OTT Friday: ఓటీటీలో ఫ్రైడే ఫెస్టివల్.. తెలుగు హారర్ థ్రిల్లర్ నుంచి తమిళ స్పోర్ట్స్ డ్రామా వరకు.. 4 సౌత్ సినిమాల హవా

OTT Friday: ఓటీటీలో ఈ శుక్రవారం సౌత్ సినిమాల హంగామా ఉండనుంది. తెలుగు హారర్ థ్రిల్లర్ మూవీ అగధతోపాటు పలు తమిళ, కన్నడ సినిమాలు డిజిటల్ ప్రీమియర్ కానున్నాయి. అవేంటి, ఎక్కడ చూడాలో ఇక్కడ తెలుసుకోండి.

Published on: Sep 23, 2026, 14:01:48 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

OTT Friday: ఈ శుక్రవారం అంటే సెప్టెంబర్ 25న సౌత్ సినిమా బాక్సాఫీస్ దగ్గరే కాదు.. డిజిటల్ స్పేస్‌లోనూ విరుచుకుపడబోతోంది. థియేటర్లలో ఏకంగా 6 సినిమాలు సందడి చేయడానికి వస్తుంటే.. డిజిటల్ ప్లాట్‌ఫామ్స్‌లో 4 డిఫరెంట్ జానర్ సినిమాలు ఒకే రోజు స్ట్రీమింగ్ కాబోతున్నాయి. వీకెండ్ లో ఇంటి దగ్గరే ఉండి ఎంజాయ్ చేయాలనుకునే మూవీ లవర్స్ కోసం ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ సరికొత్త వినోదాన్ని పంచడానికి సిద్ధమయ్యాయి.

OTT Friday: ఓటీటీలో ఫ్రైడే ఫెస్టివల్.. తెలుగు హారర్ థ్రిల్లర్ నుంచి తమిళ స్పోర్ట్స్ డ్రామా వరకు.. 4 సౌత్ సినిమాల హవా
OTT Friday: ఓటీటీలో ఫ్రైడే ఫెస్టివల్.. తెలుగు హారర్ థ్రిల్లర్ నుంచి తమిళ స్పోర్ట్స్ డ్రామా వరకు.. 4 సౌత్ సినిమాల హవా

ఈ వారం జీ5, సన్‌నెక్స్ట్, సోనీలివ్, జియోహాట్‌స్టార్‌లలో స్ట్రీమింగ్ అవుతున్న ఆ 4 క్రేజీ సౌత్ సినిమాల వివరాలు, వాటి ఆసక్తికరమైన కథాంశాలు ఏంటో ఇప్పుడు డీటైల్డ్‌గా చూద్దాం.

1. జీ5లో ఎంఎస్ రాజు హారర్ థ్రిల్లర్ 'అగధ' (Agadha)

టాలీవుడ్‌లో ఒకప్పుడు బ్లాక్‌బస్టర్ ప్రొడ్యూసర్‌గా, ఆ తర్వాత డిఫరెంట్ మూవీస్ తీసే డైరెక్టర్‌గా గుర్తింపు తెచ్చుకున్న ఎంఎస్ రాజు దర్శకత్వంలో తెరకెక్కిన సరికొత్త సస్పెన్స్ హారర్ థ్రిల్లర్ 'అగధ'. కామాక్షి భాస్కర్ల, శ్రవణ్ రెడ్డి, ఉల్కా గుప్తా, జోవికా విజయకుమార్, శ్రేయా రాణి రెడ్డి, భాను చందర్ లాంటి సీనియర్ నటులు ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమా ప్రముఖ ఓటీటీ సంస్థ జీ5 (ZEE5) వేదికగా స్ట్రీమింగ్ కానుంది.

అగధ మూవీ ఆత్మలను, చెడు శక్తులను తరిమికొట్టే ప్రత్యేక శక్తులున్న మహాదేవి (కామాక్షి భాస్కర్ల) చుట్టూ తిరుగుతుంది. తన కజిన్ అనుమానాస్పద స్థితిలో చనిపోవడంతో పాటు ఇంట్లో కొన్ని వింత సంఘటనలు జరుగుతుండటంతో ఆమె తన పూర్వీకుల ఇంటికి తిరిగి వస్తుంది. ఆ మరణం వెనకున్న నిజాలను శోధించే క్రమంలో అడవిలో ఉన్న ఒక నిర్మానుష్యమైన గుహ, 12 చేతులున్న ఒక రహస్య విగ్రహం, ఒక సీక్రెట్ క్లబ్ గురించి తెలుసుకుంటుంది. మానస, ఆమె ప్రియుడి సహాయంతో 'అగధ' అనే ఒక భయంకరమైన దుష్టశక్తి ఉనికిని కనిపెడుతుంది. ఆ ప్రాచీన శక్తుల నుంచి తన కుటుంబాన్ని కాపాడుకోవడానికి మహాదేవి ఎలాంటి పోరాటం చేసిందనేది ఈ సినిమా మెయిన్ పాయింట్.

2. సన్‌నెక్ట్స్‌లో స్పోర్ట్స్ డ్రామా 'అంగీకారం' (Angikaaram)

స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌లో ఎమోషనల్ డ్రామాగా తెరకెక్కిన తమిళ చిత్రం 'అంగీకారం'. తేన్పదియన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో కోటపాడి జె రాజేష్, సింధూరి విశ్వనాథ్, విజి వెంకటేష్, రంగరాజ్ పాండే, మన్సూర్ ఆలీ ఖాన్, రామా రాజేంద్రన్ ముఖ్య పాత్రల్లో నటించారు. ఈ చిత్రం సన్‌నెక్స్ట్ (SunNXT) ఓటీటీలో విడుదల కాబోతోంది.

చెన్నైలోని ఒక స్లమ్ ఏరియాలో నివసించే ఆధిరన్ భానుమతి అనే యువకుడి కథ ఇది. అతను 200 మీటర్ల పరుగు పందెంలో తిరుగులేని నైపుణ్యం ఉన్న అథ్లెట్. పేదరికం, సమాజంలో ఉండే వివక్షను తట్టుకుంటూ కామన్వెల్త్ గేమ్స్‌లో భారతదేశం తరఫున ఆడాలని కలలు కంటాడు. కానీ స్పోర్ట్స్ అథారిటీలోని రాజకీయం వల్ల ఆఖరి నిమిషంలో అతని పేరును టీమ్ నుంచి తొలగిస్తారు. ఆ తర్వాత ఆధిరన్ అధైర్యపడకుండా తన హక్కుల కోసం, క్రీడారంగంలో ఉండే లంచగొండితనంపై ఎలాంటి పోరాటం చేశాడు? తన లక్ష్యాన్ని ఎలా సాధించాడు? అనేది ఈ సినిమాలో చాలా ఇంటెన్సివ్‌గా చూపించారు.

3. సోనీలివ్‌లో 40 ఏళ్ల ప్రేమ ప్రయాణం 'హబీబి' (Habeebi)

నాలుగు దశాబ్దాల కాలక్రమాన్ని ఆవిష్కరిస్తూ తెరకెక్కిన పీరియాడిక్ ఎమోషనల్ డ్రామా 'హబీబి'. మీరా కతీరవన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో కస్తూరి రాజా, ఈషా ఎం, మాళవిక మనోజ్, ధనశ్రీ సుధాకరన్, అరుళ్ కుమార్, అనుస్రేయ రాజన్ నటించారు. సోనీలివ్ (SonyLIV) వేదికగా ఈ సినిమా స్ట్రీమింగ్ కానుంది.

తిరునెల్వేలి సమీపంలో ఉండే చేనేత కార్మికుల పట్టణం ఆధారంగా ఈ సినిమా సాగుతుంది. దాదాపు 40 సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణాన్ని ఈ కథలో ఆవిష్కరించారు. తమ కుటుంబానికి చెందిన చేనేత సాంప్రదాయాన్ని నిలబెట్టడానికి పోరాడే యూసుఫ్ అనే వ్యక్తి జీవితం, మరోవైపు అబూ తాహిర్, నీలోఫర్ అనే ఇద్దరి మధ్య చిగురించిన అందమైన ప్రేమకథ కథలో ఒకేసారి సాగుతూ ఉంటాయి. మారుతున్న కాలంతో పాటు వారి బంధంలో వచ్చే గొడవలు, ఎమోషనల్ మూమెంట్స్ ఆకట్టుకుంటాయి.

4. జియోహాట్‌స్టార్‌లో 'మాంగో పచ్చా' (Mango Pachcha)

సస్పెన్స్, ఫ్యామిలీ ఎమోషన్స్ కలగలిపిన కన్నడ చిత్రం 'మాంగో పచ్చా'. వివేకా దర్శకత్వం వహించిన ఈ సినిమాలో సంచిత్ సంజీవ్, కాజల్ కుందర్, మయూర్ పటేల్, ప్రశాంత్ హిరేమఠ్, ఉగ్రం మంజు, హంస నారాయణస్వామి కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ చిత్రం జియోహాట్‌స్టార్ (JioHotstar)లో విడుదల కానుంది.

మైసూర్ నగరంలో ఒక చిన్న సీడీ షాప్ నడుపుకునే ప్రశాంత్ అలియాస్ పచ్చా అనే కుర్రాడి కథ ఇది. తండ్రి ఆకస్మిక మరణం తర్వాత అతని జీవితం ఒక్కసారిగా మారిపోతుంది. తనకు ఇప్పటివరకు తెలియని ఒక కొత్త కుటుంబం, తన సొంత సవతి సోదరుడు నాగప్ప (ఉగ్రం మంజు) ఉన్నారనే నిజం పచ్చాకి తెలుస్తుంది. అంతేకాదు ఆ కుటుంబం చాటుగా చేసే ఒక చీకటి వ్యాపారం గురించి కూడా సంచలన విషయాలు బయటపడతాయి. అన్నదమ్ముల మధ్య అనుబంధం, శత్రుత్వం మధ్య నడిచే యుద్ధంలో పచ్చా చివరికి ప్రేమను ఎంచుకున్నాడా లేక కుటుంబాన్ని ఎంచుకున్నాడా అనేది క్లైమాక్స్‌లో చూడాల్సిందే.

  • Hari Prasad S
    ABOUT THE AUTHOR
    Hari Prasad S

    హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More