Dil Raju: పావలా శ్యామలకు అండగా దిల్ రాజు.. హాస్పిటల్ కు అతని టీమ్.. ఆమె హెల్త్ కండీషన్ ఎలా ఉందంటే? వీడియో వైరల్

Dil Raju: టాలీవుడ్ సీనియర్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ పావలా శ్యామలకు దిల్ రాజు అండగా నిలిచాడు. ఆమె ఆరోగ్యం నిలకడగా ఉందని, ఆందోళన చెందాల్సిన పని లేదని ప్రముఖ నిర్మాత దిల్ రాజు బృందం స్పష్టం చేసింది.

Published on: May 16, 2026, 17:52:21 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Dil Raju: తెలుగు సినీ పరిశ్రమలో వందలాది చిత్రాల్లో నటించి తనదైన నటనతో మెప్పించిన సీనియర్ నటి పావలా శ్యామల తీవ్ర అనారోగ్యంతో, అత్యంత క్లిష్ట పరిస్థితిలో ఉన్నారంటూ శనివారం ఉదయం నుంచి సామాజిక మాధ్యమాల్లో వీడియోలు వైరల్ అయ్యాయి. ఈ నేపథ్యంలో ఆమెకు దిల్ రాజు అండగా నిలిచాడు.

పావలా శ్యామలకు అండగా దిల్ రాజు (x)
పావలా శ్యామలకు అండగా దిల్ రాజు (x)

స్పందించిన దిల్ రాజు

నడి రోడ్డు మీద పావలా శ్యామల దీనస్థితిలో ఉన్న వీడియోలు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొట్టాయి. ఆమెను పట్టించుకునేవారే లేరని, తీవ్ర గుండె సంబంధిత సమస్యతో బాధపడుతున్నారని వార్తలొచ్చాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్, ప్రముఖ నిర్మాత దిల్ రాజు తక్షణమే స్పందించాడు.

రంగంలోకి టీమ్

పావలా శ్యామలకు మెరుగైన వైద్యం అందేలా చూసేందుకు దిల్ రాజు తన ప్రత్యేక బృందాన్ని రంగంలోకి దించాడు. కూకట్‌పల్లిలోని ప్రసాద్ హాస్పిటల్ కు చేరుకున్న దిల్ రాజు బృందం సభ్యులు, అక్కడి వైద్యులతో మాట్లాడి ఆమె ఆరోగ్య పరిస్థితిని సమీక్షించారు.

ఆరోగ్యం నిలకడగా

పావలా శ్యామల ప్రస్తుతం క్లిష్ట పరిస్థితిలో ఏమీ లేరని, ఆమె ఆరోగ్యం పూర్తిగా నిలకడగా ఉందని దిల్ రాజు టీమ్ సభ్యుడు శేషగిరిరావు స్పష్టం చేశాడు. వైద్యులు కొన్ని సాధారణ పరీక్షలు సూచించారని, వాటిని త్వరలోనే పూర్తి చేస్తామని ఆయన వెల్లడించాడు. ప్రస్తుతం ఆమె కూకట్‌పల్లి ప్రసాద్ హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నారని, ఆహారం కూడా తీసుకుంటున్నారని వైద్య వర్గాలు ధృవీకరించాయి.

కన్నీళ్లతో నటి

దిల్ రాజు టీమ్ పావలా శ్యామలను కలిసిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ సమయంలో ఆమె కన్నీళ్లు పెట్టుకుంటూ దిల్ రాజుకు ధన్యవాదాలు తెలిపింది. అంతకుముందు ఇన్సూరెన్స్ డాక్యుమెంట్లకు సంబంధించిన సాంకేతిక సమస్యల కారణంగా ఆమెకు ఆసుపత్రిలో చేరడంలో ఇబ్బందులు ఎదురైనట్లు తెలుస్తోంది. ఆ మానసిక ఆందోళనతో ఆమె సరిగ్గా ఆహారం తీసుకోకుండా రోడ్లపై తిరిగినట్లు సమాచారం.

ఈ విషయం తెలుసుకున్న దిల్ రాజు వెంటనే స్పందించి వైద్యసహాయం అందేలా చర్యలు తీసుకున్నాడు. తాము ఆసుపత్రిలోనే ఉండి ఆమె కోలుకునే వరకు అన్ని విధాలా అండగా ఉంటామని, వయోభారంతో కూడిన కొన్ని ఆరోగ్య సమస్యలు తప్ప ప్రస్తుతం ఆమెకు ప్రాణాపాయం ఏమీ లేదని శేషగిరిరావు పేర్కొన్నాడు.

వీళ్లు కూడా

గతంలోనూ పావలా శ్యామల ఆర్థిక, ఆరోగ్య ఇబ్బందుల్లో ఉన్నప్పుడు మెగాస్టార్ చిరంజీవి, టాలీవుడ్ హీరోలు అల్లు అర్జున్, సాయి దుర్గ తేజ్, ఆకాష్ పూరి తదితరులు ఆర్థికంగా సహాయం అందించారు. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) కూడా ఆమెకు ప్రతి నెలా ఆర్థిక సహాయం అందేలా ఏర్పాట్లు చేసింది.

తరచుగా అడిగే ప్రశ్నలు (FAQ)

  1. పావలా శ్యామల ప్రస్తుత ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది?

ఆమె ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా ఉంది. వయోభారంతో కూడిన కొన్ని సమస్యలు మినహా ఎలాంటి ప్రాణాపాయం లేదని వైద్యులు, దిల్ రాజు బృందం స్పష్టం చేశారు.

2. ఆమెకు వైద్య సహాయం అందిస్తున్నది ఎవరు?

నిర్మాత, తెలంగాణ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దిల్ రాజు ఈ విషయంపై తక్షణమే స్పందించి, తన టీమ్‌ను ఆసుపత్రికి పంపి ఆమెకు మెరుగైన వైద్య సేవలు అందేలా చూస్తున్నారు.

3.గతంలో ఆమెకు టాలీవుడ్ నుండి ఎవరెవరు సహాయం చేశారు?

మెగాస్టార్ చిరంజీవి, అల్లు అర్జున్, సాయి దుర్గ తేజ్, ఆకాష్ పూరి వంటి సినీ ప్రముఖులతో పాటు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) కూడా ఆమెకు ఆర్థికంగా అండగా నిలిచారు.

  • Chandu Shanigarapu
    ABOUT THE AUTHOR
    Chandu Shanigarapu

    చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More