Prakash Raj: ఆమె హత్య ప్రకాష్ రాజ్‌ను పూర్తిగా మార్చేసింది.. భయం వదిలి ఎదురు తిరిగారు.. ఎంతో నష్టపోయారు: భార్య పోనీ వర్మ
Prakash Raj: ప్రకాష్ రాజ్ రాజకీయ, సామాజిక విషయాలపై ఎందుకు అంత ధైర్యంగా స్పందిస్తారనే విషయంపై ఆయన భార్య పోనీ వర్మ (Pony Varma) సంచలన విషయాలను వెల్లడించారు. 2017లో దారుణ హత్యకు గురైన ప్రముఖ జర్నలిస్ట్ గౌరీ లంకేష్ (Gauri Lankesh) మరణం ప్రకాష్ రాజ్‌ను మానసికంగా తీవ్రంగా కుంగదీసిందని ఆమె తెలిపారు.
Prakash Raj: తనదైన విలక్షణమైన నటనతో వందలాది పాత్రలకు ప్రాణం పోసిన బహుముఖ ప్రజ్ఞాశాలి ప్రకాష్ రాజ్. వెండితెరపై నటుడిగానే కాకుండా, బయట సమాజంలో జరిగే అనేక రాజకీయ, సామాజిక అంశాలపై ధైర్యంగా మాట్లాడే అతికొద్దిమంది ప్రముఖులలో ఆయన ఒకరు. సోషల్ మీడియా వేదికగా ప్రకాష్ రాజ్ చేసే వ్యాఖ్యలు, విమర్శలు తరచుగా పెద్ద ఎత్తున చర్చనీయాంశమవుతుంటాయి.

అయితే ఆయన అంత ముక్కుసూటిగా మాట్లాడటం వెనుక ఉన్న అసలు కారణం ఏమిటి? దానివల్ల ఆయన కెరీర్ కు ఎలాంటి ఇబ్బందులు కలిగాయి? అనే విషయాలపై ప్రకాష్ రాజ్ భార్య, ప్రముఖ కొరియోగ్రాఫర్ పోనీ వర్మ (Pony Varma) ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొని పలు భావోద్వేగ విషయాలను పంచుకున్నారు.
నిజాయితీగా మాట్లాడటం వల్ల ఇండస్ట్రీలో అనేక యాడ్స్, సినిమా అవకాశాలు పోయినా, ఆర్థికంగా నష్టపోయినా ఆయన తన గొంతును వినిపిస్తూనే ఉన్నారని పోనీ వర్మ ఎమోషనల్ అయ్యారు.
గౌరీ లంకేష్ హత్య.. ప్రకాష్ రాజ్‌ను పూర్తిగా మార్చేసింది
ఇంటర్వ్యూలో ప్రకాష్ రాజ్ పొలిటికల్ కామెంట్స్ చేయడంపై భార్యగా మీరెప్పుడైనా ఆందోళన చెందలేదా? అని ప్రశ్నించగా పోనీ వర్మ స్పందిస్తూ.. "ఆరంభంలో నేను చాలా భయపడేదాన్ని. కానీ 2017లో ఆయన ప్రాణస్నేహితురాలు, జర్నలిస్ట్ గౌరీ లంకేష్ దారుణంగా హత్యకు గురయ్యారనే వార్త వినగానే ప్రకాష్ రాజ్ పూర్తిగా కుంగిపోయారు. ఆయన మనసు విరిగిపోయింది. 'నేను ఆమెకు చెబుతూనే ఉన్నాను' అని కన్నీళ్లు పెట్టుకున్నారు. మేమంతా ప్రకాష్ రాజ్ భద్రత గురించి ఎలా భయపడేవారమో, ఆయన కూడా గౌరీ లంకేష్ గురించి అలాగే భయపడేవారు. కానీ ఆమె మరణం ఆయనను తీవ్రంగా కదిలించివేసింది" అని చెప్పారు.
ఒక మహిళగా గౌరీ లంకేష్ సమాజం కోసం ధైర్యంగా నిలబడి గొంతు విప్పినప్పుడు, తాను ఎందుకు మౌనంగా ఉండాలని ప్రకాష్ రాజ్ భావించారని ఆమె తెలిపారు. "మనం ఇంకా ఎంతకాలం భయపడుతూ బతకాలి?" అని ఆయన తనను ప్రశ్నించేవారని పోనీ వర్మ గుర్తుచేసుకున్నారు.
అవకాశాలు పోయాయి.. బ్రాండ్ యాడ్స్ పోయాయి
తన భర్త ముక్కుసూటి తనం వల్ల సినిమా ఇండస్ట్రీలో ఆయన ఎదుర్కొన్న ఇబ్బందుల గురించి పోనీ వర్మ మాట్లాడుతున్నప్పుడు భావోద్వేగానికి గురయ్యారు. "సినిమా ఇండస్ట్రీలో అందరూ హ్యాపీగా సినిమాలు చేసుకుంటూ, డబ్బు సంపాదించుకుంటూ అందరి దృష్టిలో మంచిగా ఉండాలని కోరుకుంటారు. కానీ ప్రకాష్ రాజ్ వేరే దారి ఎంచుకున్నారు. ఆయన మాట్లాడే మాటల వల్ల ఆయన కెరీర్ ఎంతగా దెబ్బతిందో నాకు మాత్రమే తెలుసు" అని పేర్కొన్నారు.
రాజకీయ వ్యాఖ్యల వల్ల ప్రకాష్ రాజ్‌కు రావాల్సిన అనేక బ్రాండ్ ఎండార్స్‌మెంట్లు (యాడ్స్) రద్దయ్యాయని, చేతిలో ఉన్న పెద్ద సినిమాలు కూడా చేజారిపోయాయని ఆమె వెల్లడించారు. వృత్తిపరంగా ఎంతో ఆర్థిక నష్టాన్ని అనుభవించినప్పటికీ.. "నా మనస్సాక్షికి తప్పు అనిపించిన దాన్ని నేను ఎప్పటికీ అంగీకరించను, మౌనంగా ఉండలేను" అని ప్రకాష్ రాజ్ గట్టిగా నిలబడ్డారని ఆమె ప్రశంసించారు.
35 ఏళ్ల గాఢమైన స్నేహం.. '#JustAsking' ఉద్యమం
గౌరీ లంకేష్, ప్రకాష్ రాజ్ మధ్య దాదాపు 35 సంవత్సరాల సుదీర్ఘమైన స్నేహబంధం ఉంది. 2017లో బెంగళూరులోని ఆమె నివాసం వెలుపల గుర్తుతెలియని దుండగులు గౌరీ లంకేష్‌ను కాల్చి చంపిన సంగతి తెలిసిందే. ఆ ఘటన తర్వాత ప్రకాష్ రాజ్ సోషల్ మీడియా వేదికగా పాలకులను, వ్యవస్థను ప్రశ్నిస్తూ #JustAsking అనే హ్యాష్‌ట్యాగ్‌తో నిరసన కార్యక్రమాన్ని ప్రారంభించారు.
ప్రతి సంవత్సరం ఆమె వర్ధంతి సందర్భంగా “మేము నిన్ను పూడ్చిపెట్టలేదు.. కొత్త విత్తనంగా నాటాము. నీ గొంతును ఎప్పటికీ మూగబోనివ్వము” అంటూ #NaanuGauri (నేనే గౌరీ) హ్యాష్‌ట్యాగ్‌తో ప్రకాష్ రాజ్ పోస్ట్‌లు పెడుతూ ఆమె జ్ఞాపకాలను సజీవంగా ఉంచుతున్నారు. ఒక ఆర్టిస్టుగా అవకాశాలు పోయినా, నిందలు ఎదురైనా సమాజం పట్ల తనకున్న బాధ్యతను వీడని ప్రకాష్ రాజ్ ధైర్యాన్ని నెటిజన్లు విశేషంగా ప్రశంసిస్తున్నారు.
ABOUT THE AUTHORHari Prasad Sహరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More

E-Paper


