Netflix Movie: ఈ సినిమాను పూర్తి చేయడానికి 48 ఏళ్లు పట్టింది.. చివరికి నెట్‌ఫ్లిక్స్‌లో రిలీజ్..

Netflix Movie: నెట్‌ఫ్లిక్స్ లో 2018లో రిలీజైన ఓ సినిమాను పూర్తి చేయడానికి ఏకంగా 48 ఏళ్లు పట్టిందన్న విషయం మీకు తెలుసా? 1970లో షూటింగ్ మొదలు కాగా.. మొత్తానికి 2018లో నేరుగా నెట్‌ఫ్లిక్స్ లోకి స్ట్రీమింగ్ కు వచ్చిన ఈ సినిమా విశేషాలు మీకోసం.

Published on: Mar 21, 2026, 09:39:36 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

సినిమాలు తీసేటప్పుడు ఒక్కోసారి రకరకాల కష్టాలు ఎదురవుతూ ఉంటాయి. ఆ సమస్యల వల్ల సినిమా థియేటర్లలోకి రావడానికి బాగా ఆలస్యం అవుతుంటుంది. కానీ ఒక హాలీవుడ్ సినిమా రిలీజ్ అవ్వడానికి ఏకంగా 48 ఏళ్లు పట్టిందని మీకు తెలుసా? అవును మీరు విన్నది అక్షరాలా నిజం. 1970లో మొదలైన ఈ సినిమా ఎన్నో అడ్డంకులు దాటుకుని చివరికి 2018లో నెట్‌ఫ్లిక్స్‌లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అసలు ఆ సినిమా పేరు ఏంటి, దాన్ని పూర్తి చేయడానికి ఇన్ని దశాబ్దాల కాలం ఎందుకు పట్టిందో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.

Netflix Movie: ఈ సినిమాను పూర్తి చేయడానికి 48 ఏళ్లు పట్టింది.. చివరికి నెట్‌ఫ్లిక్స్‌లో రిలీజ్..
Netflix Movie: ఈ సినిమాను పూర్తి చేయడానికి 48 ఏళ్లు పట్టింది.. చివరికి నెట్‌ఫ్లిక్స్‌లో రిలీజ్..

ది అదర్ సైడ్ ఆఫ్ ద విండ్ మూవీ

మనం మాట్లాడుకుంటున్న ఆ హాలీవుడ్ సినిమా పేరు ది అదర్ సైడ్ ఆఫ్ ద విండ్. ఐఎండీబీ లెక్కల ప్రకారం ఈ సినిమాను 1970లో మొదలుపెట్టారు. ప్రఖ్యాత దర్శకుడు ఆర్సన్ వెల్స్ దీనికి దర్శకత్వం వహించాడు. అయితే కొన్నాళ్లకే ఈ సినిమా షూటింగ్ ఆగిపోయింది. దానికి కారణం అప్పటి అమెరికా ప్రభుత్వం ఆయన కంపెనీ మీద భారీగా పన్నులు వేయడమే.

ఆ పన్నులు కట్టడానికి, తన ప్రాజెక్టుకు అవసరమైన డబ్బులు సమకూర్చుకోవడం కోసం ఆయన వేరే సినిమాల మీద పనిచేశాడు. అలా మళ్లీ 1974లో ఈ సినిమా షూటింగ్ తిరిగి మొదలైంది. ఈ ప్రాజెక్టుకు డబ్బులు పెట్టమని వెల్స్ తన తోటి స్నేహితులను అడిగాడు. కానీ హాలీవుడ్‌లో చాలామంది దీన్ని ఒక కర్స్‌డ్ సినిమాగా భావించి దూరంగా ఉన్నారు. అయినా సరే వెల్స్ ఎలాగోలా కొంతమందిని ఒప్పించి సినిమా ముందుకు తీసుకెళ్లాడు.

దర్శకుడి మరణం, ఆగిపోయిన పనులు

1976 నాటికి ఈ సినిమా షూటింగ్ మొత్తం పూర్తయింది. ఆ తర్వాత ఎడిటింగ్ పనులు మొదలయ్యాయి. అవి ఏకంగా 1980ల వరకు జరుగుతూనే ఉన్నాయి. దురదృష్టవశాత్తూ 1985లో దర్శకుడు ఆర్సన్ వెల్స్ మరణించాడు. చనిపోయే నాటికి ఆయన దాదాపు వంద గంటల పాటు ఎడిట్ చేయని రీల్స్ వదిలేసి వెళ్ళాడు.

అయితే ఆయనకు ముందే ఏదో అనుమానం వచ్చిందేమో కానీ, మిగతా వాళ్లు ఆ సినిమాను పూర్తి చేయడానికి వీలుగా తను సినిమాను ఎలా తీయాలనుకున్నాడో దానికి సంబంధించిన పూర్తి వివరాలను ఆయన రాసిపెట్టాడు.

హక్కులు కొనేసిన నెట్‌ఫ్లిక్స్

దర్శకుడు చనిపోయాక ఈ సినిమాకు చాలామంది పెట్టుబడిదారులు ఉండటంతో హక్కుల విషయంలో పెద్ద గొడవలు వచ్చాయి. ఎవరికి వారు నాదంటే నాది అనడంతో ఈ సినిమా చాలా ఏళ్ల పాటు డబ్బాల్లోనే మగ్గిపోయింది.

చివరికి 2017లో నెట్‌ఫ్లిక్స్ సంస్థ ఈ సినిమా హక్కులన్నింటినీ కొనేసింది. దర్శకుడు వెల్స్ ఎలాగైతే ఈ సినిమాను ప్రేక్షకులకు చూపించాలనుకున్నాడో అచ్చం అలాగే పూర్తి చేయడానికి వాళ్లు రాత్రింబవళ్లు కష్టపడి పనిచేశారు.

సినిమా కథ, రేటింగ్ వివరాలు

ఎట్టకేలకు 2018లో ఈ సినిమా నెట్‌ఫ్లిక్స్‌లో రిలీజ్ అయింది. దీనికి ఐఎండీబీలో 6.7 రేటింగ్ దక్కింది. ఇది కేవలం పెద్దవాళ్లు మాత్రమే చూసే రేటింగ్ ఉన్న సినిమా. దీని నిడివి రెండు గంటల రెండు నిమిషాలు ఉంది. ఇక ఈ సినిమా కథ విషయానికి వస్తే.. మళ్లీ సినిమాల్లోకి గట్టిగా తిరిగి రావాలనుకునే ఒక పాత దర్శకుడి చుట్టూ ఈ కథ తిరుగుతుంది.

అతను తన 70వ పుట్టినరోజు నాడు, ఇంకా పూర్తి కాని తన కొత్త సినిమాను చూపించడానికి విమర్శకులను, మీడియాని, తన పాత స్నేహితులను ఒక చోటికి పిలుస్తాడు. ఆ తర్వాత అక్కడ ఏం జరిగింది, ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి అనేది ఈ సినిమా కథ. ఇందులో జాన్ హస్టన్, ఓజా కోడర్, పీటర్ బోగ్డానోవిచ్ లాంటి వాళ్లు ముఖ్య పాత్రలు పోషించారు.

  • Hari Prasad S
    ABOUT THE AUTHOR
    Hari Prasad S

    హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More