...
...
Next Story

Netflix Web Series: ఇటు భర్త.. అటు ప్రియుడు.. నెట్‌ఫ్లిక్స్‌లోకి మరో రొమాంటిక్ వెబ్ సిరీస్.. ట్రైలర్ రిలీజ్

Netflix Web Series: సున్నితమైన ప్రేమకథలు, సంక్లిష్టమైన మానవ సంబంధాలను తెరకెక్కించడంలో దిట్ట అయిన ఇంతియాజ్ అలీ రూపొందించిన సరికొత్త వెబ్ సిరీస్ ‘ఓ సాథీ రే’ ట్రైలర్ విడుదలైంది. అదితి రావు హైదరీ, అవినాష్ తివారీ, అర్జున్ రాంపాల్ నటించిన ఈ సిరీస్ డిసెంబర్ 4 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది.

Published on: Nov 25, 2026, 15:42:02 IST
Advertisement

Netflix Web Series: 'జబ్ వి మెట్', 'రాక్‌స్టార్', 'తమాషా' వంటి కల్ట్ ప్రేమకథలతో భారతీయ ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేసిన ప్రముఖ ఫిల్మ్ మేకర్ ఇంతియాజ్ అలీ మరోసారి తన మార్క్ ఎమోషనల్ డ్రామాతో ఓటీటీ ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధమయ్యారు. ఆయన క్రియేటర్, షోరన్నర్‌గా వ్యవహరించిన సరికొత్త నెట్‌ఫ్లిక్స్ ఒరిజినల్ వెబ్ సిరీస్ 'ఓ సాథీ రే' (O Saathi Re) అఫీషియల్ ట్రైలర్ తాజాగా విడుదలైంది.

Netflix Web Series: ఇటు భర్త.. అటు ప్రియుడు.. నెట్‌ఫ్లిక్స్‌లోకి మరో రొమాంటిక్ వెబ్ సిరీస్.. ట్రైలర్ రిలీజ్
Netflix Web Series: ఇటు భర్త.. అటు ప్రియుడు.. నెట్‌ఫ్లిక్స్‌లోకి మరో రొమాంటిక్ వెబ్ సిరీస్.. ట్రైలర్ రిలీజ్

హైదరాబాదీ సొగసరి, నటుడు సిద్ధార్థ్ భార్య అయిన అదితి రావు హైదరీ, ప్రతిభావంతుడైన నటుడు అవినాష్ తివారీ, బాలీవుడ్ హ్యాండ్సమ్ హీరో అర్జున్ రాంపాల్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సిరీస్ ట్రైలర్ విడుదలైన క్షణాల్లోనే సినీ ప్రియులను విశేషంగా ఆకట్టుకుంటోంది.

'ఓ సాథీ రే' ట్రైలర్ ఎలా ఉంది? ట్రయాంగిల్ లవ్ స్టోరీలో కొత్త కోణం

సాధారణ ట్రయాంగిల్ లవ్ స్టోరీలకు భిన్నంగా, 'అసలు ప్రేమ అంటే ఏమిటి?' అనే లోతైన ప్రశ్నను ఈ ట్రైలర్ లేవనెత్తుతోంది. ట్రైలర్‌లో రోష్ని (అదితి రావు హైదరీ), కరణ్ (అవినాష్ తివారీ) భార్యాభర్తలుగా కనిపిస్తారు. వీరి వైవాహిక జీవితం బీటలు వారి, విడాకుల దిశగా సాగుతుంటుంది.

రోష్ని లేని జీవితాన్ని కరణ్ ఊహించుకోలేకపోతుంటే, రోష్ని మాత్రం తన సొంత గుర్తింపు, ఆనందం కోసం వెతుకుతుంటుంది. సరిగ్గా అదే సమయంలో ప్రద్యుమన్ (అర్జున్ రాంపాల్) ఆమె జీవితంలోకి ప్రవేశిస్తాడు. ప్రద్యుమన్ పట్ల రోష్ని ఆకర్షితురాలు కావడంతో ఈ ముగ్గురి జీవితాలు ఊహించని మలుపు తిరుగుతాయి.

మనం నిజంగా ప్రేమించిన వ్యక్తిని ఎప్పటికీ మనతోనే ఉంచుకోవాలనుకోవడం ప్రేమా? లేక వారి సంతోషం కోసం వారిని వదిలేయడం నిజమైన ప్రేమా? అనే భావోద్వేగ సంఘర్షణ ట్రైలర్ ఆద్యంతం కట్టిపడేస్తుంది.

ఇంతియాజ్ అలీ, నటీనటులు ఏమన్నారంటే?

“ఇది పాతకాలపు హృదయం ఉన్న ఆధునిక ప్రేమకథ. ఒక బంధం విడిపోయినప్పుడు అక్కడ కేవలం చేదు మాత్రమే ఉండదు.. లోపల ఎక్కడో ప్రేమ మిగిలే ఉంటుంది” అని ఆయన పేర్కొన్నారు.

తన పాత్ర గురించి అదితి రావు హైదరీ మాట్లాడుతూ.. “రోష్ని ఇప్పటివరకు ఒక కూతురిగా, భార్యగా, సోదరిగా ఇతరుల కోసమే బతికింది. ఇప్పుడు తనకంటూ ఒక వ్యక్తిత్వాన్ని వెతుక్కునే క్రమంలో ఆమె తీసుకునే నిర్ణయాలు, వాటి వల్ల ఎదురయ్యే భావోద్వేగాలే ఈ పాత్ర ప్రత్యేకత” అని చెప్పారు.

కరణ్ పాత్రలో భార్యపై అమితమైన ప్రేమ, అదే సమయంలో అభద్రతాభావం ఉన్న భర్తగా నటించడం ఎంతో సవాలుగా అనిపించిందని అవినాష్ తివారీ తెలిపారు. ఇక రోష్నిని ఒక స్వతంత్ర వ్యక్తిగా చూసే ఆత్మవిశ్వాసం గల వ్యక్తి ప్రద్యుమన్ పాత్రలో నటించడం కొత్త అనుభూతినిచ్చిందని అర్జున్ రాంపాల్ వివరించారు.

డిసెంబర్ 4న నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్

ఆరిఫ్ అలీ దర్శకత్వం వహించిన ఈ ఆరు ఎపిసోడ్ల వెబ్ సిరీస్‌కు ఇంతియాజ్ అలీ, అమోఘ్ కనస్కర్, నిధి సేథియా కథను అందించారు. విండో సీట్ ఫిల్మ్స్ పతాకంపై ఇంతియాజ్ అలీ, మోహిత్ చౌదరి, శిబాశిష్ సర్కార్ నిర్మించిన ‘ఓ సాథీ రే’ వెబ్ సిరీస్ డిసెంబర్ 4, 2026 నుంచి ప్రముఖ ఓటీటీ వేదిక నెట్‌ఫ్లిక్స్ (Netflix)లో స్ట్రీమింగ్ కానుంది.

 

ABOUT THE AUTHOR

హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks