P Susheela Janaki: జానకమ్మ మరణం.. ఇప్పుడు వాళ్ల కళ్లు చల్లబడ్డాయా? సరస్వతీ దేవి దగ్గరకు వెళ్లిపోయింది: పి సుశీల ఎమోషనల్
P Susheela Janaki: భారత సంగీత రంగంలో ఓ శిఖరం కూలింది. జానకమ్మ మరణాన్ని జీర్ణించుకోవడం ఇంకా కష్టంగానే ఉంది. ఈ నేపథ్యంలో మరో లెజెండరీ సింగర్ పి.సుశీలమ్మ ఎమోషనల్ వీడియో వైరల్ గా మారింది. జానకి మరణంతో వాళ్ల కళ్లు చల్లబడ్డాయా? అంటూ సుశీల సంచలన వ్యాఖ్యలు కూడా చేశారు.
P Susheela Janaki: ఇండియన్ మ్యూజిక్ హిస్టరీలో లెజెండరీగా ఎదిగిన ఎస్.జానకి ఇప్పుడు మన మధ్యలో లేరు. శనివారం (జూలై 11) ఆమె మరణించిన సంగతి తెలిసిందే. ఆమె కన్నుమూశారనే వార్తను ఇంకా జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ నేపథ్యంలో మరో దిగ్గజ సింగర్ పి.సుశీల ఎమోషనల్ వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది.

పి సుశీల ఎమోషనల్
జానకమ్మ మరణంపై పి.సుశీల ఎమోషనల్ అయ్యారు. జానకి గురించి సుశీలమ్మ మాట్లాడుతున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది.
‘‘ఏం చెప్పాలమ్మా. మద్రాస్ లో రెండు పర్వతాలం మేం. ఆవిడ (జానకి) గడగడలాడించింది. దెబ్బ మీద దెబ్బ కొట్టి ఆవిడను తీసుకెళ్లి పోయాడు దేవుడు. ఇప్పుడు మ్యూజిక్కే లేదు. ఆ పిల్ల ఎన్ని రకాలుగా పాడుతుందో ఎవరూ ఊహించలేదు. అందుకే ఆవిడకు నా పేరు మీద ఫస్ట్ అవార్డు ఇచ్చాం. నా జీవితంలో నేను చేసిన మంచి పని అదే’’ అని సుశీలమ్మ ఎమోషనల్ అయ్యారు.
కళ్ల నీళ్లు రావడం లేదు
‘‘తెలియకుండానే పుడతాం. తెలియకుండానే వెళ్లిపోతాం. మగ గొంతుతో, చిన్న పిల్లలా, పెద్దవాడిలా ఆమె పాడేది. ఆడియన్స్ ను ఎలా ఆకట్టుకోవాలో ఆవిడకు తెలుసు. నేను ఆమె పక్కన ఉత్సవ విగ్రహమే. ఆమె లేని బాధ ఇది. కళ్ల నీళ్లు కూడా రావడం లేదు. ఏం చేయాలో తెలియడం లేదు’’ అని బాధ పడుతూ సుశీల చెప్పారు.
కళ్లు చల్లబడ్డాయా?
‘‘ఆవిడను సరస్వతి దేవి పిలుచుకుంటుందని అనుకుంటున్నా. అక్కడ కచేరీ కోసం రమ్మని ఉంటుంది. ఈ లక్ ఎవరికీ రాదు. ఉన్నన్నాళ్లూ మా ఇద్దరిని వేధించారు. నా మీద ఆవిడకు, ఆవిడ మీద నాకు చెప్పి ఏడిపించుకుని తిన్నారు. ఇప్పుడు వాళ్లద్దరికీ చల్లగా ఉంటాయా కళ్లు? ఏం సాధించారు మీరు? ఆవిడ అన్ని సాధించింది.
ఆమెకు చావు లేదు. సరస్వతీ పక్కనే ఆమె ఉంటుంది. జనం పుణ్యం చేసుకున్నారు కాబట్టి ఇలాంటి వాయిస్ దొరికింది’’ అని 90 ఏళ్ల సుశీలమ్మ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు.
మరణం లేని గొంతు
88 ఏళ్ల జానకమ్మ అనారోగ్య కారణాలతో శనివారం తుదిశ్వాస విడిచారు. ఆదివారం సాయంత్రం కర్ణాటకలో ప్రభుత్వ లాంఛనాలతో జానకి అంత్యక్రియలు జరిగాయి. 20 భాషల్లో దాదాపు 48 వేలకు పైగా పాటలు పాడారు జానకమ్మ. మధుర గానంతో ప్రేక్షకులను అలరించారు. అందుకే జానకమ్మకు మరణం ఉంటుందేమో కానీ ఆమె గొంతుకు మరణం ఉండదు.
ABOUT THE AUTHORChandu Shanigarapuచందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More

E-Paper


