Podarillu November 7 Episode: పొదరిల్లు.. బృందావనంలో మరో చిచ్చు.. కేశవ షాపు పేరుపై శైలు రచ్చ..చక్రికి విక్కీ, లక్కీ షాక్
Podarillu Serial November 7th Episode: పొదరిల్లు సీరియల్ నవంబర్ 7 ఎపిసోడ్ లో బృందావనంలో మరో చిచ్చు రగిలేలా కనిపించింది. కేశవ షాపు పేరు మార్చాలని నిర్ణయించడం, ఎవరి పేరు పెట్టాలా అనేదానిపై గొడవ చూడొచ్చు. అటు విక్కీ, లక్కీని చూసి చక్రి ఉడుక్కుంటాడు.
Podarillu Serial Today Episode: స్టార్ మా సీరియల్ పొదరిల్లు ఈరోజు ఎపిసోడ్ లో మనీషా మాధవ ఇంట్లోనే ఉండిపోతుంది. తన భార్య మహా ఆమె బాస్ విక్కీతో క్లోజ్ గా ఉండటం చూసి చక్రి తట్టుకోలేకపోతాడు. మరోవైపు తన షాపులో లక్ష్మీ పూజ చేసి పేరు కూడా మార్చాలని కేశవ నిర్ణయిస్తాడు. తర్వాత ఏం జరిగిందో చూడండి.

మాధవ ఇంట్లోనే మనీషా
మాధవ, మనీషా పెళ్లి గురించి అందరూ మాట్లాడే సీన్ తో సీరియల్ శనివారం (నవంబర్ 7) ఎపిసోడ్ మొదలైంది. తమ తల్లిదండ్రులు దీనికి ఒప్పుకోరని, వాళ్లు టిట్లాతోనే చేయాలని చూస్తున్నారని బన్సీ అంటాడు. అయితే వాళ్లను ఒప్పించే ప్రయత్నం తాను చేస్తానంటాడు. కానీ అది కుదిరే పని కాదేమో అని చక్రి అంటాడు. వాళ్లను ఒప్పించే పెళ్లి చేసుకోవాలి.. పెద్దవాళ్లను ఒప్పించకపోతే ఏం జరుగుతుందో నీ విషయంలోనే చూశాం.. ఇలా అయితే ప్రతి ఆడపిల్లా పుట్టింటికి దూరమవుతుంది అని మాధవ అంటాడు.
తన ఇంటికి వెళ్లడానికి మనీషా భయపడుతుంది. వాళ్లు అక్కడికి కూడా వస్తారేమో అంటుంది. అయితే కొన్నాళ్లు ఇక్కడే ఉండండి.. ఎలాగూ దీపావళి కూడా వస్తోంది.. ఇక్కడే అందరం కలిసి జరుపుకుందా అని చక్రి అనడంతో ఆమె ఉంటుంది. ఆ తర్వాత మాధవ ఆ రౌడీలతో హీరోలాగా ఫైట్ చేశాడని మనీషా చెప్పడంతో తమ్ముళ్లు హీరో హీరో అంటూ మాధవను ఆటపట్టిస్తారు.
మహాను ఆఫీసుకు తీసుకెళ్లిన చక్రి
మరుసటి రోజు ఉదయం మహా ఆఫీసుకు రెడీ అవుతుంది. చక్రి ఆమెతో మాట్లాడటానికి ప్రయత్నిస్తే విసుక్కుంటుంది. మీ స్కూటీ పాడైంది కదా తానే ఆఫీస్ వరకు డ్రాప్ చేస్తానని చక్రి అంటాడు. తాను ఆటోలో వెళ్తానని మొదట అన్న మహా.. తర్వాత సరే అంటుంది.
కారులో వెళ్తూ మహాతో మాట్లాడిన చక్రి.. ఈ మధ్య తనతో సరిగా మాట్లాడటం లేదని, ప్రతిదానికీ విసుక్కుంటున్నారని, మీ కోపానికి ఆ అమ్మాయిలను ఎక్కించుకోవడమే కారణమా అని చక్రి అడుగుతాడు. అలాంటిదేమీ లేదు అని మహా అంటుంది. తాను బాగానే ఉన్నానని, అయినా ఇది మీ కారు మీ ఇష్టం.. ఎవరినైనా ఎక్కించుకోండి అని అంటుంది.
విక్కీని చూసిన కారు ఆపిన మహా.. ఉడుక్కున్న చక్రి
దారిలో విక్కీ కారు ఆగిపోవడం చక్రి చూస్తాడు. వీడు చూస్తే కచ్చితంగా లిఫ్ట్ అడుగుతాడు.. మహా ఆపమంటుంది.. ఆమెను చూడకుండా చేయాలి అనుకొని.. మహాను మాటల్లో పెట్టి విక్కీని చూడకుండా చేస్తుంది. విక్కీ కారు ఆపమని అడుగుతున్నా చక్రి పట్టించుకోనట్లుగా ముందుకు వెళ్తాడు. లక్కీ అంటూ విక్కీ గట్టిగా అరుస్తాడు.
అది విని మహా కారు ఆపమంటుంది. విక్కీ గొంతులా ఉందే అని బయటకు చూస్తే నిజంగానే విక్కీ ఉంటాడు. తన కారు పాడైందని చెబుతాడు. ఇదే కారులో వెళ్దామని మహా అంటుంది. వెనకాల కూర్చో.. ఓ ముఖ్యమైన ప్రాజెక్టులో మార్పులు జరిగాయి దాని గురించి చెప్పాలని విక్కీ అనడంతో చక్రి ఉడుక్కుంటాడు. కారులో వాళ్లు క్లోజ్ గా ఉండటం చూసి తిట్టుకుంటూ ఉంటాడు. కావాలని బ్రేకు వేసి విక్కీకి దెబ్బ తగిలేలా చేస్తాడు. తర్వాత వాళ్లను డ్రాప్ చేసి మహా స్కూటీ తాళాలు తీసుకొని వెళ్తాడు.
మెకానిక్ షాపులోనే కేశవ, శైలు రొమాన్స్
మరోవైపు కేశవ తన షాపులో లక్ష్మీ పూజ కోసం అంతా శుభ్రం చేస్తుండగా శైలు వస్తుంది. ఆమెకు ఏదైనా తీసుకురావాలని చెప్పి చోటూని పంపిచేస్తాడు. తర్వాత ఇద్దరూ రొమాన్స్ లో మునిగి తేలుతారు. షాపు విషయంలో శైలు మళ్లీ గొడవ పడటానికి ప్రయత్నిస్తుంది.
దీంతో కేశవ ఆమెను ఆపి.. ఈ బుస్సు తనకు అస్సలు నచ్చడం లేదని, ఒకప్పుడు తనతో ప్రేమగా మాట్లాడి, తనకోసం రోజూ ఏదైనా తీసుకొచ్చి.. ఎంతసేపైనా వేచి చూసే బుస్సే నచ్చేదని, ఇలా రోజూ గొడవ పడే బుస్సు వద్దని అంటాడు. నీకు ఈ షాపులో చేసే పని నచ్చకపోతే ఎలా.. ఇదే మన జీవానాధారం అని సర్ది చెబుతాడు.
మహా స్కూటీతో చక్రి తంటాలు.. కేశవను చూసి షాక్
దీంతో శైలు కరిగిపోతుంది. ఇద్దరూ హగ్ చేసుకుంటారు. మనం ఎప్పుడూ ఇలాగే ఉండాలని కేశవ అంటాడు. ఆమెకు ముద్దు పెట్టబోతాడు. ఇంతలో మహా స్కూటీని తోసుకుంటూ, తంటాలు పడుతూ చక్రి అక్కడికి వస్తాడు. శైలుకి ముద్దివ్వబోతున్న కేశవను చూసి గట్టిగా అరుస్తాడు.
దీంతో వాళ్లు ఉలిక్కి పడతారు. ఏం చేస్తున్నారురా మీరు.. నేను చూశాను కాబట్టి సరిపోయింది.. వాళ్ల నాన్నో, అన్నో చూసి ఉంటే ఏమయ్యేదంటూ శైలుని తిట్టి పంపిచేస్తాడు. స్కూటీ రిపేర్ చేయమని కేశవకు చెబుతాడు. తనకు హగ్ కే దిక్కులేదు.. వీళ్లు ముద్దులదాకా వెళ్లిపోయారని తిట్టుకుంటాడు.
కేశవ షాపు పేరు మార్పుపై రచ్చ
ఇక కేశవ తన షాపులో లక్ష్మీ పూజ విషయం ఇంట్లో చెబుతాడు. అంతేకాదు పేరు కూడా మార్చాలని అనుకుంటున్నట్లు చెప్పడంతో దానిపై ఇంట్లో రచ్చ జరుగుతుంది. మహా పేరు పెట్టాలని చక్రి అంటాడు. తనకు ఆ పేరు ఓకే అని కన్నా అంటాడు. మహా మాత్రం మాధవ పేరు పెట్టాలంటుంది.
మనీషా మరో పేరు చెబుతుంది. తన పేరు ఎవరూ చెప్పకపోవడంతో శైలు అలుగుతుంది. వాళ్లను చూసిన నారాయణ ఈ గొడవ ఎందుకు.. అందరూ పేర్లు రాసి చిట్టీలు ఒకదాంట్లో వేయండి.. అందులో నుంచి ఒకటి తీసి ఏ పేరు వస్తే ఆ పేరు పెట్టండని చెప్పడంతో అందరూ అలా చేస్తారు. మహా చీటీ తీస్తుంది. అక్కడితో పొదరిల్లు సీరియల్ ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.
ABOUT THE AUTHORHari Prasad Sహరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్డేట్స్ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More

E-Paper


