మలయాళం స్టార్ హీరోలు కూడా ఫిదా.. సంజూ శాంసన్‌పై ప్రశంసల వర్షం కురిపిస్తూ పోస్టులు.. ఇదీ అసలు కేరళ స్టోరీ అంటూ..

వెస్టిండీస్‌తో జరిగిన టీ20 వరల్డ్ కప్ సూపర్ 8 మ్యాచ్ లో కేరళ సంచలనం సంజూ శాంసన్ చరిత్రాత్మక ఇన్నింగ్స్‌తో భారత్‌ను సెమీఫైనల్‌కు చేర్చాడు. ఈ అద్భుత ప్రదర్శనపై మమ్ముట్టి, మోహన్ లాల్ వంటి మాలీవుడ్ దిగ్గజాలు సోషల్ మీడియా వేదికగా ప్రశంసలు కురిపిస్తున్నారు.

Published on: Mar 2, 2026, 14:32:29 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

టీ20 వరల్డ్ కప్ 2026లో భాగంగా వెస్టిండీస్‌తో జరిగిన ఉత్కంఠభరిత పోరులో టీమిండియా స్టార్ బ్యాటర్ సంజూ శాంసన్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. కోల్‌కతా వేదికగా జరిగిన ఈ 'వర్చువల్ క్వార్టర్ ఫైనల్' మ్యాచ్‌లో సంజూ వీరోచిత పోరాటంతో భారత్ ఐదు వికెట్ల తేడాతో విజయం సాధించి, సెమీఫైనల్లోకి అడుగుపెట్టింది. కేరళ ముద్దుబిడ్డ సాధించిన ఈ ఘనతపై మలయాళ చిత్ర పరిశ్రమ గర్వంతో ఉప్పొంగిపోతోంది. మోహన్ లాల్, మమ్ముట్టిలాంటి స్టార్లు కూడా సంజూని ప్రశంసల్లో ముంచెత్తారు.

మలయాళం స్టార్ హీరోలు కూడా ఫిదా.. సంజూ శాంసన్‌పై ప్రశంసల వర్షం కురిపిస్తూ పోస్టులు.. ఇదీ అసలు కేరళ స్టోరీ అంటూ.. (X/Reuters)
మలయాళం స్టార్ హీరోలు కూడా ఫిదా.. సంజూ శాంసన్‌పై ప్రశంసల వర్షం కురిపిస్తూ పోస్టులు.. ఇదీ అసలు కేరళ స్టోరీ అంటూ.. (X/Reuters)

స్టార్ హీరోల ప్రశంసలు

సంజూ శాంసన్ ఇన్నింగ్స్ ముగిసిన వెంటనే సోషల్ మీడియాలో మాలీవుడ్ ప్రముఖుల నుంచి అభినందనలు వెల్లువెత్తాయి. సూపర్ స్టార్ మోహన్ లాల్ స్పందిస్తూ.. "సంజూ శాంసన్ ఇంతటి ఫామ్‌లో ఉండటం చూడటం చాలా ఆనందంగా ఉంది. ఇది అతని ప్రతిభకు, వ్యక్తిత్వానికి నిదర్శనం. సెమీస్‌లోకి దూసుకెళ్లిన భారత జట్టుకు అభినందనలు" అని అన్నాడు.

మెగాస్టార్ మమ్ముట్టి సైతం సంజూ ఆట తీరును కొనియాడాడు. "నిజమైన క్లాస్.. అద్భుతమైన ఆధిపత్యం. ప్రపంచ వేదికపై ఒక భయం లేని ప్రదర్శన" అని సంజూను ఆకాశానికెత్తాడు.

యువ నటులు దుల్కర్ సల్మాన్, టోవినో థామస్, పృథ్వీరాజ్ సుకుమారన్ కూడా సంజూ ప్రదర్శనను ప్రశంసించారు. "వరల్డ్ కప్ వంటి పెద్ద వేదికపై, అత్యంత కీలకమైన మ్యాచ్‌లో ఇది అత్యుత్తమ టీ20 ఇన్నింగ్స్" అని పృథ్వీరాజ్ అభివర్ణించాడు.

ఇక తమిళ దర్శకుడు సి.ఎస్. అముదన్ విలక్షణంగా స్పందిస్తూ.. "ది కేరళ స్టోరీ: సంజూ శాంసన్ భారత్‌ను సెమీస్‌కు తీసుకెళ్లాడు" అంటూ గతంలో వివాదాస్పదమైన సినిమా టైటిల్‌ను సంజూ విజయానికి అన్వయిస్తూ ట్వీట్ చేయడం విశేషం. ప్రకాష్ రాజ్ కూడా సంజూకు కృతజ్ఞతలు తెలుపుతూ పోస్ట్ చేశాడు.

సంజూ 97 నాటౌట్

ఈ మ్యాచ్‌లో సంజూ శాంసన్ కేవలం 50 బంతుల్లోనే 97 పరుగులతో అజేయంగా నిలిచాడు. వెస్టిండీస్ బౌలర్లను ముప్పుతిప్పలు పెడుతూ టీమిండియాను ఒంటిచేత్తో గెలిపించాడు. తన విజయంపై సంజూ స్పందిస్తూ.. "నేను నా షాట్ సెలక్షన్‌పై చాలా వర్క్ చేశాను. నన్ను నేను నమ్మాను. ఈ కీలక సమయంలో సోషల్ మీడియాకు, ఫోన్‌కు దూరంగా ఉండి నా అంతరాత్మ చెప్పింది విన్నాను" అని మ్యాచ్ అనంతరం స్టార్ స్పోర్ట్స్‌తో తెలిపాడు.

సెమీఫైనల్లోకి దూసుకెళ్లిన టీమిండియా.. మార్చి 5న ముంబైలోని వాంఖడే స్టేడియంలో ఇంగ్లండ్‌తో తలపడనుంది. సంజూ ఇదే ఫామ్ కొనసాగిస్తే భారత్ ఫైనల్‌కు చేరడం ఖాయమని అభిమానులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

  • Hari Prasad S
    ABOUT THE AUTHOR
    Hari Prasad S

    హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More