Star Maa: మలయాళం బ్లాక్‌బస్టర్ హారర్ కామెడీ మూవీ తెలుగు టీవీ ప్రీమియర్ డేట్ ఫిక్స్.. క్యూట్ డెలులు వచ్చేస్తోంది
Star Maa: వెండితెరపై మ్యాజిక్ చేసిన బ్లాక్‌బస్టర్ మలయాళ హారర్ కామెడీ మూవీ 'సర్వం మాయ' ఇప్పుడు మీ ఇంటికి వస్తోంది. స్టార్ మా వేదికగా ఈ ఆదివారం ప్రసారం కానున్న ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు, అసలు ఎందుకు చూడాలో ఇక్కడ తెలుసుకోండి.
Star Maa: మలయాళం నుంచి ఈ ఏడాది వచ్చిన అద్భుతమైన హారర్ కామెడీ మూవీ సర్వం మాయ. క్యూట్ దెయ్యంతో ఓ వ్యక్తి ఫ్రెండ్షిప్ నేపథ్యంలో సాగే స్టోరీతో వచ్చిన ఈ సినిమా తెలుగు వాళ్లను కూడా బాగా ఆకట్టుకుంది. ఈ మూవీకి సంబంధించి ప్రముఖ తెలుగు ఎంటర్టైన్‌మెంట్ ఛానల్ 'స్టార్ మా' (Star Maa) మరో క్రేజీ అప్‌డేట్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ డేట్ ను అనౌన్స్ చేసింది.

సర్వం మాయ టీవీ ప్రీమియర్ వివరాలు
"కొన్ని కథలు ముగిసినా.. మనతోనే ఉండిపోతాయి" అంటూ స్టార్ మా సోషల్ మీడియా వేదికగా విడుదల చేసిన ప్రోమో నెట్టింట వైరల్ అవుతోంది. ఈ సర్వం మాయ మూవీ కేవలం కల్పిత కథగా కాకుండా, మనిషి జీవితంలో ఎదురయ్యే భావోద్వేగాలను, బంధాలను ప్రతిబింబించేలా సాగుతుంది.
సాధారణంగా వీకెండ్ వచ్చిందంటే చాలు తెలుగు ప్రేక్షకులు టీవీలకు అతుక్కుపోతుంటారు. దీంతో ఈ ఆదివారం (ఏప్రిల్ 19) సాయంత్రం 6 గంటల స్లాట్‌లో 'సర్వం మాయ' రానుంది. ఈ ఎమోషనల్ డ్రామాకు భారీ టీఆర్‌పీ (TRP) వస్తుందని స్టార్ మా భావిస్తోంది.
సర్వం మాయ ఎలా ఉందంటే?
సాధారణంగా హారర్ కామెడీ అనగానే ఓ భయపెట్టే దెయ్యం, దాని చుట్టూ అల్లుకునే కామెడీయే గుర్తుకు వస్తుంది. కానీ సర్వం మాయ మాత్రం అందుకు పూర్తి భిన్నంగా సాగుతుంది. దెయ్యంతో ఓ మనిషి చేసే స్నేహం అనేదే కొత్త కాన్సెప్ట్. అందులోనూ ఆ దెయ్యం ఓ క్యూట్ అమ్మాయి అయితే ఇంకెలా ఉంటుందో ఊహించుకోండి.
నిజానికి మూవీలో నివిన్ ది లీడ్ రోల్ అయినా.. డెలులు పాత్ర పోషించిన రియా షిబునే ఎక్కువగా ఆకట్టుకుంటుంది. మూవీ సాగుతున్న కొద్దీ ప్రతి ప్రేక్షకుడు ఆ పాత్రతో ప్రేమలో పడతారు. ఈ ఇద్దరి మధ్య వచ్చే ప్రతి సీన్ చాలా హాయిగా అనిపిస్తుంది. ఫస్టాఫ్ మొత్తం కథ చాలా సరదాగా సాగిపోతుంది. సెకండాఫ్ కాస్త సాగదీసినట్లుగా అనిపించినా.. అసలు ఆ అమ్మాయి ఎవరు? ఎలా చనిపోయింది అన్న విషయాలు తెలుసుకోవాలనే కుతూహలం పెరిగిపోతూ ఉంటుంది.
చివరి 20 నిమిషాలు ఎమోషనల్‌గా..
ఇక సినిమా మొత్తం సరదాగా సాగిపోయినా.. చివరి 20 నిమిషాలు మాత్రం ఎమోషనల్ అవుతాం. ముఖ్యంగా డెలులు ఫ్లాష్‌బ్యాక్, ఆమె చనిపోయిన తీరు కంటతడి పెట్టిస్తుంది. అసలు అంత చిన్న వయసులోనే ఆ అమ్మాయి దెయ్యంగా ఎలా మారిందన్నది హీరో తెలుసుకునే విధానాన్ని కూడా డైరెక్టర్ చూపించిన తీరు బాగుంది.
నివిన్ పాలీ, రియా షిబు, అజు వర్గీస్ నటన సినిమాకు హైలైట్. మ్యూజిక్, బీజీఎం కూడా బాగుంది. మొత్తంగా ఈ సర్వం మాయ మొత్తం ఫ్యామిలీతో కలిసి చూడాల్సిన ఓ మస్ట్ వాచ్ మూవీ అని చెప్పొచ్చు. ఇప్పటికే జియోహాట్‌స్టార్ లో తెలుగులోనూ స్ట్రీమింగ్ అవుతున్న ఈ సినిమాను ఈ వీకెండ్ స్టార్ మాలో చూడొచ్చు. మరచిపోకండి.. ఆదివారం సాయంత్రం 6 గంటలకు.
తరచుగా అడిగే ప్రశ్నలు (FAQs)
1. 'సర్వం మాయ' వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ ఎప్పుడు?
ఈ చిత్రం ఏప్రిల్ 19 (ఆదివారం) సాయంత్రం 6 గంటలకు స్టార్ మా ఛానల్‌లో ప్రసారం కానుంది.
2. సర్వం మాయ సినిమా ఏ జోనర్‌కు చెందినది?
'సర్వం మాయ' ప్రధానంగా ఫ్యామిలీ డ్రామా, ఎమోషనల్ సెంటిమెంట్‌తో కూడిన హారర్ కామెడీ మూవీ.
3. సర్వం మాయ సినిమాను ఆన్‌లైన్‌లో చూడవచ్చా?
స్టార్ మాలో ప్రసారమయ్యే ఈ చిత్రాన్ని మీరు 'జియోహాట్‌స్టార్' యాప్‌లోనూ చూడొచ్చు.
ABOUT THE AUTHORHari Prasad Sహరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More

E-Paper


