అలాంటి సినిమాలకు కూడా నేషనల్ అవార్డులు ఇస్తున్నారు.. వాళ్లకు మమ్ముట్టి విలువ తెలియదు: ప్రకాష్ రాజ్ విమర్శలు
ప్రకాష్ రాజ్ మరోసారి కేంద్ర ప్రభుత్వం, నేషనల్ అవార్డుల ఎంపికపై విరుచుకుపడ్డాడు. ఆ అవార్డులు తమ వాళ్లకే ఇస్తున్నారన్నట్లుగా నేషనల్ అవార్డులు రాజీ పడ్డాయని అతడు అనడం గమనార్హం. అలాంటి వాళ్లకు మమ్ముట్టి విలువ తెలియదని అన్నాడు.
కేరళ స్టేట్ ఫిల్మ్ అవార్డుల జ్యూరీ ఛైర్మన్ అయిన ప్రకాష్ రాజ్ ఘాటు కామెంట్స్ చేశాడు. సోమవారం (నవంబర్ 3) సాయంత్రం 55వ కేరళ రాష్ట్ర చలనచిత్ర అవార్డుల విజేతలను ప్రకటించారు. ఈ జాబితాలో 'మంజుమ్మెల్ బాయ్స్', 'భ్రమయుగం' వంటి సినిమాలు పలు అవార్డులను గెలుచుకున్నాయి. ఈ ఏడాది అవార్డులకు జ్యూరీ ఛైర్మన్‌గా ప్రముఖ నటుడు ప్రకాష్ రాజ్ వ్యవహరించాడు. అవార్డుల ప్రకటన అనంతరం ప్రెస్ మీట్ లో అతడు నేషనల్ అవార్డులపై ఘాటు కామెంట్స్ చేశాడు.

జాతీయ అవార్డులపై ప్రకాష్ రాజ్ సంచలన వ్యాఖ్యలు
కేరళ స్టేట్ ఫిల్మ్ అవార్డుల జ్యూరీ ఛైర్మన్‌గా తన అనుభవాన్ని, అలాగే జాతీయ చలనచిత్ర అవార్డుల్లో మమ్ముట్టిని పట్టించుకోకపోవడంపై ప్రకాష్ రాజ్ ప్రశ్నించాడు. దీనికి అతడు ఇచ్చిన సమాధానం ప్రస్తుతం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.
"జాతీయ చలనచిత్ర అవార్డులు రాజీ పడుతున్నాయని చెప్పడానికి నేను అస్సలు సందేహించను. కేరళ అవార్డుల జ్యూరీ ఛైర్మన్‌గా వ్యవహరించడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే, వారు నన్ను పిలిచినప్పుడు.. అనుభవం ఉన్న ఒక బయటి వ్యక్తి అవసరమని, తాము ఈ ప్రక్రియలో తల దూర్చబోమని, నిర్ణయాధికారం పూర్తిగా నాకే ఉంటుందని చెప్పారు" అని ప్రకాశ్ రాజ్ స్పష్టం చేశాడు.
ఈ అంశంపై అతడు మాట్లాడుతూ.. "అయితే నేషనల్ అవార్డుల్లో ఇది జరగడం లేదు. అది మనం చూస్తూనే ఉన్నాం. ఒకే రకమైన వ్యక్తుల ఫైళ్లు, పైల్స్‌కు అవార్డులు వస్తున్నాయి. అలాంటి జ్యూరీ, అలాంటి జాతీయ ప్రభుత్వ విధానాలు ఉన్నప్పుడు.. మమ్ముకా (మమ్ముట్టిని ఆప్యాయంగా పిలిచే పేరు)కు అలాంటి అవార్డులు అవసరం లేదు" అంటూ ప్రకాష్ రాజ్ సంచలన వ్యాఖ్యలు చేశాడు.
మమ్ముట్టి రికార్డు
మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి గతంలో 'మథిలుకళ్', 'ఒరు వడక్కన్ వీరగాథ', 'పొంతన్ మద', 'విధేయన్', 'డా. బాబాసాహెబ్ అంబేద్కర్' వంటి చిత్రాలకుగాను ఉత్తమ నటుడి విభాగంలో మూడుసార్లు జాతీయ అవార్డులను గెలుచుకున్నాడు.
అయితే మమ్ముట్టికి మరిన్ని సార్లు జాతీయ స్థాయిలో గుర్తింపు దక్కాల్సి ఉన్నా, జ్యూరీ అతన్ని విస్మరించిందని గత కొన్నేళ్లుగా ఆయన అభిమానులు ఫిర్యాదు చేస్తున్నారు. తాజాగా ఈ ఏడాది 'భ్రమయుగం' సినిమాకు ఉత్తమ నటుడిగా మమ్ముట్టి కేరళ రాష్ట్ర అవార్డును గెలుచుకున్నాడు. ఈ విజయంతో ఈ విభాగంలో అత్యధికంగా ఏడుసార్లు అవార్డు గెలుచుకున్న నటుడిగా మమ్ముట్టి రికార్డు సృష్టించాడు.
నటుడు మోహన్‌లాల్, నటి ఊర్వశి ఆరుసార్ల చొప్పున ఈ అవార్డును గెలుచుకుని రెండో స్థానంలో ఉన్నారు. ఇక సర్వైవల్ డ్రామాగా రూపొందిన ‘మంజుమ్మెల్ బాయ్స్’ కేరళ రాష్ట్ర చలనచిత్ర అవార్డుల్లో ఉత్తమ చిత్రం అవార్డును గెలుచుకుంది. ఈ సినిమాకు దర్శకత్వం వహించిన చిదంబరం ఉత్తమ దర్శకుడు అవార్డును దక్కించుకున్నాడు.

E-Paper












