ఓటీటీలో మలయాళ హారర్ థ్రిల్లర్ మూవీ దూకుడు.. ఎక్కువ వ్యూస్ సాధించిన టాప్ 5 మూవీస్ ఇవే.. లిస్టులో జాన్వీ, రష్మిక సినిమాలు
ఓటీటీల్లో గత వారం అంటే డిసెంబర్ 1 నుంచి 7 వరకు ఎక్కువ వ్యూస్ సాధించిన టాప్ 5 సినిమాల జాబితాను ఆర్మాక్స్ మీడియా రిలీజ్ చేసింది. వీటిలో జాన్వీ కపూర్, రష్మిక మందన్న నటించిన సినిమాలతోపాటు మలయాళ హారర్ థ్రిల్లర్ కూడా ఉండటం విశేషం.
ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ లో ప్రతి వారం కొత్తగా స్ట్రీమింగ్ అయ్యే సినిమాల్లో అత్యధిక వ్యూస్ సాధించిన టాప్ 5 మూవీస్ జాబితాను ఆర్మాక్స్ మీడియా రిలీజ్ చేస్తున్న విషయం తెలిసిందే. డిసెంబర్ 1 నుంచి 7 మధ్య కూడా అలాంటి మూవీస్ జాబితా వచ్చేసింది. వీటిలో జాన్వీ కపూర్ నటించిన లేటెస్ట్ మూవీ తొలి స్థానంలో ఉండటం విశేషం.

టాప్ 5 ఓటీటీ మూవీస్ ఇవే
ఓటీటీలోకి ఈ మధ్యే స్ట్రీమింగ్ కు వచ్చిన జాన్వీ కపూర్ రొమాంటిక్ కామెడీ మూవీ సన్నీ సంస్కారీ కీ తులసి కుమారి. నెట్‌ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతోంది. దీనికి థియేటర్లలో పెద్దగా రెస్పాన్స్ రాకపోయినా.. ఇప్పుడు ఓటీటీలో మాత్రం దూసుకెళ్తోంది. గత వారం ఎక్కువ వ్యూస్ సంపాదించిన సినిమా ఇదే కావడం విశేషం. 2.4 మిలియన్ వ్యూస్ వచ్చాయి.
కొన్ని వారాలుగా టాప్‌లో ఉంటూ వస్తున్న కాంతార ఛాప్టర్ 1ను వెనక్కి నెట్టేసిందీ సినిమా. అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతున్న కాంతార ప్రీక్వెల్ మూవీ 2 మిలియన్ల వ్యూస్ తో రెండో స్థానానికి పడిపోయింది.
రష్మిక, ప్రణవ్ సినిమాలు కూడా..
ఇక టాప్ 5లో మూడో స్థానంలో హాలీవుడ్ బ్లాక్‌బస్టర్ మూవీ మిషన్ ఇంపాజిబుల్ ఫైనల్ రెకనింగ్ ఉంది. గత వారమే ఈ సినిమా ప్రైమ్ వీడియోలోకి అడుగుపెట్టింది. దీనికి 1.6 మిలియన్ వ్యూస్ వచ్చాయి.
నాలుగో స్థానంలో రష్మిక మందన్న నటించిన ది గర్ల్‌ఫ్రెండ్ ఉంది. ఈ సినిమా నెట్‌ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతోంది. ఆ ఓటీటీలో టాప్ ట్రెండింగ్ సినిమాల్లో తొలి స్థానంలో ఉన్న ఈ మూవీకి 1.4 మిలియన్ వ్యూస్ రావడం విశేషం.
ఇక చివరిగా ఐదో స్థానంలో మలయాళ హారర్ థ్రిల్లర్ మూవీ డైస్ ఇరే ఉంది. మోహన్ లాల్ తనయుడు ప్రణవ్ మోహన్ లాల్ లీడ్ రోల్లో నటించిన సినిమా ఇది. జియోహాట్‌స్టార్లో స్ట్రీమింగ్ అవుతోంది. దీనికి 1.2 మిలియన్ వ్యూస్ వచ్చాయి. తెలుగులోనూ ఈ సినిమాను చూడొచ్చు.
టాప్ 5 వెబ్ సిరీస్ ఇవే
ఇక ఓటీటీల్లో స్ట్రీమింగ్ అవుతున్న వాటిలో ఎక్కువ వ్యూస్ వచ్చిన టాప్ 5 వెబ్ సిరీస్ జాబితాను కూడా ఆర్మాక్స్ మీడియా రిలీజ్ చేసింది. వీటిలో నెట్‌ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతున్న స్ట్రేంజర్ థింగ్స్ కు 5 మిలియన్ వ్యూస్ వచ్చాయి. రెండో స్థానంలో ప్రైమ్ వీడియోలో ఉన్న ది ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 3 ఉంది. దీనికి 4.3 మిలియన్ వ్యూస్ రావడం విశేషం.
మూడో స్థానంలో అమెజాన్ ఎంఎక్స్ ప్లేయర్ లో స్ట్రీమింగ్ అవుతున్న ఔకాత్ కే బాహర్ అనే సిరీస్ ఉంది. దీనికి 1.6 మిలియన్ వ్యూస్ వచ్చాయి. నాలుగో స్థానంలో ఉన్న ఢిల్లీ క్రైమ్ సీజన్ 3కి 1.5 మిలియన్ వ్యూస్.. ఐదో స్థానంలో ఉన్న మహాభారత్: ఏక్ ధర్మ్‌యుద్ధ్ కి 1.4 మిలియన్ వ్యూస్ నమోదయ్యాయి. ఇవి నెట్‌ఫ్లిక్స్, జియోహాట్‌స్టార్ లలో స్ట్రీమింగ్ అవుతున్నాయి.














