Pawan Kalyan Chiranjeevi: ఆ రోజు గదిలో కూర్చుని ఏడ్చేశా.. నా ఏకైక హీరో ఆయనే.. చిరంజీవికి విషెస్.. పవన్ కళ్యాణ్ ఎమోషనల్
Pawan Kalyan Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ఆయన తమ్ముడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎమోషనల్ అయ్యారు. తన అన్నయ్యకు బర్త్ డే విషెస్ చెప్తూ పవన్ పంచుకున్న సోషల్ మీడియా పోస్టు వైరల్ గా మారింది. అన్నయ్యతో తన జ్ణాపకాలు పవన్ షేర్ చేసుకున్నారు. అలాగే ఓ రేర్ ఫొటోనూ పోస్టు చేశారు.
Pawan Kalyan Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవికి బర్త్ డే విషెస్ చెప్తూ పవన్ కళ్యాణ్ సోషల్ మీడియాలో ఓ లెంగ్తీ లెటర్ ను పోస్టు చేశారు. అన్నయ్య చిరంజీవితో తనకున్న అనుబంధాన్ని, చిన్ననాటి తీపి జ్ఞాపకాలను, ఆయన పడిన కష్టాన్ని గుర్తుచేసుకుంటూ రాసుకొచ్చిన ఈ లేఖ అభిమానుల హృదయాలను హత్తుకుంటోంది.

పవన్ కళ్యాణ్ పోస్ట్
ఇవాళ (ఆగస్టు 22) మెగాస్టార్ చిరంజీవి బర్త్ డే. ఈ సందర్భంగా అన్నయ్యకు పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్తూ పవన్ కళ్యాణ్ ఓ సుదీర్ఘ పోస్టు పెట్టారు.
చిరంజీవి చిన్నతనంలో నరసాపురంలో కాలేజీ చదువు కోసం ఇంటి నుంచి దూరంగా వెళ్లిన రోజులను పవన్ కళ్యాణ్ గుర్తు చేసుకున్నారు. "సమ్మర్ హాలిడేస్‌కి అన్నయ్య ఇంటికి వస్తున్నాడంటే మా ఇంట్లో పండగ వాతావరణం నెలకొనేది. సెలవులు పూర్తయి ఆయన మళ్లీ కాలేజీకి వెళ్తుంటే మనసంతా ఎంతో బాధగా, వెలితిగా అనిపించేది. ఆయన మళ్లీ వచ్చే వరకు ఇల్లు కళకళలాడేది కాదు" అని పవన్ వివరించారు.
హీరో కాకముందే ఆయనే నా హీరో!
స్కూల్ రోజుల్లో అన్నయ్య పక్కన నడవడమే తనకు ఎంతో గర్వకారణంగా ఉండేదని పవన్ తెలిపారు. "మా నాన్న బుల్లెట్ (350 cc) బైక్‌పై గుబురు జుట్టు, ఎన్సీసీ క్యాడెట్ తరహా ఫిట్‌నెస్, బెల్ బాటమ్ ప్యాంట్లు, కళ్లజోడుతో అన్నయ్య వెళ్తుంటే ఒక అభిమానిలా చూసేవాడిని. నా దృష్టిలో ఆయన సినిమాలో హీరో కాకముందే రియల్ హీరో" అని పవన్ పేర్కొన్నారు.
అన్నయ్య తెచ్చిన గిఫ్ట్ లు
తన మొదటి సింగపూర్ ట్రిప్ నుంచి చిరంజీవి ఒక పెద్ద బ్లూ కలర్ బ్యాగ్ తెచ్చారని పవన్ గుర్తుచేసుకున్నారు. "ఆ బ్యాగ్‌లో నా కోసం చిన్న లెగో హెలికాప్టర్, రిమోట్ కార్లు, రేసింగ్ ట్రాక్, కామిక్స్, మ్యూజిక్ టేప్‌లు, టేప్ రికార్డర్, యార్డ్‌లీ పౌడర్లు, సోప్‌లు, పర్ఫ్యూమ్‌లు తెచ్చారు. ఆ కానుకలు మా చిన్న ఇంట్లో ఎంతో సంతోషాన్ని నింపాయి" అని పవన్ రాసుకొచ్చారు.
కంటతడి పెట్టించిన పెళ్లి రోజు
చిరంజీవి వివాహం జరిగే సమయంలో పవన్ ఎంతో ఆందోళన చెందారట. అన్నయ్య తమకు దూరమవుతాడేమోనని భయపడి ఒక గదిలో ఒంటరిగా ఏడ్చానని పవన్ వెల్లడించారు. "అప్పుడు అన్నయ్య నా వద్దకు వచ్చి వదినను పరిచయం చేస్తూ.. 'రా, నీకు ఒక పెద్ద మనిషిని పరిచయం చేస్తాను' అన్నారు. నేను ఏడవడానికి గల కారణం తెలుసుకుని వారిద్దరూ ఎంతగానో నవ్వుకున్నారు" అని ఆ తీపి గుర్తును పవన్ పంచుకున్నారు.
అన్నయ్య కష్టం
ఆ తర్వాత కోసం చెన్నై వెళ్లినప్పుడు అన్నయ్య, వదిన తనపై చూపించిన ప్రేమానురాగాలు మాటల్లో చెప్పలేనివని పవన్ పేర్కొన్నారు. "చెన్నై తీవ్రమైన ఎండలో, ఉక్కపోతలో ప్రతిరోజూ 18 గంటల పాటు కష్టపడి పనిచేసి, చెమటలు పట్టిన దుస్తులతో అర్ధరాత్రి అన్నయ్య ఇంటికి వచ్చేవారు. నిలబడటానికి కూడా ఓపిక లేని స్థితిలో ఆయనను చూసి.. ఆయన కష్టంపైన నేను బతుకుతున్నాననే గిల్టీ ఫీలింగ్ కలిగేది.
అయినా సరే చదువులో నేను విఫలమైనా, నా జీవితానికి సరైన దిశ లేకపోయినా ఆయన నన్ను ఒక్క మాట కూడా అనలేదు" అని పవన్ తన అన్నయ్య విశాల హృదయాన్ని గుర్తుచేసుకున్నారు.
బాలీవుడ్ లోనూ
చిరంజీవి కేవలం తమ కుటుంబాన్నే కాకుండా బంధువులను, స్నేహితులను, నిర్మాతలను, చిత్ర పరిశ్రమలోని ప్రతి ఒక్కరినీ ఆదుకున్నారని పవన్ కళ్యాణ్ కొనియాడారు. దక్షిణాది, ఉత్తరాది చిత్ర పరిశ్రమల మధ్య సాంస్కృతిక వారధిగా నిలిచిన ప్రధాన వ్యక్తుల్లో చిరంజీవి ఒకరని అభివర్ణించారు. బాలీవుడ్ లో ఆయన నటించిన 'ప్రతిబంధ్', 'ఆజ్ కా గూండారాజ్' చిత్రాలు బ్లాక్‌బస్టర్‌లుగా నిలిచాయని గుర్తుచేశారు.
"ఇటీవల వెన్నుముకకు శస్త్రచికిత్స జరిగినప్పటికీ, కొద్దిరోజుల్లోనే కోలుకుని మళ్లీ వర్కౌట్లు చేస్తూ షూటింగ్‌లకు హాజరవుతున్నారు. ఆయనలో ఎప్పటికీ ఆగని ఒక శక్తి ఉంది. అందుకే ఆయన మనందరి మెగాస్టార్, నా ఏకైక హీరో" అని పవన్ కళ్యాణ్ కొనియాడారు.
ABOUT THE AUTHORChandu Shanigarapuచందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More

E-Paper


