OTT Comedy Thriller: ఓటీటీలోకి తెలుగులో వచ్చిన మలయాళ కామెడీ థ్రిల్లర్..లవర్‌కు ప్రపోజ్ చేయబోయి గ్యాంగ్‌స్టర్ బారిన పడి..

OTT Comedy Thriller: ఈటీవీ విన్ ఓటీటీలో మలయాళ క్రేజీ క్యాంపస్ కామెడీ థ్రిల్లర్ 'అడినాశం వెల్లప్పొక్కం' నవంబర్ 26 నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. ప్రేమను వ్యక్తపరిచేందుకు అడ్డదారి తొక్కిన నలుగురు ఇంజనీరింగ్ విద్యార్థులు.. అనుకోకుండా అండర్‌వరల్డ్ గ్యాంగ్‌స్టర్ వలలో ఎలా చిక్కుకున్నారు అన్నదే ఈ మూవీ స్టోరీ.

Published on: Nov 27, 2026, 13:46:47 IST
As Prefered on
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

OTT Comedy Thriller: వీకెండ్‌లో కుటుంబంతో లేదా స్నేహితులతో కలిసి కడుపుబ్బా నవ్వుకోవాలనుకునే ఓటీటీ ప్రేక్షకులకు ప్రముఖ తెలుగు స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ ఈటీవీ విన్ (ETV Win) అదిరిపోయే వినోదాన్ని అందించింది. మలయాళంలో విలక్షణ నటుడు షైన్ టామ్ చాకో ప్రధాన పాత్రలో నటించిన అవుట్ అండ్ అవుట్ క్యాంపస్ కామెడీ థ్రిల్లర్ 'అడినాశం వెల్లప్పొక్కం' (Adinaasham Vellapokkam) ప్రస్తుతం ఈటీవీ విన్‌లో స్ట్రీమింగ్ ప్రారంభమైంది.

OTT Comedy Thriller: ఓటీటీలోకి తెలుగులో వచ్చిన మలయాళ కామెడీ థ్రిల్లర్..లవర్‌కు ప్రపోజ్ చేయబోయి గ్యాంగ్‌స్టర్ బారిన పడి..
OTT Comedy Thriller: ఓటీటీలోకి తెలుగులో వచ్చిన మలయాళ కామెడీ థ్రిల్లర్..లవర్‌కు ప్రపోజ్ చేయబోయి గ్యాంగ్‌స్టర్ బారిన పడి..

గతంలో 'ఆది కప్యారే కూట్టమణి', 'ఉరియడి' వంటి కల్ట్ కామెడీ చిత్రాలను అందించిన ఏ.జే. వర్గీస్ ఈ సినిమాకు దర్శకత్వం వహించగా, సూర్యభారతి క్రియేషన్స్ బ్యానర్‌పై మనోజ్ కుమార్ కె.పి నిర్మించారు.

ఈటీవీ విన్‌లో స్ట్రీమింగ్

“పిచ్చి మరింత పెరిగింది. కామెడీ, గందరగోళం, ఊహించని సరదాతో కూడిన భారీ అడ్వెంచర్.. 'అడినాశం వెల్లప్పొక్కం' ఇప్పుడు ఈటీవీ విన్‌లో స్ట్రీమింగ్ అవుతోంది” అంటూ ఆ ఓటీటీ అధికారికంగా ఎక్స్ వేదికగా అనౌన్స్ చేసింది.

గతేడాది డిసెంబర్ 12న మలయాళంలో థియేటర్లలో విడుదలై వినోదాన్ని పంచిన ఈ సినిమా.. ఇప్పుడు తెలుగు ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమైంది.

అసలు కథేంటి? ప్రేమ, మత్తు.. ఆపై అండర్‌వరల్డ్ డాన్‌తో పంచాయితీ

ఈ సినిమా కథంతా పేరుప్రఖ్యాతులు ఉన్న 'లిబర్టీ ఇంజనీరింగ్ కాలేజీ' చుట్టూ తిరుగుతుంది. క్రమశిక్షణ విషయంలో అస్సలు రాజీపడని కఠినమైన ప్రిన్సిపాల్ షీలా సెబాస్టియన్ (మంజు పిళ్లై), ఆ కాలేజీ సహ యజమానిగా ఉంటూనే దానికి చెడ్డపేరు తేవాలని చూసే ఆమె భర్త సెబాస్టియన్ జేవియర్ (అశోకన్).. వీరిద్దరి కుమార్తె ఐడా (లిజబెత్ టామీ) ఇందులో ప్రధాన పాత్రలు.

కాలేజీలో ర్యాంక్ సాధించగల సత్తా ఉన్న విద్యార్థి వరుణ్ థామస్ (సంజయ్ థామస్).. ఐడాను ప్రేమిస్తాడు. తన ప్రేమను ఐడాకు చెప్పడానికి ధైర్యం సరిపోని వరుణ్‌కు, అతని స్నేహితుడు బెన్నీ (వినీత్ మోహన్) ఒక అడ్డదారిని సూచిస్తాడు. అదే మత్తుపదార్థాలు. ఆ ఒక్క తప్పుడు నిర్ణయం ఎప్పుడూ కలవని వరుణ్, బెన్నీ, లాలూ (సజిత్ అంబాట్టు), రిహాన్ (ప్రిన్స్ జూనియర్) అనే నలుగురు విద్యార్థులను ఒకే సమస్యలో ఇరికిస్తుంది.

అదే సమయంలో మోటివేషనల్ స్పీకర్ వేషంలో కాలేజీలోకి ప్రవేశించిన అండర్‌వరల్డ్ డాన్ కొలంబస్ (షైన్ టామ్ చాకో)కు చెందిన విలువైన డ్రగ్స్ సరుకు వీరి చేతికి చిక్కుతుంది. ఆ చిక్కుముడిని విప్పేందుకు నలుగురు విద్యార్థులు పడే పాట్లు, అండర్‌వరల్డ్ గ్యాంగ్‌స్టర్లతో ఎదురయ్యే ముఖాముఖి పోరు సినిమాను ఆద్యంతం ఉత్కంఠగా, నవ్వుల పువ్వులు పూయించేలా నడిపిస్తుంది.

షైన్ టామ్ చాకో మార్క్ ఎంటర్‌టైన్‌మెంట్..

ఈ సినిమాకు ప్రధాన బలం షైన్ టామ్ చాకో నటనే. అతనితోపాటు మిగిలిన నటీనటులు కూడా జీవించేశారు. అండర్‌వరల్డ్ డాన్ 'కొలంబస్' పాత్రలో షైన్ టామ్ చాకో తనదైన మ్యానరిజమ్స్‌తో అదరగొట్టగా, అతని ప్రత్యర్థి 'గంజాక్కురుప్పు'గా జాన్ విజయ్ గట్టి పోటీ ఇచ్చారు.

ఎస్‌ఐ ఉల్లాస్ ఉలహన్నన్‌గా బైజు సంతోష్, అన్వర్ అలీగా బాబు ఆంటోనీ, పోలీస్ కమిషనర్‌గా ప్రేమ్ కుమార్, చేతన్ కుమార్‌గా శ్రీకాంత్ వెట్టియార్ తమ కామెడీ టైమింగ్‌తో నవ్విస్తారు. కఠినమైన ప్రిన్సిపాల్‌గా మంజు పిళ్లై, ఆమె భర్తగా అశోకన్ ఆకట్టుకుంటారు.

నవ్వులతో పాటు గట్టి సందేశం.. లాజిక్ పక్కనపెట్టి చూస్తే ఫుల్ ఫన్

'అడినాశం వెల్లప్పొక్కం' సినిమాను చూసేటప్పుడు పెద్దగా లాజిక్కులు వెతకకుండా కేవలం వినోదం కోసమే చూస్తే పూర్తిగా ఆస్వాదించవచ్చని మలయాళ సినీ విమర్శకులు పేర్కొన్నారు. పాత సినిమాల్లో ప్రేమను చెప్పడానికి మందు తాగడం రొటీన్‌గా చూపించేవారు.

ఈ సినిమాలో దానికి బదులుగా నేటి తరం ఎదుర్కొంటున్న డ్రగ్స్ సమస్యను కథాంశంగా తీసుకుని, ఒక్క క్షణం అడ్డదారి తొక్కితే జీవితం ఎంత పెద్ద ఊబిలో కూరుకుపోతుందో వినోదాత్మకంగానే గట్టి హెచ్చరిక చేశారు.

గందరగోళమైన పరిస్థితులు, ఒకదానికొకటి ముడిపడిన ట్విస్టులు, పంచ్ డైలాగులతో కూడిన ‘అడినాశం వెల్లప్పొక్కం’ ఈ వీకెండ్‌లో లైట్-హార్టెడ్ కామెడీ థ్రిల్లర్ కోరుకునే వారికి ఈటీవీ విన్‌లో మంచి ఆప్షన్ గా నిలుస్తుంది.

ABOUT THE AUTHOR

హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.