Prakash Raj: 'వారణాసి'ని బ్యాన్ చేస్తారా.. రాజమౌళిని తిడుతున్నారు.. నేనేమైనా అరాచకాలు చేశానా.. దొంగనా: ప్రకాష్ రాజ్
Prakash Raj: ప్రకాష్ రాజ్ మరోసారి తన బోల్డ్ కామెంట్స్‌తో టాలీవుడ్‌లో తీవ్ర చర్చనీయాంశంగా మారారు. ఇటీవల ఎన్టీవీ 'పాయింట్ బ్లాంక్' టాక్ షోలో పాల్గొన్న ఆయన.. తనపై జరుగుతున్న సోషల్ మీడియా బాయ్‌కాట్ ట్రెండ్స్, టాలీవుడ్‌లో 8 సార్లు తనపై విధించిన బ్యాన్‌లు, వారణాసిలో నటించడంపై మాట్లాడారు.
Prakash Raj: ప్రకాష్ రాజ్ ఈ మధ్య నటన కంటే కూడా తన రాజకీయ కామెంట్స్, మోదీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న తీరుతోనే ఎక్కువగా వార్తల్లో నిలుస్తున్నారు. తాజాగా మరోసారి అలాంటి కామెంట్స్ తోనే వైరల్ అవుతున్నారు. ఇటీవల ఎన్టీవీ నిర్వహించిన 'పాయింట్ బ్లాంక్' (Point Blank) టాక్ షోలో పాల్గొన్న ఆయన.. ఈ విమర్శలన్నింటికీ తనదైన శైలిలో ఘాటుగా సమాధానమిచ్చారు.

ఈ క్రమంలోనే దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి తెరకెక్కిస్తున్న భారీ పీరియాడిక్ అడ్వెంచర్ మూవీ 'వారణాసి' (Varanasi)లో నటిస్తుండటంపై, దీనిపై వస్తున్న ట్రోల్స్ పై స్పందించారు.
బాయ్‌కాట్ ట్రెండ్స్, 'వారణాసి' వివాదం
సోషల్ మీడియా వేదికగా తనపై వస్తున్న బాయ్‌కాట్ పిలుపులను ప్రకాష్ రాజ్ పూర్తిగా కొట్టిపారేశారు. తనను బాయ్‌కాట్ చేయాలని గతంలో పిలుపునిచ్చినప్పటికీ 'కేజీఎఫ్' (KGF), 'దృశ్యం 3' (Drishyam 3) సినిమాలు బాక్సాఫీస్ వద్ద వేల కోట్లు వసూలు చేశాయని ప్రకాష్ రాజ్ గుర్తుచేశారు.
"నన్ను బ్యాన్ చేయమన్నారు, కానీ ఆ సినిమాలు కలెక్షన్ల సునామీ సృష్టించాయి. సినిమాలను ఎవరూ ఆపలేరు. మహా అయితే నేను నిర్మించే సినిమాలను ఆపగలరేమో కానీ, నటుడిగా నన్ను ఎవరూ అడ్డుకోలేరు" అని ధీమా వ్యక్తం చేశారు.
ప్రస్తుతం తాను రాజమౌళి 'వారణాసి' ప్రాజెక్ట్ షూటింగ్‌లో పాల్గొంటున్నానని ఆయన వెల్లడించారు. "నన్ను ఆ సినిమాలో ఎందుకు తీసుకున్నావంటూ ఎక్స్‌లో కొందరు రాజమౌళిని ప్రశ్నిస్తున్నారు. తిడుతున్నారు. ఆ సినిమాను బ్యాన్ చేయగలరా? నా నటనను, నా పనిని ప్రేమించే ప్రేక్షకులు నా వెంటే ఉన్నారు. వారిని ఎవరైనా ఆపగలరా?" అని ప్రశ్నించారు.
టాలీవుడ్‌లో 8 సార్లు బ్యాన్.. ప్రకాష్ రాజ్ క్లారిటీ
టాలీవుడ్ చరిత్రలోనే ఏకంగా 8 సార్లు నిషేధానికి గురైన నటుడిగా ప్రకాష్ రాజ్ నిలిచారు. 2008లో మొదటిసారిగా ఆయనపై తెలుగు చిత్రపరిశ్రమ నిషేధం విధించింది. 'జల్సా', 'కంత్రి', 'పరుగు' వంటి పెద్ద సినిమాల షూటింగ్ సమయంలో సమయపాలన పాటించలేదని, సెట్‌లో ప్రవర్తన సరిగ్గా లేదని అప్పట్లో నిర్మాతలు ఫిర్యాదులు చేశారు.
ఈ బ్యాన్‌లపై స్పందిస్తూ.. "అందరూ ఒకేలా ఉండాల్సిన అవసరం లేని జీవితాన్ని గడపడం అందమైనది కాదా? నిజాయితీగా జీవిస్తూ దానివల్ల వచ్చే సమస్యలను ఎదుర్కోవడమే నా నైజం. అందులో తప్పేముంది? నేను ఏమైనా అరాచకాలు చేశానా? లేక దొంగతనం చేశానా? నన్ను నా పని ఆధారంగా జడ్జ్ చేయండి. నేను జైలులో లేదు కదా సమయానికి వచ్చి వెళ్లడానికి.. ఒక కళాకారుడు పనిచేసే విధానం వేరుగా ఉంటుంది. ఐదు భాషల్లో వరుస ప్రయాణాలు చేస్తూ నటించే క్రమంలో కొన్నిసార్లు ఆలస్యం కావడం సహజం" అని తన ప్రవర్తనను సమర్థించుకున్నారు.
'మా' (MAA) ఎన్నికలు, విష్ణు ప్యానెల్‌పై సంచలన ఆరోపణలు
2021లో జరిగిన మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ('మా') ఎన్నికల్లో విష్ణు మంచుపై ప్రకాష్ రాజ్ అధ్యక్ష పదవి కోసం పోటీ చేసిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో ప్రకాష్ రాజ్‌ను కర్ణాటకలో జన్మించినందున 'అవుట్‌సైడర్' అని ప్రత్యర్థి వర్గం ప్రచారం చేసింది. చిరంజీవి వంటి దిగ్గజాల మద్దతు ఉన్నప్పటికీ ప్రకాష్ రాజ్ ఆ ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు.
ప్రతి రెండేళ్లకు ఒకసారి 'మా' ఎన్నికలు నిర్వహించాలనే బైలాస్ ఉన్నప్పటికీ, 2021 తర్వాత ఇప్పటివరకు ఎన్నికలు జరగకపోవడాన్ని ఆయన తీవ్రంగా తప్పుబట్టారు. కొత్త భవనం పూర్తయ్యే వరకు విష్ణు ప్యానెల్ కొనసాగుతుందని చెప్పారని, కానీ ఇప్పటివరకు ఆ బిల్డింగ్ నిర్మాణంలో ఎలాంటి పురోగతి లేదని ప్రకాష్ రాజ్ ఎత్తిచూపారు.
తన సినీ ప్రయాణంలో ఎన్ని నిషేధాలు, రాజకీయ వివాదాలు ఎదురైనప్పటికీ, తన నటనతో కోట్లాది మంది అభిమానుల హృదయాల్లో చెరగని స్థానం సంపాదించుకున్నానని ప్రకాష్ రాజ్ ధీమా వ్యక్తం చేశారు. దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న 'వారణాసి' సినిమాలో ఆయన పాత్ర ఎలా ఉండబోతోంది? ఈ సినిమాతో ప్రకాష్ రాజ్ ను ప్రేక్షకులు ఎలా రిసీవ్ చేసుకుంటారన్నది ఆసక్తికరంగా మారింది.
ABOUT THE AUTHORHari Prasad Sహరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More

E-Paper


