Netflix Web Series: నెట్‌ఫ్లిక్స్‌లోకి మరో క్రేజీ కామెడీ వెబ్ సిరీస్.. ఈరోజు నుంచే స్ట్రీమింగ్.. తెలుగులోనూ అందుబాటులో..
Netflix Web Series: నెట్‌ఫ్లిక్స్ లోకి గురువారం (సెప్టెంబర్ 10) ఓ క్రేజీ కామెడీ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ కు వచ్చింది. మూడు వారాలు ఆలస్యంగా రిలీజైన ఈ సిరీస్ ఐదు కుటుంబాల చుట్టూ తిరుగుతుంది. ఆ సిరీస్ ఏంటి? దాని విశేషాలేంటో ఇక్కడ చూడండి.
Netflix Web Series: నెట్‌ఫ్లిక్స్ లోకి చుంబక్ అనే సరికొత్త కామెడీ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ కు వచ్చింది. ఒకే కాలనీలో నివసించే ఐదు కుటుంబాల మధ్య జరిగే వినోదాత్మక సంఘటనల నేపథ్యంలో తెరకెక్కిన మల్టీ-జనరేషన్ కామెడీ డ్రామా సిరీస్ ఈ 'చుంబక్' (Chumbak). ఈరోజు అంటే సెప్టెంబర్ 10 మధ్యాహ్నం 12:30 గంటల నుంచి నెట్‌ఫ్లిక్స్ (Netflix) వేదికగా ప్రపంచవ్యాప్తంగా స్ట్రీమింగ్ అవుతోంది. హిందీతోపాటు తెలుగు, తమిళం, ఇంగ్లిష్ భాషల్లో అందుబాటులోకి వచ్చింది.

చుంబక్ వెబ్ సిరీస్ విశేషాలు
'సారాభాయ్ వర్సెస్ సారాభాయ్', 'ఖిచ్డీ' వంటి పాపులర్ కామెడీ షోలను అందించిన హ్యాట్సాఫ్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ఆతిష్ కపాడియా దర్శకత్వంలో ఈ వెబ్ సిరీస్ రూపొందింది. సీనియర్ నటి నీనా గుప్తా, దేవన్ భోజానీ, సుమీత్ వ్యాస్, అర్జున్ బిజ్లానీ, హెల్లీ షా, మనాసి పరేఖ్ ప్రధాన పాత్రల్లో నటించారు.
వాస్తవానికి ఈ వెబ్ సిరీస్ ఆగస్టు 28నే విడుదల కావాల్సి ఉండగా.. కొన్ని ప్రమోషనల్ ఈవెంట్స్ లో మార్పులు చేర్పుల వల్ల దాదాపు రెండు వారాల పాటు వాయిదా పడింది. ఎట్టకేలకు సెప్టెంబర్ 10 మధ్యాహ్నం 12:30 గంటల నుంచి నెట్‌ఫ్లిక్స్ వేదికగా భారత్‌తో పాటు ప్రపంచవ్యాప్తంగా అందుబాటులోకి వచ్చింది. స్థానిక అర్ధరాత్రి సమయానికి కాకుండా, నెట్‌ఫ్లిక్స్ గ్లోబల్ రిలీజ్ షెడ్యూల్‌ను అనుసరించి మధ్యాహ్న సమయానికి ఈ షో స్ట్రీమింగ్ ప్రారంభమైంది.
చుంబక్ సిరీస్ స్టోరీ ఏంటంటే?
ఒకప్పుడు మన ఇరుగుపొరుగు ఇళ్ల మధ్య ఉండే ఆప్యాయతలు, పరిచయాలు, చిన్న చిన్న గొడవలు, వినోదాన్ని ప్రతిబింబించేలా ఈ కథను తీర్చిదిద్దారు. ఒక అర్బన్ ఏరియా కాలనీలోని ఐదు విభిన్న కుటుంబాల చుట్టూ ఈ కథ తిరుగుతుంది. ప్రైవసీ అనేది దాదాపుగా కనిపించని ఆ వాతావరణంలో.. ప్రతి చిన్న ఇంట్లోని విషయమూ మొత్తం సొసైటీకి సంబంధించిన పెద్ద అంశంగా మారిపోతుంటుంది.
ఒకరి ఇంట్లోని చిన్న సమస్యకు మరో ఇరుగుపొరుగు వారు ఇచ్చే ఉచిత సలహాలు, హంగామా నవ్వులు పూయిస్తాయి. ఒకప్పడు మన కష్టసుఖాల్లో పొరుగువారు ఒకే కుటుంబంలా ఎలా తోడుండేవారో ఈ వెబ్ సిరీస్ ఆ నోస్టాల్జిక్ ఫీలింగ్ తో చూపిస్తుంది.
చుంబక్ వెబ్ సిరీస్ నటీనటులు, ఇతర విశేషాలు
ఈ వెబ్ సిరీస్‌ను జమ్నాదాస్ (జెడి) మజేతియా, ఆతిష్ కపాడియా సంయుక్తంగా నిర్మించగా, ఆతిష్ కపాడియా దర్శకత్వం వహించారు. బుల్లితెరపై ఎన్నో సక్సెస్‌ఫుల్ కామెడీ డ్రామాలను అందించిన అనుభవం వీరి సొంతం.
ఈ చుంబక్ వెబ్ సిరీస్ లో సీనియర్ నటీనటులు చాలా మందే ఉన్నారు. బాలీవుడ్ సీనియర్ నటి నీనా గుప్తా, దేవన్ భోజానీ ఇందులో ప్రధాన నటీనటులుగా కనిపించారు. ఈ జంట చేసే కామెడీ నవ్వులు పూయించనుంది.
ఈ ఇద్దరూ కాకుండా సుమీత్ వ్యాస్, మనాసి పరేఖ్, అర్జున్ బిజ్లానీ, హెల్లీ షా, దెల్నాజ్ ఇరానీ, సుమీత్ రాఘవన్ తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఫ్యామిలీ ప్రేక్షకులు అందరినీ ఆకట్టుకునేలా రూపొందిన ఈ కామెడీ ఎంటర్‌టైనర్‌ను ఈ వీకెండ్ నెట్‌ఫ్లిక్స్‌లో చూసేయండి మరి.
ABOUT THE AUTHORHari Prasad Sహరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More

E-Paper


