Sarvam Maya Review: క్యూట్ దెయ్యంతో ఫ్రెండ్‌షిప్.. కంటతడి పెట్టించే క్లైమ్యాక్స్.. మలయాళ హారర్ కామెడీ ఎలా ఉందంటే?
మలయాళం హారర్ కామెడీ మూవీ సర్వం మాయ శుక్రవారమే (జనవరి 30) ఓటీటీలోకి వచ్చింది. తెలుగులోనూ స్ట్రీమింగ్ అవుతున్న ఈ సినిమా థియేటర్లలో బ్లాక్‌బస్టర్ రెస్పాన్స్ సొంతం చేసుకుంది. మరి నవ్విస్తూనే క్లైమ్యాక్స్ లో కంటతడి పెట్టించే ఈ మూవీ ఎలా ఉందో ఈ రివ్యూలో చూడండి.
హారర్ కామెడీ మూవీ అనగానే ఓ దెయ్యం.. భయపెడుతూనే నవ్వించే నెరేటివ్.. ఇవే గుర్తుకు వస్తాయి. కానీ మలయాళ హారర్ కామెడీ మూవీ సర్వం మాయ (Sarvam Maya) మాత్రం దీనికి పూర్తి భిన్నమైనది. ఓ క్యూట్ దెయ్యంతో ఓ మనిషి చేసే స్నేహం చుట్టూ తిరిగే కథతో ఆకట్టుకునే సినిమా ఇది.

సర్వం మాయ స్టోరీ ఏంటంటే?
సర్వం మాయ శుక్రవారమే (జనవరి 30) జియోహాట్‌స్టార్ ఓటీటీలోకి అడుగుపెట్టింది. మలయాళంతోపాటు తెలుగులోనూ స్ట్రీమింగ్ అవుతోంది. ఐఎండీబీలో 8 రేటింగ్ సొంతం చేసుకున్న ఈ సినిమాను అఖిల్ సత్యన్ డైరెక్ట్ చేశాడు. నివిన్ పాలీ లీడ్ రోల్లో నటించగా.. రియా షిబు ఇందులో డెలెలు అనే దెయ్యం పాత్రలో అదరగొట్టింది. అజు వర్గీస్, ప్రీతి ముకుందన్ కూడా కీలకపాత్రలు పోషించారు.
ఈ మూవీ స్టోరీ విషయానికి వస్తే ఇది ప్రభేందు నంబూద్రి అనే ఓ యువకుడు, అనుకోకుండా ఓ దెయ్యంతో అతడు చేసే స్నేహం చుట్టూ తిరుగుతుంది. ఓ సాంప్రదాయ బ్రాహ్మణ కుటుంబంలో పుట్టినా నాస్తికవాదిగా మారి, గొప్ప గిటారిస్ట్ కావాలనుకునే ప్రభేందు.. అనుకోని పరిస్థితుల్లో పూజలు పునస్కారాలు చేయాల్సిన పరిస్థితి వస్తుంది. ఈ క్రమంలోనే ఓ పిల్లాడికి పట్టిన దెయ్యాన్ని వదిలించడానికి వెళ్లి ఆ దెయ్యాన్ని తన వెంట తీసుకొస్తాడు.
ఆ క్యూట్ ఆడ దెయ్యం అతనితో స్నేహం చేస్తుంది. ఆమెకు డెలెలు అనే పేరు పెడతాడు. వీళ్ల స్నేహం ఎంత వరకూ వెళ్లింది? అది అతని కెరీర్ కు ఎలా తోడ్పడింది? అసలు ఆ దెయ్యం ఎవరు? అతని వెంట ఎందుకు పడింది అన్నదే ఈ సర్వం మాయ మిగిలిన కథ.
సర్వం మాయ ఎలా ఉందంటే?
సాధారణంగా హారర్ కామెడీ అనగానే ఓ భయపెట్టే దెయ్యం, దాని చుట్టూ అల్లుకునే కామెడీయే గుర్తుకు వస్తుంది. కానీ సర్వం మాయ మాత్రం అందుకు పూర్తి భిన్నంగా సాగుతుంది. దెయ్యంతో ఓ మనిషి చేసే స్నేహం అనేదే కొత్త కాన్సెప్ట్. అందులోనూ ఆ దెయ్యం ఓ క్యూట్ అమ్మాయి అయితే ఇంకెలా ఉంటుందో ఊహించుకోండి.
నిజానికి మూవీలో నివిన్ ది లీడ్ రోల్ అయినా.. డెలెలు పాత్ర పోషించిన రియా షిబునే ఎక్కువగా ఆకట్టుకుంటుంది. మూవీ సాగుతున్న కొద్దీ ప్రతి ప్రేక్షకుడు ఆ పాత్రతో ప్రేమలో పడతారు. ఈ ఇద్దరి మధ్య వచ్చే ప్రతి సీన్ చాలా హాయిగా అనిపిస్తుంది. ఫస్టాఫ్ మొత్తం కథ చాలా సరదాగా సాగిపోతుంది. సెకండాఫ్ కాస్త సాగదీసినట్లుగా అనిపించినా.. అసలు ఆ అమ్మాయి ఎవరు? ఎలా చనిపోయింది అన్న విషయాలు తెలుసుకోవాలనే కుతూహలం పెరిగిపోతూ ఉంటుంది.
చివరి 20 నిమిషాలు ఎమోషనల్‌గా..
ఇక సినిమా మొత్తం సరదాగా సాగిపోయినా.. చివరి 20 నిమిషాలు మాత్రం ఎమోషనల్ అవుతాం. ముఖ్యంగా డెలెలు ఫ్లాష్‌బ్యాక్, ఆమె చనిపోయిన తీరు కంటతడి పెట్టిస్తుంది. అసలు అంత చిన్న వయసులోనే ఆ అమ్మాయి దెయ్యంగా ఎలా మారిందన్నది హీరో తెలుసుకునే విధానాన్ని కూడా డైరెక్టర్ చూపించిన తీరు బాగుంది.
నివిన్ పాలీ, రియా షిబు, అజు వర్గీస్ నటన సినిమాకు హైలైట్. మ్యూజిక్, బీజీఎం కూడా బాగుంది. మొత్తంగా ఈ సర్వం మాయ మొత్తం ఫ్యామిలీతో కలిసి చూడాల్సిన ఓ మస్ట్ వాచ్ మూవీ అని చెప్పొచ్చు. జియోహాట్‌స్టార్ లో తెలుగులోనూ స్ట్రీమింగ్ అవుతున్న ఈ సినిమాను ఈ వీకెండ్ మిస్ కాకుండా చూడండి.
ABOUT THE AUTHORHari Prasad Sహరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More

E-Paper


