Netflix Web Series: నెట్‌ఫ్లిక్స్‌లోకి సిద్ధార్థ్ ఇంగ్లిష్ వెబ్ సిరీస్.. పాత ప్రేయసి తిరిగొస్తే.. ట్రైలర్ రిలీజ్
Netflix Web Series: ప్రసిద్ధ రచయిత్రి ఝుంపా లాహిరి కథల సంకలనం ఆధారంగా తెరకెక్కిన ప్రతిష్టాత్మక వెబ్ సిరీస్ 'అనకస్టమ్‌డ్ ఎర్త్' (Unaccustomed Earth) ట్రైలర్‌ను నెట్‌ఫ్లిక్స్ తాజాగా విడుదల చేసింది. హాలీవుడ్ నటి ఫ్రీదా పింటో, వర్సటైల్ యాక్టర్ సిద్ధార్థ్ కాంబినేషన్లో ఈ 8 ఎపిసోడ్ల సిరీస్ రానుంది.
Netflix Web Series: పుస్తక ప్రియులు ఎంతోగానో ఆరాధించే ప్రముఖ రచయిత్రి ఝుంపా లాహిరి 2008లో రాసిన అంతర్జాతీయ ఉత్తమ నవలా సంకలనం 'అనకస్టమ్‌డ్ ఎర్త్' (Unaccustomed Earth) ఇప్పుడు వెబ్ సిరీస్ రూపంలో వస్తోంది.

ప్రముఖ డిజిటల్ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్ (Netflix) దీనిని 8 ఎపిసోడ్ల లిమిటెడ్ ఫ్యామిలీ డ్రామా సిరీస్‌గా మలచగా, తాజాగా విడుదలైన ఈ సిరీస్ ట్రైలర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. హాలీవుడ్‌లో గుర్తింపు పొందిన భారతీయ నటి ఫ్రీదా పింటో, దక్షిణాది నటుడు సిద్ధార్థ్ ఇందులో ప్రధాన పాత్రలు పోషించారు.
స్టోరీ, ట్రైలర్ ఇలా..
ఈ వెబ్ సిరీస్ ట్రైలర్ ప్రకారం.. ఫ్రీదా పింటో 'పారుల్ చౌదరి' అనే ఇండియన్-అమెరికన్ వివాహిత పాత్రలో కనిపించారు. ఒక బాధ్యతాయుతమైన తల్లిగా జీవితాన్ని కొనసాగిస్తున్న పారుల్‌కు ఊహించని విధంగా క్యాన్సర్ వ్యాధి ఉన్నట్లు తేలుతుంది. ఈ నిజం తెలుసుకున్న తర్వాత, ఆమె ముంబై నుంచి అమెరికాలోని కేంబ్రిడ్జ్‌లోని తన పాత జీవితంలోకి తిరిగి వెళ్తుంది.
అక్కడే ఆమెకు తన గతం, మరిచిపోయిన పాత ప్రేమ ఎదురవుతాయి. తన మాజీ ప్రియుడి పాత్రలో నటుడు సిద్ధార్థ్ కనిపిస్తారు. చాలా ఏళ్ల తర్వాత వీరిద్దరూ మళ్లీ కలుసుకోవడంతో.. వాళ్ల మధ్య ఉన్న ఆ పాత జ్ఞాపకాలు, ఎమోషన్స్ మళ్లీ బయటకు వస్తాయి. ఈ పరిణామాలు పారుల్ వ్యక్తిగత జీవితంలో, ఆమె కుటుంబ బంధాల్లో ఎలాంటి సంక్షోభాన్ని సృష్టించాయనేది కథనంలో అత్యంత నాటకీయంగా చూపించారు.
ఫ్రీదా పింటో మాటల్లో సిరీస్ ప్రత్యేకత
ఈ వెబ్ సిరీస్ గురించి ఫ్రీదా పింటో మాట్లాడుతూ.. ఇండియన్-అమెరికన్ బెంగాలీ కుటుంబాల జీవన విధానం, సాంప్రదాయాలు, ఆహారపు అలవాట్లను ఈ వెబ్ సిరీస్ ఎంతో అద్భుతంగా ఆవిష్కరిస్తుందని తెలిపారు.
"దక్షిణాసియా అమెరికన్ సమాజం సంస్కృతిని, వారి కుటుంబాల మధ్య ఉండే బలమైన అనుబంధాలను, వారు ఎదుర్కొనే సమస్యలను ఇంత లోతుగా టీవీ తెరపై ఇప్పటివరకు చూపించలేదు. ప్రతి పాత్రలోనూ ఒక యూనివర్సల్ ఎమోషన్ ఉంటుంది. తనకిష్టమైన కలల జీవితాన్ని జీవించడానికి ఒక వ్యక్తి ఎంతదూరమైనా వెళ్తాడా? దానికి ఎదురయ్యే పరిణామాలను ఎదుర్కొనే ధైర్యం ఉందా? అనే ప్రశ్నకు పారుల్ పాత్ర సమాధానంగా నిలుస్తుంది" అని ఫ్రీదా వివరించారు.
అనకస్టమ్‌డ్ ఎర్త్ వెబ్ సిరీస్ విశేషాలు
ఈ 8 ఎపిసోడ్ల ఫ్యామిలీ డ్రామాను '3 బాడీ ప్రాబ్లమ్', 'ది నీవర్స్' చిత్రాల రచయిత్రి మధురి శేఖర్ సృష్టించారు. ఫ్రీదా పింటో, సిద్ధార్థ్ తోపాటు సరయూ బ్లూ, ఇంద్రనీల్ సేన్‌గుప్తా, ఆది రాయ్, ఐలా సుందర్‌సింగ్ లాంటి వాళ్లు నటించారు. ఇర్ఫాన్ ఖాన్ క్లాసిక్ మూవీ 'ది లంచ్ బాక్స్' చిత్ర దర్శకుడు రితేష్ బాత్రా ఈ సిరీస్‌కు మొదటి రెండు ఎపిసోడ్లకు దర్శకత్వం వహించడంతో పాటు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా వ్యవహరించారు. జాన్ వెల్స్ ప్రొడక్షన్స్, వార్నర్ బ్రదర్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మించాయి.
గతంలో ఝుంపా లాహిరి రాసిన 'ది నేమ్‌సేక్' (The Namesake) పుస్తకాన్ని దర్శకురాలు మీరా నాయర్ ఇర్ఫాన్ ఖాన్, టబు ప్రధాన పాత్రలతో సినిమాగా తీసి అంతర్జాతీయ ప్రశంసలు అందుకున్నారు. ఇప్పుడు అదే స్థాయిలో 'అనకస్టమ్‌డ్ ఎర్త్' కూడా అలరిస్తుందని అంచనా వేస్తున్నారు.
అంతర్జాతీయ స్థాయిలో ఎంతో ఉత్కంఠ రేకెత్తిస్తున్న ఈ ఫ్యామిలీ డ్రామా సిరీస్ డిసెంబర్ 17 నుంచి ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది.
ABOUT THE AUTHORHari Prasad Sహరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More

E-Paper


