్థిస్తున్నానని ఆయన చాలాసార్లు చెప్పారు. అంతటి పలుకుబడి ఉన్న వ్యక్తి ఇలా చేస్తే.. సమాజానికి ఎలాంటి సందేశం వెళ్తుంది? ఇది కేవలం సినిమా విషయం కాదు.. ఇది నైతికతకు సంబంధించిన విషయం" అని ఆమె ప్రశ్నించింది.

మంజు వారియర్‌పై దిలీప్ కామెంట్స్

నిర్దోషిగా బయటకు వచ్చిన తర్వాత దిలీప్ ప్రవర్తనను కూడా భాగ్యలక్ష్మి విమర్శించింది. "బయటకు రాగానే ఆయన మీడియా ముందు పండుగ చేసుకున్నట్లు మాట్లాడారు. విచారణకు సహకరించిన తన మాజీ భార్య మంజు వారియర్‌ను టార్గెట్ చేస్తూ మాట్లాడారు. ఒకవేళ బాధితురాలు ధైర్యంగా ముందుకు రాకపోయి ఉంటే.. మంజు వారియర్ పరిస్థితి మరింత దారుణంగా ఉండేది" అని భాగ్యలక్ష్మి వ్యాఖ్యానించింది.

భాగ్యలక్ష్మి రాజీనామా

తీర్పు తర్వాత దిలీప్‌ను తిరిగి అసోసియేషన్‌లో చేర్చుకోవాలని 'ఫెఫ్కా' (FEFKA) నిర్ణయించింది. ఈ నిర్ణయానికి, ఇండస్ట్రీలో ఉన్న ద్వంద్వ ప్రమాణాలకు నిరసనగా భాగ్యలక్ష్మి ఇప్పటికే ఫెఫ్కా సభ్యత్వానికి రాజీనామా చేసింది.

2017లో ప్రముఖ నటిని కారులో కిడ్నాప్ చేసి వేధించారు. ఈ కేసులో దిలీప్ అరెస్ట్ అయ్యాడు. ఎనిమిదేళ్ల విచారణ తర్వాత డిసెంబర్ 8న దిలీప్ నిర్దోషిగా విడుదలయ్యాడు. దిలీప్ విడుదలను సవాలు చేస్తూ పై కోర్టుకు వెళ్తామని కేరళ ప్రభుత్వం ప్రకటించింది.

  • Hari Prasad S
    ABOUT THE AUTHOR
    Hari Prasad S

    హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More