నా కూతురు, మహేష్ బాబు కూతురు బాగా ఆడుకున్నారు.. రాజమౌళి ఫామ్‌కు కూడా వెళ్లాం: ప్రియాంకా చోప్రా ట్వీట్
ప్రియాంకా చోప్రా మరోసారి రాజమౌళి, మహేష్ బాబు మూవీతో ఇండియన్ సినిమాకి తిరిగి వస్తున్న విషయం తెలుసు కదా. అయితే ఈ మూవీ షూటింగ్ సందర్భంగా తన కూతురు మాల్తీ.. మహేష్ కూతురు సితారతో బాగా ఆడుకుందని చెప్పింది.
ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న సూపర్ స్టార్ మహేష్ బాబు, ప్రియాంక చోప్రా, ఎస్.ఎస్. రాజమౌళిల భారీ ప్రాజెక్టు ‘గ్లోబ్‌ట్రాటర్’. ఈ సినిమా షూటింగ్ కోసం ప్రియాంకా హైదరాబాద్ లో చాలా రోజులు ఉంది. అయితే ఇక్కడ తాను ఏం చేశానో ఓ అభిమాని అడిగిన ప్రశ్నకు సమాధానంగా ఆమె చెప్పింది.

సితారతో మాల్తీ ఆట
బాలీవుడ్, హాలీవుడ్ స్టార్ నటి ప్రియాంక చోప్రా తన రాబోయే సినిమా 'గ్లోబ్‌ట్రాటర్' (వర్కింగ్ టైటిల్) సందర్భంగా బుధవారం (నవంబర్ 12) సాయంత్రం అభిమానులతో ‘ఎక్స్’ వేదికగా Q&A సెషన్ నిర్వహించింది. ఈ సందర్భంగా ఆమె తన కూతురు మాల్తీ మేరీకి హైదరాబాద్‌లోని షూటింగ్ సెట్‌లో మహేష్ బాబు కూతురు సితారతో, దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి ఫామ్‌హౌస్‌లో గడిపిన అనుభవం గురించి పంచుకుంది.
"మీరు షూటింగ్‌కు వెళ్లినప్పుడు మీ కుటుంబాన్ని సెట్‌కి తీసుకువస్తారా, లేక పనిపై పూర్తిగా దృష్టి పెట్టడానికి ఒంటరిగా వెళ్లడానికి ఇష్టపడతారా? ముఖ్యంగా ఈ #GlobeTrotter సెట్‌లకు?" అని ఒక అభిమాని ప్రియాంకను ప్రశ్నించారు.
దానికి ప్రియాంక బదులిస్తూ ఇలా రాసింది. “నా కూతురు హైదరాబాద్‌లోని సెట్‌కి వచ్చింది. అక్కడ ఆమె మహేష్ బాబు, నమ్రత అందమైన కూతురు సితారతో కలిసి బెస్ట్ టైమ్ గడిపింది. అంతేకాకుండా ఆమె రాజమౌళి ఫామ్‌హౌస్‌కు వెళ్లి అక్కడ ఒక చిన్న దూడను కూడా చూసింది. అదే ఆమెకు అత్యంత ఇష్టమైన జ్ఞాపకం” అని చెప్పింది.
ఈ సందర్భంగా ప్రియాంక తెలుగు చిత్ర పరిశ్రమలో పనిచేయడం గురించి, ఈ సినిమాతో భారతీయ సినిమాకు తిరిగి రావడం గురించి కూడా అభిమానులతో ముచ్చటించింది.
మందాకినిగా ప్రియాంకా చోప్రా
ఇక బుధవారమే ఈ మూవీ నుంచి ప్రియాంకా ఫస్ట్ లుక్ వచ్చిన విషయం తెలిసిందే. మహేష్ బాబు మూవీ ఎస్ఎస్ఎంబీ 29 నుంచి ఈ శనివారం (నవంబర్ 15) బిగ్ రివీల్ చేయనున్న నేపథ్యంలో ఆ టీమ్ నుంచి మరో సర్‌ప్రైజ్ వచ్చేసింది. ఈ ఫస్ట్ లుక్ ను రాజమౌళితోపాటు మూవీ టీమ్ అంతా సోషల్ మీడియాలో షేర్ చేసింది. “గ్లోబల్ స్టేజ్ లో ఇండియన్ సినిమా అర్థాన్ని మార్చేసిన మహిళ. వెల్కమ్ బ్యాక్ దేశీ గర్ల్. ప్రియాంకా చోప్రా.. నీ మందాకిని లెక్కలేనన్ని షేడ్స్ ను ప్రపంచం చూడాలని చాలా ఆతృతగా ఉన్నాను” అని రాజమౌళి ట్వీట్ చేశాడు.
అటు ప్రియాంకా చోప్రా కూడా తన ఫస్ట్ లుక్ ట్వీట్ చేసింది. “ఆమె కంటికి కనిపించేదాని కంటే ఎక్కువే.. మందాకినికి హలో చెప్పండి” అనే క్యాప్షన్ తో ట్వీట్ చేసింది. మహేష్ బాబు ట్వీట్ చేస్తూ.. “మొత్తానికి ఆమె వచ్చేసింది.. మందాకినిని కలవండి” అనే అన్నాడు.
'గ్లోబ్‌ట్రాటర్' సినిమా వివరాలు
ఎస్.ఎస్. రాజమౌళి దర్శకత్వం వహిస్తున్న తదుపరి చిత్రం భారతీయ సినిమా చరిత్రలో అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రాలలో ఒకటి. ఈ చిత్రంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన కోసం నవంబర్ 15న హైదరాబాద్‌లోని రామోజీ ఫిల్మ్ సిటీలో భారీ ఈవెంట్‌ను ప్లాన్ చేశారు.
ఈ ఈవెంట్‌లో సినిమా టైటిల్‌ను ప్రకటించడంతో పాటు చిత్రానికి సంబంధించిన గ్లింప్స్ లేదా టీజర్ ను విడుదల చేస్తారని అభిమానులు అంచనా వేస్తున్నారు. ఈ ఈవెంట్ జియోహాట్‌స్టార్ లో ప్రత్యక్ష ప్రసారం కానుంది.













