థియేటర్లు మూత పడతాయి.. ఉద్యోగాలు పోతాయి.. ఈ డీల్‌ వినాశకరమైనదే: నెట్‌ఫ్లిక్స్, వార్నర్ బ్రదర్స్ డీల్‌పై జేమ్స్ కామెరాన్

నెట్‌ఫ్లిక్స్, వార్నర్ బ్రదర్స్ డీల్ పై అవతార్ డైరెక్టర్ జేమ్స్ కామెరాన్ సంచలన కామెంట్స్ చేశాడు. దీనివల్ల థియేటర్ల బిజినెస్ దెబ్బ తింటుందని, అవి మూతపడి ఉద్యోగాలు పోతాయని అతడు అనడం గమనార్హం.

Published on: Feb 21, 2026, 09:28:28 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ప్రపంచంలోని అతిపెద్ద మూవీ స్టూడియోలలో ఒకటైన వార్నర్ బ్రదర్స్‌ను నెట్‌ఫ్లిక్స్ కొనుగోలు చేయడానికి చేసిన ప్రతిపాదనకు వ్యతిరేకంగా హాలీవుడ్ ప్రముఖ ఫిల్మ్ మేకర్ జేమ్స్ కామెరాన్ అమెరికన్ సెనేటర్ మైక్ లీకి ఒక లేఖ రాశారు. అవతార్, టైటానిక్, ది టెర్మినేటర్ వంటి బ్లాక్‌బస్టర్ సినిమాల దర్శకుడైన కామెరాన్.. ఈ కొనుగోలు సినిమా వ్యాపారానికి 'వినాశకరం' అని పేర్కొనడం గమనార్హం.

థియేటర్లు మూత పడతాయి.. ఉద్యోగాలు పోతాయి.. ఈ డీల్‌ వినాశకరమైనదే: నెట్‌ఫ్లిక్స్, వార్నర్ బ్రదర్స్ డీల్‌పై జేమ్స్ కామెరాన్ (REUTERS)
థియేటర్లు మూత పడతాయి.. ఉద్యోగాలు పోతాయి.. ఈ డీల్‌ వినాశకరమైనదే: నెట్‌ఫ్లిక్స్, వార్నర్ బ్రదర్స్ డీల్‌పై జేమ్స్ కామెరాన్ (REUTERS)

జేమ్స్ కామెరాన్ వార్నింగ్

సెనేట్ సబ్‌కమిటీ ఆన్ యాంటీట్రస్ట్‌కు చైర్‌గా ఉన్న సెనేటర్ లీకి రాసిన లేఖలో.. ఈ ప్రతిపాదిత కొనుగోలు గనక పూర్తయితే అమెరికాలో, ప్రపంచవ్యాప్తంగా సినిమా నిర్మాణ వ్యాపారానికి వినాశకరమైన పరిస్థితులు ఏర్పడతాయని జేమ్స్ కామెరాన్ అంచనా వేశాడు.

"వార్నర్ బ్రదర్స్ డిస్కవరీని నెట్‌ఫ్లిక్స్‌కు విక్రయించాలనే ప్రతిపాదన థియేట్రికల్ మోషన్ పిక్చర్ వ్యాపారానికి వినాశకరంగా మారుతుందని నేను బలంగా నమ్ముతున్నాను. ఈ సినిమా వ్యాపారానికే నా జీవిత కాలాన్ని అంకితం చేశాను. అయితే నా సినిమాలు తదుపరి దశలో వీడియో మార్కెట్‌లలో కూడా ప్లే అవుతాయి. కానీ నా మొదటి ప్రేమ ఎప్పుడూ సినిమానే" అని వెరైటీ (Variety) బయటపెట్టిన ఆ లేఖలో కామెరాన్ రాశాడు.

థియేటర్లు మూతపడతాయి

చరిత్రలో అత్యంత విజయవంతమైన ఫిల్మ్ మేకర్స్‌లో జేమ్స్ కామెరాన్ ఒకరు. అతడు ఐకానిక్ టెర్మినేటర్ ఫ్రాంచైజీతో పాటు నాలుగు బిలియన్ డాలర్ల హిట్లను ఇచ్చారు. భారీ బడ్జెట్ సినిమాల నిర్మాణం గనక తగ్గితే అది తీవ్రమైన పరిణామాలకు దారితీస్తుందని అతడు హెచ్చరించాడు. "థియేటర్లు మూతపడతాయి. తక్కువ సినిమాలు నిర్మిస్తారు. ఉద్యోగాలు పెద్ద మొత్తంలో పోతాయి" అని దర్శకుడు ఆ లేఖలో హెచ్చరించాడు.

ప్రపంచంలోనే అతిపెద్ద స్ట్రీమింగ్ సర్వీస్ అయిన నెట్‌ఫ్లిక్స్ ఎప్పటినుంచో 'స్ట్రీమింగ్-ఫస్ట్' వ్యాపార నమూనాను కలిగి ఉంది. అయితే ఇది సాంప్రదాయ థియేట్రికల్ వ్యవస్థకు విరుద్ధంగా ఉంటుందని కామెరాన్ వాదించాడు.

“నెట్‌ఫ్లిక్స్ బిజినెస్ ప్లాన్, వందల వేల మంది అమెరికన్లకు ఉపాధి కల్పిస్తున్న థియేట్రికల్ ఫిల్మ్ ప్రొడక్షన్, ఎగ్జిబిషన్ వ్యాపారానికి పూర్తి విరుద్ధంగా ఉంది. అందువల్ల ఇది ఇంకా మిగిలి ఉన్న అతికొద్ది ప్రధాన మూవీ స్టూడియోలలో ఒకటైన వార్నర్ బ్రదర్స్ సినిమా విభాగం వ్యాపార నమూనాకు కూడా పూర్తి విరుద్ధంగా ఉంది” అని అతడు రాసినట్లు వెరైటీ పేర్కొంది.

“అమెరికా ఇకపై ఆటో లేదా స్టీల్ తయారీ రంగాల్లో అగ్రస్థానంలో ఉండొచ్చు, ఉండకపోవచ్చు. కానీ సినిమాల్లో ఇప్పటికీ ప్రపంచంలోనే అగ్రగామిగా ఉంది. అది కూడా ఇకపై అధ్వాన్నంగా మారుతుంది” అని అతడు వాదించాడు.

సెనేటర్ లీ స్పందన

సెనేటర్ లీ ఒక ప్రకటనలో ఈ ప్రముఖ డైరెక్టర్ వ్యక్తం చేసిన ఆందోళనలపై స్పందించారు. “ప్రతిపాదిత నెట్‌ఫ్లిక్స్, వార్నర్ బ్రదర్స్ విలీనం గురించి నటీనటులు, దర్శకులు, ఆసక్తి ఉన్న ఇతర వర్గాల నుండి మాకు విజ్ఞప్తులు అందాయి. వారి ఆందోళనలతో నేను కూడా ఏకీభవిస్తున్నాను. ఈ సమస్యలను మరింతగా పరిష్కరించేందుకు ఫాలో-అప్ హియరింగ్ నిర్వహించడానికి నేను ఎదురుచూస్తున్నాను” అని అన్నారు.

భయాలను కొట్టిపారేసిన నెట్‌ఫ్లిక్స్

ఈ ఆందోళనలపై నెట్‌ఫ్లిక్స్ స్పందించింది. నెట్‌ఫ్లిక్స్ కో-చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అయిన టెడ్ సరాండోస్ మాట్లాడుతూ.. తమ కంపెనీ వార్నర్ బ్రదర్స్ డిస్కవరీని కొనుగోలు చేయడం వల్ల థియేటర్లలోకి మరిన్ని సినిమాలు వస్తాయని చెప్పారు.

నెట్‌ఫ్లిక్స్, వార్నర్ బ్రదర్స్ విలీనం అనేది "థియేటర్లకు మరింత మేలు చేస్తుంది". ఎందుకంటే వార్నర్ బ్రదర్స్ నిర్మించిన డిస్ట్రిబ్యూషన్ నెట్‌వర్క్‌ను ఉపయోగించి నెట్‌ఫ్లిక్స్ తన సినిమాలను తీసుకువెళ్లి థియేటర్లలో విడుదల చేయగలుగుతుందని బ్లూమ్‌బెర్గ్ టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో సరాండోస్ అన్నారు.

  • Hari Prasad S
    ABOUT THE AUTHOR
    Hari Prasad S

    హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More